Home ఎడిటోరియల్ అమిత్ షా వ్యూహానికి హంసపాదు

అమిత్ షా వ్యూహానికి హంసపాదు

Amith-shahతెలంగాణలో బిజెపిని అధికారంలోకి తేవాలని పట్టుదలగా ఉన్న బిజెపి అధ్యక్షుడు అమిత్ షా వ్యూహం మొదటిలోనే తడబడిపోయింది. ఆయన ఇదేపనిమీద ఇటీవల పన్నెండు రోజులలోనే హైదరాబాద్‌కు రెండు సార్లు వచ్చిపోయారు. మొదట మే 29న వచ్చినపుడు తెలంగాణ బిజెపి ముఖ్యనాయకులతో సమావేశమై, ఈసారి రాష్ట్రంలో తమ అధికారం ఖాయమని, మొత్తం దక్షిణాదిలో అధికార సాధనకు తెలంగాణ ముఖద్వారం కాగలదని అన్నారు. అందుకోసం ప్రత్యేక వ్యూహంతో రంగంలోకి దిగబోతున్నామని కూడా అన్నారు. తర్వాత జూన్ 10న రెండవసారి వచ్చినపుడు సూర్యాపేటలో జరిగిన బహిరంగసభలో ప్రసంగిస్తూ, తమ నాయకత్వా న గల కేంద్రప్రభుత్వం తెలంగాణ అభివృద్ధి కోసం గత రెండేళ్లలో 90వేలకోట్ల రూపాయలిచ్చిందని, అందుకు ప్రతి రూపాయికి తాము లెక్కలు చెప్పగలమని, కాని ఆ నిధులు ప్రజలకు చేరటం లేదని అన్నారు. తాము అధికారానికి వస్తేనే అభివృద్ధి జరుగుతుందని ప్రకటించి పోయారాయన.

ఇంతవరకు బాగానే ఉంది. తెలంగాణలో అధికారా నికి రావాలని కోరుకోవటం, వచ్చేసారి అధికారం తమదే ననటం, అందుకోసం తమకు ప్రత్యేక వ్యూహం ఉందన టంలో ఆక్షేపించదగ్గదేమీ లేదు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిన నిధుల లెక్కచెప్పటం, అవి సద్వినియోగం కావటం లేదని ఆరోపించటం లోనూ అభ్యంతరం ఉండనక్కరలేదు. కాని ఇక్కడ చిన్న జాగ్రత్త లు కొన్ని తీసుకోవాల్సింది ఆయన. నిధుల లెక్కసరిగా చెప్పటం అవి ప్రజలకు చేరటం లేదన్న విమర్శకు ఆధారాలు చూపటం అవసరం. కాని రెండూ చేయలే దాయన. చేసివుంటే ఇక్కడి ప్రజలలో విశ్వసనీయత ఏర్పడేది. తన వ్యూహం అమలుకు ఒక గొప్ప ఆరంభం జరిగి ఉండేది. ప్రజలు వచ్చేసారి అధికారాన్ని అప్పగిం చేందుకు ఇది తొలి అడుగయేది. బహుశా అధికార సాధనకు గల తొందరపాటులో కావచ్చు ఆయన ఈ జాగ్రత్తలు తీసుకోలేదు.

బిజెపి జాతీయ అధ్యక్షుని బహిరంగ ప్రసంగానికి సహజంగానే రాష్ట్రంలోని అధికారపక్షంనుంచి, ప్రభుత్వంలోని బాధ్యులనుంచి స్పందనలు వచ్చాయి. ఒకవేళ అమిత్ షా మాటలలో కొంత నిజం ఉన్నా వారు తేలుకుట్టిన దొంగలవలె ఉండేవారేమో. స్పందనలు మొక్కుబడిగా, ఏ వివరాలు కూడా నిర్దిష్టంగా లేకుండా కన్పించేవి. కాని అట్లా జరగలేదు. అందరూ ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. అమిత్ షా ఆరోపణలు ఆర్థిక సంబంధమైనవి గనుక, స్పందన ప్రధానంగా ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్‌నుండి వచ్చింది. 90వేల కోట్లన్నది “తప్పుడు లెక్క” అని, 36 వేల కోట్లు మాత్రమే నన్నది ఆయన చెప్పిన మొదటి మాట. ఇంకా ఖచ్చితంగా పేర్కొనాలంటే రూ.35,290 కోట్లు. ఈ మొత్తాన్ని మామూలుగానైతే 35 వేల కోట్లకు రౌండ్ ఆఫ్ చేయాలి. కాని మర్యాద కోసం కావచ్చు ఆయన ఉదారంగా 36వేలకోట్లకు చేసారు. పోతే, ఆ నిధులను 14వ ఆర్థిక సంఘం సిఫార్సులపై దేశంలోని అన్ని రాష్ట్రాలకు నిబంధన ల ప్రకారం అందజేసే పద్ధతిలోనే తెలంగాణకు ఇచ్చారు తప్ప అంతకన్న అదనం ఏమీ లేదన్నది రెండవమాట. పైగా ఇది బిజెపి స్వంత సొమ్మేదీ కాదు. ఇక మూడవ విషయం ఆ నిధులు ప్రజలకు చేరటం లేదన్నది. దాని అర్థం దుర్వినియోగం జరుగుతున్నదని, అవినీతి పాలవుతున్నదని, లేదా కనీసం ఖర్చు చేయటం లేదన్నది. ఈ మాటకు ఆరోపణ స్వభావం ఉన్నది గనుక అందుకు ఆధారాలు చూపవలసి ఉంటుంది. కాని అమిత్ షా అటువంటిదేమీ చేయలేదు.

