Home ఎడిటోరియల్ కట్టడాల దత్తత సబబేనా?

కట్టడాల దత్తత సబబేనా?

edot

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఎడాప్ట్ ఎ హెరిటేజ్’ కార్యక్రమం క్రింద దాల్మియా భారత్ ప్రయివేట్ లిమిటెడ్ కంపెనీకి ఎర్రకోటను దత్తతకిచ్చారు. ఇలా చారిత్రక కట్టడాలను దత్తత ఇవ్వడం గురించి ఇప్పుడు వేడిగా చర్చలు జరుగుతున్నాయి. కట్టడాల బాగోగులన్నీ ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియాయే చూస్తుందని, కేవలం నిర్వహణ మాత్రమే ఈ కంపెనీలు చూస్తాయి కాబట్టి ఇది మంచిదేనన్న వాదన కూడా ముందుకు వస్తోంది.
ఇప్పుడు హైదరాబాదులోని గోల్కొండ కోట, చార్మినార్‌లను కూడా ఎవరికైనా దత్తత ఇవ్వడానికి రెడిగా ఉన్నారట. ఈ సందర్భంగా 17వ శతాబ్దానికి చెందిన నయా ఖిలా ఉదాహరణ ఒకసారి పరిశీలించడం అవసరం. గోల్కొండ కోట కాంప్లెక్సులోనే నయా ఖిలా కూడా భాగం. కొన్ని సంవత్సరాల క్రితం ఒక ప్రయివేటు క్రీడా సంస్థకు ఈ నయా ఖిలా లీజుకు ఇచ్చారు. అప్పటి సంయుక్త ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషనుకు, హైదరాబాద్ గోల్ఫ్ అసోసియేషన్‌కు 2002 లో ఈ లీజు ఒప్పందం కుదిరింది. దీనికి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఢిల్లీ తన ఆమోదాన్ని 2001, నవంబర్ 29న తెలియజేసింది. కాని ఇలా లీజుకు ఇవ్వ డం ప్రాచీన కట్టడాలు, పురాతత్వ ప్రదేశాల చట్టం 1958ని ఉల్లంఘించడమేనని చాలా మంది విమర్శించారు.
లీజుకు తీసుకున్న తర్వాతి నుంచి గోల్కొండ కోట కాంప్లెక్సులోని నయా ఖిలాను గోల్ఫ్ కోర్సుగా వాడుతున్నారు. గోల్ఫ్ కోర్సుకు అవసరమైన విధంగా కోట నిర్మాణాన్ని మార్చారు. నయాఖిలా, గోల్కొండ ఫోర్ట్ గోడలను పడగొట్టారు. అవసరమైన విధంగా గోల్ఫింగ్ కోసం మార్చేశారు. కొందరు అధికారులు దీన్ని అడ్డుకోవాలని ప్రయత్నించారు కాని ఢిల్లీలోని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా స్వయంగా ఆమోదించడం వల్ల ఆ ప్రయత్నాలేవీ ఫలించలేదు. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అప్పటి టూరిజం సెక్రటరీ చందనాఖాన్ గోల్ఫ్ కోర్సు నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.
అసలు ప్రారంభంలో ఇక్కడ పక్షుల అధ్యయనానికి అభయారణ్యాన్ని నిర్మించాలన్నది పథకం. కాని నయా ఖిలాలోని 50 ఎకరాల్లో గోల్ఫ్ కోర్సు నిర్మించాలని అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. అప్పటి సెక్రటరీ (కల్చర్) ఆర్వీవీ అయ్యర్, ఎయస్‌ఐ డైరెక్టర్ జనరల్ , ఎయస్‌ఐ సూపరిండెంటింగ్ ఆర్కియాలజిస్ట్, హైదరాబాద్ సర్కిల్ 1998లో గోల్ఫ్ కోర్సు ప్రతిపాదనను వ్యతిరేకించారు. చట్టం దీనికి అనుమతించదని, కోట లోపలి స్థలంలో గోల్ఫ్ కోర్సు కట్టడం సరికాదని, కోట బయట భూమి సేకరించుకోవాలని చెప్పారు. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర ప్రత్యుత్తరాల కాపీలన్నీ మార్చి 2017లో నేను దాఖలు చేసిన పిటిషనులో ఉన్నాయి.
అయినా 2001, నవంబరులో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఈ ప్రతిపాదనను ఆమోదించింది. గోల్కొండ- నయాఖిలా కోట లోపల 50 ఎకరాల స్థలంలో గోల్ఫ్ కోర్సుకు అనుమతించింది. ఈ అనుమతి ఆధారంగా హైదరాబాద్ గోల్ఫ్ అసోసియేషన్‌కు, టూరిజం డిపార్టుమెంటుకు మధ్య ఒప్పందం కుదిరింది.
