Home జాతీయ వార్తలు మహా నేతగా నితీశ్

మహా నేతగా నితీశ్

20న బీహార్ సిఎంగా ప్రమాణ స్వీకారం
pageపాట్నా : బీహార్ అసెంబ్లీకి మహా కూటమి శాసనసభా పక్ష నాయకుడిగా నితీష్‌కుమార్ ఎన్నికయ్యారు. కూట మి తరపున నూతనంగా ఎన్నికయిన శాసనసభ్యులంతా శనివారంనాడు నితీష్‌ను తమ శాసనసభాపక్షనేతగా లాంఛనప్రాయంగా ఎన్నుకున్నారు. దీంతో, ఆయన ఈ నెల 20న బీహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. బీహార్ రాజధాని పాట్నాలోని గాంధీ మైదానంలో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. శనివారం సాయంత్రం రాష్ట్ర గవర్నర్ రాంనాథ్ కోవింద్ నుంచి లాంఛనంగా ఆహ్వానం అందింది. అనంతరం నితీష్‌కుమార్ విలేకరులతో మాట్లాడుతూ మహా కూటమిలో ఆర్‌జెడి, జెడి(యు), కాంగ్రెస్ పార్టీలు భాగస్వామ్యపక్షాలుగా ఉన్నాయని తెలిపారు. ఈ మూడు పార్టీలు ప్రభుత్వంలో భాగస్వాములని చెప్పారు. శనివారం ఉదయం నూతన ప్రభుత్వం ఏర్పాటు ప్రక్రియపై చర్చలు జరిగాయి. రాష్ట్ర కేబినెట్ ప్రస్తుత అసెంబ్లీని రద్దును సిఫారసు చేసింది. నితీష్‌కుమార్‌ను మహాకూటమికి చెందిన ఎమ్మెల్యేలంతా ఆర్‌జెడి చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ సమక్షంలో తమ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. అనంతరం నితీష్ రాష్ట్ర గవర్నర్‌ను కలిసి ఈ విషయాన్ని ఆయనకు వివరించారు.దీనిపై స్పందించిన గవర్నర్ రాష్ట్రంలో నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కోరారు.