10వ తేదీన సూర్యాపేట సభ, 11 నాడు రాష్ట్ర అధికార పక్షం ఎదురుదాడితో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. ఇప్పుడిక ప్రతిస్పందన రావలసింది బిజెపి జాతీయ అధ్యక్షుడినుంచి, ఆ పార్టీ రాష్ట్ర నాయకుల నుండి. కాని రోజులు గడిచిపోతున్నా అటువంటిదేమీ కన్పించలేదు. రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలు వేరు. అవి ఎప్పుడూ ఉండేవే. కాని పైన ప్రస్తావించు కున్నవి నిర్దిష్టమైన ఆర్థికాంశాలు. వేలకోట్ల రూపాయల ప్రశ్న. అభివృద్ధికోసం వాటిని వినియోగిస్తున్నారా లేక దుర్వినియోగం చేస్తున్నారా అన్న సమస్య. దీనికి ఇంత ప్రాముఖ్యత ఏర్పడటానికి మరొక కారణం కూడా ఉంది. టిఆర్‌ఎస్ ప్రభుత్వం అభివృద్ధి చేయటం లేదని, కేంద్రం నిధులిచ్చినా చేయలేదని, కేంద్రంలోని తమ ప్రభుత్వపు ప్రధాన నినాదమే అభివృద్ధి అని, తాము అధికారంలో ఉన్న చోటనల్లా దానిని సాధిస్తున్నామని (ఇవి అమిత్ షా మాటలే), అదే పద్ధతిలో తెలంగాణ అభివృద్ధి చెందా లంటే ప్రజలు అధికారాన్ని తమకు అప్పగించాలనే మాటలన్నింటికీ ఈ 90వేల కోట్లు అనే సంఖ్యతో సంబంధం ఉంది. అమిత్‌షా అనే ప్రత్యేక వ్యూహంలో దీనికి కీలక స్థానం ఉంది. అందువల్లనే ఈ విషయం గురించి ఇంతగా చర్చించవలసి వస్తున్నది. ఒకవేళ ఆయన అన్నవన్నీ నిజమైన పక్షంలో తెలంగాణ ప్రజలు వచ్చేసారి టిఆర్‌ఎస్‌ను ఎందుకు గెలిపించాలి? తప్పకుండా బిజెపికే అధికారం అప్పగించాలి.

కాని 11వ తేదీ తర్వాత పలు దినాలు గడిచినప్పటికీ బిజెపి వైపు నుంచి ఎప్పటివలెనే రాజకీయపు మాటలు మినహా, తమ వ్యూహంలో కీలక స్థానం గల ఈ విషయం పై ఎటువంటి ప్రతిస్పందనలు లేవు. వారన్నది నిజమైతే కేంద్రంలోని తమ ప్రభుత్వం నుంచి వివరాలు తెప్పించేం దుకు ఒకే ఒక గంటకు మించి అవసరం లేదు. కాని గంటలు కాదుగదా రోజులు గడుస్తున్నా ఆ పని చేయలేక పోతున్నారంటే, అమిత్‌షా సూర్యాపేట మాటలు నిజం కాదని భావించవలసి వస్తున్నది. ఆ విధంగా రాష్ట్ర ప్రజలకు బిజెపి గురించిన వ్యవహారం మొదలు కావటమే నమ్మకంతో గాక అపనమ్మకంతో జరుగుతున్న దన్నమాట. యథాతథంగానే ఇక్కడ బిజెపి మహా బలహీనంగా ఉంది. బలహీనత అనేక రూపాలలో కన్పిస్తున్నది. నిజమైన అర్థంలో చెప్పుకోవాలంటే బలం అనదగ్గది ఒక్కటంటే ఒక్కటైనా లేదు కదా. ఎంతసేపూ ముస్లింలకు వ్యతిరేకంగా హిందువులను రెచ్చగొట్టటమే తమ బలమని వారు భావిస్తే వేరు. కాని అది కూడా వారు పడే తాపత్రయమే తప్ప, అటువంటిదేమీ తెలంగాణాలో జరగటం లేదు.