ఇప్పుడు హైదరాబాద్ గోల్ఫ్ అసోసియేషను నయా ఖిలా లోపల ప్రజలు ప్రవేశించడంపై కూడా ఆంక్షలు పెట్టింది. ఈ చారిత్రక కట్టడం చూడ్డానికి వచ్చినవారు గోల్ఫ్ అసోసియేషను వారు అనుమతించిన ప్రదేశంలోకి మాత్రమే వెళ్ళగలరు. పైగా సందర్శకుల పేర్లు, మొబైల్ నెంబర్లు తదితర వివరాలన్నీ ఈ అసోసియేషను భద్రతా సిబ్బంది ముందు రిజిష్టరులో రాయాలి. ఇలా రిజిస్ట్రేషన్ ఎందుకు చేసుకోవాలని ప్రశ్నించిన టూరిస్టులను ఈ గోల్ఫ్ అసోసియేషన్ గార్డులు వెంటాడ్డం జరుగుతోంది. కోట గోడలపై సిసిటివి కెమెరాలు పెట్టారు. టూరిస్టులు చూడదగ్గ ప్రదేశాల చుట్టూ ముళ్ళ కంచెలు వేశారు. “గోల్ఫ్ కోర్స్ ప్రాజెక్ట్‌”, “అనుమతి లేకుండా ప్రవేశిస్తే శిక్షార్హులు” వంటి బోర్దులు చాలా చోట్ల పెట్టారు.
కోటలో చబుతరాలు గోల్ఫ్ కోర్సు కోసం వాడుకుంటున్నారు. గోల్ఫు బాల్ ఉంచే ‘టీ’ గా ఉపయోగిస్తున్నారు. అలాగే గోల్ఫు బాల్ ఆడడానికి కోట గోడలపై, వివిధ స్థాయిల్లోను, నీళ్ళ లోపల ఇలా చాలా చోట్ల తమకు అవసరమైన నిర్మాణాలు చేసుకున్నారు. ఇప్పుడు కోటగోడలో కేవలం 10 శాతం మాత్రమే ప్రజల ప్రవేశానికి ఉంది. 13 బురుజులు, ఫిరంగి, నిఘా టవర్, సొరంగాలు ఇవేవీ సందర్శకులు చూడ్డానికి అవకాశం లేదు. ఈ ప్రాంతంలో గోల్ఫ్ కోర్సు వాతావరణమే తప్ప ఒక చారిత్రక కట్టడం వాతావరణం ఇప్పుడు మిగల్లేదు. నయా ఖిలా చెరువుకు కట్టిన రాతి కట్టను పేల్చివేశారు. కుతుబ్ షాహీ గార్డెన్స్ కు నీరు సరఫరా చేసిన అప్పటి కాల్వలను పూడ్చేశారు. నయా ఖిలా తలాబ్ కనుమరుగైంది. ఈ చారిత్రక కట్టడానికి జరుగుతున్న నష్టంపై కోర్టు కేసులు పడ్డాయి.
గోల్కొండ కోట వరల్డ్ హెరిటేజ్ జాబితాలో ఉంది. 2009లోనే ఎయస్‌ఐకి యునెస్కో ఒక లేఖ రాసింది. గోల్కొండ కోటలో గోల్ఫ్ కోర్సు వల్ల నష్టాలను తెలియజేసింది. కోటను, కోట పరిసరాలను కాపాడ్డానికి తీసుకున్న చర్యలేమిటో చెప్పాలని కోరింది. 2009లో అంతర్జాతీయంగా చాలా ఒత్తిడి కూడా వచ్చింది. శాన్ జో స్టేట్ యూనివర్శిటీకి చెందిన రాబర్ట్ సింప్కిన్స్ ఎయస్‌ఐకి లేఖ రాసి కోట హెరిటేజ్ హోదాను దీనివల్ల కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. లైసెన్స్ ప్రకారం హైదరాబాద్ గోల్ఫ్ అసోసియేషన్ ఏడాదికి ఎకరానికి ఒక్క రూపాయి ఫీజు చెల్లిస్తుంది. హైదరాబాద్ గోల్ఫ్ ఇంత భారీ స్థాయిలో ప్రభుత్వ సహాయం పొందుతున్నప్పటికీ ఒక్క ఆర్‌టిఐ దరఖాస్తుకీ సమాధానమివ్వలేదు. సభ్యులు, సభ్వత్వ రుసుము గురించి చెప్పలేదు. ఆర్‌టిఐ చట్టం తమకు వర్తించదని అన్నారు.
చారిత్రక కట్టడాలను ఆధునిక నిర్మాణాల కాలుష్యం తాకకుండా కాపాడుకోవాలి. అందువల్ల వాటిని ప్రయివేటు కంపెనీలకు నిర్వహణ కోసం ఇవ్వడం మంచిదికాదని తెలుస్తోంది. ఎందుకంటే, అలా దత్తత తీసుకున్న ప్రయివేటు కంపెనీలు చారిత్రక కట్టడాల నిర్మాణంలో మార్పులు చేస్తే అది శాశ్వత నష్టమే అవుతుంది. గోల్కొండ, నయా ఖిలా కోట లోపల గోల్ఫ్ కోర్సుకు ఎయస్‌ఐ ఆమోదించడంలోనే లోపం ఉంది. ఇప్పుడు ఈ విషయం కోర్టులో ఉంది. ఇప్పుడు ‘మాన్యుమెంట్ మిత్ర’ క్రింద ఒక ప్రయివేటు సంస్థ ఈ కోట నిర్వహణ చూస్తానని ముందుకు రావడం ప్రశ్నించదగినది.