Home ఎడిటోరియల్ మన్యం వీరుడు బిర్సా

మన్యం వీరుడు బిర్సా

edit

ఈ భూమి మీద ప్రతిరోజు ఎంతోమంది జన్మిస్తుంటారు. మరెంతో మంది మరణిస్తుంటారు. కొన్ని జన్మలు మాత్రం చరిత్రలో నిలిచిపోతాయి. ఈ కోవలోని వాడే మన “బిర్సా”.
భూమికోసం, భుక్తి కోసం గిరిపుత్రుల స్వేచ్ఛా, స్వాతంత్య్రాల కోసం సమరశంఖాన్ని పూరించి, శతాబ్ధాల బ్రిటీష్ ఆరాచక పాలనపై ఉక్కు పిడికిలి బిగించిన సాయుధ విప్లవ కొదమసింహం, మన్యం వీరుడు అల్లూరి కంటే ఐదు దశాబ్దాల ముందే ఆయుధం పట్టిన ధీరుడు “బిర్సా ముండా”.
బ్రిటీష్ దొరల అండదండలతో గిరిజన ప్రాంతాలను భూస్వాములు, జాగీర్‌దారులు ఆక్రమించి గిరిజనుల భూమిపై ఆధిపత్యం చెలాయిస్తున్న రోజులవి. బ్రిటీష్ ప్రభుత్వ అరాచక పాలనలో ఆదివాసులకు అడవిపై హక్కు ఉండేది కాదు. 19వ శతాబ్ధం చివరలో ప్రజాగ్రహం కట్టలు తెంచుకొని ఈ క్రూరమైన దోపిడికి, ఆధిపత్యానికి, దురాగతాలకు వ్యతిరేకంగా గిరిపుత్రులు మారణ యుద్ధం చేశారు. ఇటువంటి ఎన్నో అణిచివేతలకు గురికాబడినటువంటి చోటానాగ్‌పూర్ ప్రాంత ప్రజలకు బిర్సా ఆరాధ్యుడు.
నిత్యం పేదరికం, బాధలతో ఉండే చోటానాగ్‌పూర్ ప్రాంతం, ఒకవైపు ఆకలితో మరోవైపు భూస్వాముల బ్రిటీష్ పాలకుల దోపిడీ, అణిచివేతలతో కారు చీకట్లలో కప్పబడి ఉండేది. ఈ ప్రాంతంలోని ఉలిహాటు అనే గ్రామంలో నవంబంర్ 15, 1875వ సంవత్సరంలో సుగుణా ముండా, కార్మిహటు అనే దంపతులకు బిర్సా జన్మించాడు. తన బాల్యం మొత్తం తీవ్రమైన పేదరికంలో, ఆకలితో గడిపాడు. తన తల్లిదండ్రుల అతి పేదరికం కారణంగా బిర్సా కొన్ని రోజులు తన మేనత్త దగ్గర, మరికొన్ని రోజులు తన మేనమామ దగ్గర ఉండాల్సి వచ్చింది.
తన మేనమామ దగ్గర ఉండే రోజులలో జయపాల్ నాగ్ అనే ఉపాధ్యాయుడి సహకారంతో బిర్సా ప్రాథమిక విద్యాభ్యాసాన్ని ప్రారంభించాడు. ఆ తరువాత ప్రాథమికోన్నత విద్యాభ్యాసం కోసం మిషనరీ పాఠశాలలో ప్రవేశం పొందాడు. అయితే ఆ రోజులలో చదువుతో పాటు, మత మార్పిడి కూడా జరిగేది. తన చదువు కోసం బిర్సా, తన తండ్రి బాప్తిజాన్ని స్వీకరించారు.
ప్రభుత్వ అధికారుల సహకారంతో మిషనరీలు గిరిజనుల భూములను ఆక్రమించుకునే పనిని మొదలు పెట్టాయి. ఈ యుక్తులకు వ్యతిరేకంగా ముండా తెగ ప్రజలు పెద్ద ఎత్తున పోరాటం చేశారు. బిర్సా తన ఉపాధ్యాయుల ద్వారా యూనియన్ ప్రజలు తమ భూమి మీద అతి తక్కువ శిస్తులు చెల్లిస్తారని తెలుసుకొని, శిస్తులను బహిష్కరించాలని తన ప్రజలకు పిలుపునిస్తాడు. ఒక రోజు మిషనరీ మతపెద్ద తరగతి గదిలో ముండాల పోరాటాన్ని తీవ్రంగా ఖండిస్తుండగా, బిర్సా ఒక్క ఉదుటున లేచి నిరసన వ్యక్తం చేశాడు.
తొలిదశ ఉద్యమం : 1894వ సంవత్సరంలో బ్రిటీష్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అటవీ హక్కు చట్టం (1882), భూస్వాములకు పూర్తి స్వేచ్ఛనిచ్చింది. పాలమూ, మన్‌భవ్‌ు, చోటానాగ్‌పూర్ ప్రాంతాలలోని గిరిజన భూములను బలవంతంగా స్వాధీనపరచుకొని వారిని ఇళ్ళ నుండి కూడా తరిమికొట్టారు. ఈ దురాగతాలకు వ్యతిరేకంగా బిర్సా ఆరు గ్రామాల ప్రజలను ఐక్యం చేసి ప్రభుత్వానికి మెమోరాండాన్ని అందించారు. కానీ ఫలితం దక్కలేదు. ప్రభుత్వం వారి డిమాండ్లను పూర్తిగా తిరస్కరించింది. ఈ పరిణామాలని గమనించిన బిర్సా కేవలం భూస్వాములు, జాగీర్‌దారుల మీద పోరాటం చేస్తే సరిపోదని, వలసవాద బ్రిటీష్ ప్రభుత్వం మీద కూడా చేయాలని నిర్ణయించుకున్నాడు.
ధర్‌తీ ఆవా (భూమికి దేవుడు) :