విషయమేమంటే, అమిత్‌షా ప్రత్యేక వ్యూహారంభం ఈ విధంగా ఒక పెద్ద వైఫల్యంలో మొదలైంది. ఆయన మాటలకు స్పందించిన తెలంగాణ మంత్రులు, పార్టీ బాధ్యులు పనిలోపనిగా, గత రెండేళ్లలో రాష్ట్రం పదేపదే కోరినా కేంద్రప్రభుత్వం చేయనిది ఏమిటో, ఇవ్వని నిధులేమిటో, విభజన చట్టాన్ని అనుసరించి జరగవలసి ఉన్నా జరగనిదేమిటో, అందువల్ల రాష్ట్రానికి ఎదురవు తున్న సమస్యలేమిటో, మరొకవైపు టిడిపి తమ మిత్ర పక్షం అయిన ఆంధ్రప్రదేశ్‌కు అనుకూల పక్షపాతాన్ని కేంద్రం ఎట్లా చూపుతున్నదో చాలానే ఏకరువు పెట్టారు. వీటన్నింటికి కూడా బిజెపి నాయకులనుంచి సమాధానా లు లేకపోయాయి. ఇవన్నీ ప్రజలు ఆసక్తికరంగా గమనించారు. దానితో అంతిమంగా బిజెపి పట్ల విశ్వాసం కలగటం మాట అట్లుంచి, పాత అవిశ్వాసాలు బలపడ్డాయి. కొత్త అవిశ్వాసాలు కొన్ని మొదలయ్యాయి. రానున్న ఎన్నికలకు ఇంకా మూడు సంవత్సరాలు మిగిలి ఉండగా, తాము ‘ఊరూరికి బిజెపి, ఇంటింటికి మోడీ’ అనే పద్ధతిలో వెళ్లి ప్రచారం చేయగలమని తెలంగాణ బిజెపి నాయకులు ప్రకటించారు. పార్టీని బూత్‌స్థాయి నుంచి నిర్మించగలమని జాతీయ అధ్యక్షుడు చెప్పారు.

ఆలోచనలు బాగానే ఉన్నాయి. ఈ పద్ధతిలోనే ఇతర రాష్ట్రాలలో విజయం సాధించినట్లు కూడా అమిత్‌షా పేర్కొన్నారు. కాని, ఇదంతా మాటలను దాటి చేతలలోకి వెళ్లినపుడు, పైన పేర్కొన్న అసత్యాలు, అవిశ్వసనీయతల ప్రస్తావనలు తెలంగాణ ప్రజలనుంచి ఎదురైనట్లయితే చెప్పగల సమాధానాలేమిటి? ఇక్కడి ప్రజల పరిజ్ఞానాలు, చైతన్యాల గురించి బిజెపి నాయకత్వానికి తెలియదా? తెలంగాణలో బలపడేందుకు గత ఎన్నికల నుంచే పార్టీ ప్రయత్నిస్తున్నది. రాష్ట్రానికి తాము ప్రాధాన్యత నిస్తున్నామని ప్రకటించడం, రాష్ట్ర నాయకులకు వరుసగా సూచనలు చేయటం, అమిత్‌షా స్వయంగా హైదరాబాద్ రావటం వంటివేమీ కొత్తకాదు. కాకపోతే, రెండేళ్లు ఆషామాషీగా గడిచిన తర్వాత, ఈ సరికి ఇక్కడ టిడిపి కనుమరుగవుతూ కాంగ్రెస్ బలహీనపడుతున్నం దున, వారికి కొత్త అంచనాలు ఏర్పడుతున్నాయను కోవాలి. ఇపుడు చూపుతున్న కొత్త పట్టుదల అందుకే ననాలి. కాని ఈ దశలో వారి మొట్టమొదటి అడుగే ఒక పెద్ద తడబాటుతో ఆరంభమైంది.

– 9848191767