తన జాతి చైతన్యం కోసం, అంధ విశ్వాసాలను దూరం చేసి అందరినీ ఐక్యం చేయడం కొరకు కొన్ని నియమాలు విధించాడు.
1.మతపరమైన కార్యక్రమాలలో జంతుబలుల నిషేధం. 2.మధ్యపాన నిషేధం 3.అబద్ధం చెప్పకూడదు. దొంగతనం చేయరాదు. 4.పెద్దవారిని గౌరవించాలి. 5.అందరినీ ప్రేమించాలి, ద్వేషా న్ని,శత్రుత్వాన్ని తొలగించుకోవాలి.
6.శరీరాన్ని, మనస్సును పవిత్రం గా ఉంచుకోవాలి.
అత్యంత తక్కువ వ్యవధిలో ఈ ఉద్యమం ముండా తెగ ప్రజలలో నూతన విశ్వాసాన్ని నింపడంతోపాటు ఉద్యమ సైద్ధాంతిక శక్తిని కూడా పెంచింది. చుట్టప్రక్కల అనేక గ్రామాల ప్రజలతో చల్‌కాడ్ ప్రాంతం జనసంద్రం అవ గా, 20సంవత్సరాల ఆ యువ కుడిని ప్రజలు వారి నాయకుడిగా ఎన్నుకున్నారు. ఆ నాయకుడినే వారి తండ్రిగా పిలుచుకునేవారు. అలి బిర్సా ముండా “దరతీ ఆవా”(భూమికి దేవుడు)గా పేరు గడించాడు.
ప్రజాఐక్యతను పెను ముప్పుగా భివించిన భూస్వాములు, మిషనరీలు బిర్సా మీద వ్యతిరేక ప్రచారం మొదలుపెట్టాయి. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకువచ్చి బిర్సాను, తన అనుచరులను 24 సెప్టెంబర్ 1895లో అరెస్ట్ చేయించారు.
విడుదల మలిదశ ఉద్యమం : రెండు సంవత్సరాల తర్వాత జైలు నుండి విడుదలైన బిర్సా సాయుధ బలగాన్ని నిర్మించిన ఆవశ్యకతని గుర్తిస్తాడు. రాత్రి పగలు అనే తేడా లేకుండా తీవ్రమైన కరువు, వ్యాధుల మీద ఆయన చేసిన పోరాటం అక్కడి ప్రజలను ఎంతో ఆలోచింపచేయసాగాయి. సాయుధ తిరుగుబాటు చేసి, దోపిడికి గురికాబడే పీడిత వర్గాలను ఏకం చేసి దీర్ఘకాలిక ఉద్యమాన్ని నడపాలని పిలుపునిచ్చాడు. డిసెంబర్ 24, 1899న రాంచీ, చాయ్‌భాషా ప్రాంతాలలో మొదలైన తిరుగుబాటు అత్యంత తక్కువ వ్యవధిలో చుట్టు ప్రక్కల ప్రాంతాలకు వ్యాపించింది. పోలీసులను, భూస్వాములను, వ్యాపారులను తనను హింసించిన వారినందరినీ కసి తీరా కడతేర్చారు. జనవరి 7, 1900వ సం॥రం నాడు రెండు కంపెనీల మిలటరీ బలగాలతో బ్రిటీష్ ప్రభుత్వం గిరిపుత్రుల మీత తూటాల వర్షం కురిపించింది. అక్కడితో ఆగకుండా గ్రామాల మీద దాడులు చేశారు. అత్యాచారాలు, హత్యలు, దోపిడి ఒక విధంగా చెప్పాలంటే ఊళ్ళను వళ్ళకాడులా మార్చేశారు.
బిర్సా ముండాను పట్టుకోవడానికి ఎంతోమంది అమాయక గిరిజనులను హింసించి, అంతిమంగా డబ్బుకు అమ్ముడు పోయిన ఒక ద్రోహి ద్వారా బిర్సాను పట్టుకోగలిగారు. మార్చి 3, 199ం సం॥రంల నాడు తమ ప్రియతమ నాయకుడిని చూడటానికి వేలాది మంది గిరిజనులు చాయ్‌భాషా జైలుకు తరలివెళ్ళారు.
బిర్సాను ఉరితీస్తే పరిస్థితి అదుపుతప్పుతుందని భావించిన అధికారులు, కేసు కోర్టులో ఉండగానే ఆహారంలో విషం కలిపి చంపేశారు. బయటి ప్రపంచానికి మాత్రం కలరా వ్యాధి రావడం వలన చనిపోయాడని నమ్మించే ప్రయత్నం చేశారు. ఆనాడు దురాగతాలకు, దోపిడికి, అన్యాయానికి హింసకు వ్యతిరేకంగా పోరాడి నేలకొరిగిన ఆ అమరుడి త్యాగం, గొప్పతనం, నేడు దోపిడికీ, అణివేతలకు వ్యతిరేకంగా పోరాడే ప్రతి ఒక్కరికి స్ఫూర్తి. బిర్సా స్ఫూర్తితో అధిక సంఖ్యలో ఉన్నటువంటి బాధిత, పీడిత బహుజన ప్రజానీకం ఏకం అయి మన రాజ్యాన్ని మనమే పాలించుకోవాలి.
* మూడ్ శోభన్ నాయక్,

                                                                                                      రాష్ట్ర కార్యదర్శి, ట్రైబల్ స్టూడెంట్స్ ఫెడరేషన్(టిఎస్‌ఎఫ్)
                                                                                                                                                     99497 25951