Home ఎడిటోరియల్ రాజును మించిన రాజభక్తి

రాజును మించిన రాజభక్తి

PM Modi speak in BJP Parliamentary Board meeting Today

సరిగ్గా ఏడేళ్ల కిందట అంటే 2011 మే 19వ తేదీన నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ట్విట్టర్‌లో ఓ ‘మహత్తరమైన’ సందేశం పంపారు. ‘కర్నాటక గవర్నర్ (హన్స్‌రాజ్ భరద్వాజ్) భారత ఫెడరల్ విధానాన్ని ధ్వంసంచేస్తున్నారు. ఆయనను వెనక్కు పిలిపించాలని రాష్ట్రపతిని కోరాలని ప్రధానమంత్రిని (మన్మో హన్‌సింగ్) అభ్యర్థిస్తున్నాను’ అన్నది ఆ సందేశం. అప్పు డు కర్నాటక ముఖ్యమంత్రిగా ఉన్నది గురువారం నాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన యడ్యూరప్పే. ఏడేళ్ల కిందట తమపార్టీకి చెందిన యడ్యూరప్ప పదవికి ముప్పువచ్చినందువల్ల నరేంద్రమోదీకి హఠాత్తుగా ప్రజా స్వామ్యం, ఫెడరల్ వ్యవస్థ గుర్తుకొచ్చాయి. ఇప్పుడు అదే మోదీ నాయకత్వంలో ప్రస్తుత కర్నాటక గవర్నర్ వాజూ భాయ్ వాలా సకల ప్రజాస్వామ్య నియమాలను తుంగలో తొక్కి యడ్యూరప్పచేత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించడం మోదీకి అప్రజాస్వామికంగా కనిపించలేదు. తేడా ఏమిటంటే అప్పటి గవర్నర్ కాంగ్రెస్ అనుకూలుడు. ఆ గవర్నర్ చర్యవల్ల బాధితుడు బిజెపి నాయకుడు యడ్యూరప్ప. ప్రస్తుతం కర్నాటక గవర్నర్ వాజూభాయ్ వాలా బిజెపి అనుకూలుడు. మోదీకి నమ్మినబంటు. ఎన్నికలలో ప్రజలమద్దతు సమకూరితే అధికారం చేపట్టడా నికి ఏ పక్షానికైనా అవకాశం ఉంటుంది. ఆ అవకాశాన్ని లాగేసి మెజారిటీలేకపోయినా అధికారపీఠ మెక్కడంలో మోదీ, అమిత్ షా నాయకత్వంలోని బిజెపి ఎంతకైనా తెగిస్తోంది. ప్రభుత్వం ఏర్పాటుకు తగిన మెజారిటీ లేకపోయినా యడ్యూరప్ప కర్నాటక ముఖ్యమంత్రి కావ డం ఈ నాయకద్వయం పన్నాగంలో సరికొత్త అధ్యాయం మాత్రమే. 2017లో గోవా, మణిపూర్ రాష్ట్రాలలో అతిపెద్ద రాజకీయపక్షంగా అవతరించకపోయినా బిజెపి అధికార పీఠాన్నికబళించింది. 40 స్థానాలున్న గోవా శాసనసభలో 2017లో కాంగ్రెస్ 17 సీట్లుసాధించి అతిపెద్ద పక్షంగా అవతరిస్తే 12 స్థానాలతో అధికారానికి ఆమడ దూరంలో నిలిచింది. కాని మహారాష్ట్ర గోమంతక్ పార్టీ, జి.ఎఫ్.పి.తో ఎన్నికల తర్వాత పొత్తుకుదుర్చుకుని కడకు బిజెపి అధికార పీఠమెక్కింది.
అదే సంవత్సరం 60 స్థానాలున్న మణిపూర్ శాసన సభలో బిజెపికి దక్కింది 21సీట్లే. కాంగ్రెస్‌కు 28 స్థానాలు వచ్చినా అధికారంలోకి రాలేదు. అక్కడా ఎన్నికల తర్వాత బిజెపి ఇతర పార్టీలతో పొత్తుకుదుర్చుకుని ముఖ్యమంత్రి స్థానాన్ని కైవసం చేసుకుంది. ఒక ఇండిపెండెంట్ శాసన సభ్యుడిని ఇంఫాల్ విమానాశ్రయంలో భద్రతా సంస్థలు ఆపేసి బిజెపికి అప్పగించడం మణిపూర్‌లో మరింత ఘోరం. గత మార్చిలో మేఘాలయాలో ఇదే తంతు. 60 స్థానాలున్న శాసనసభలో కాంగ్రెస్‌కు 21 స్థానాలు వచ్చాయి. బిజెపికి రెండే రెండు సీట్లే వచ్చాయి. అయినా నాలుగు చిన్నాచితకా పార్టీలతో ఎన్నికల తర్వాత పొత్తు కుదుర్చుకుని ముఖ్యమంత్రి స్థానాన్ని కాజేసింది. ప్రస్తుతం కర్నాటకలో మాత్రం ఎన్నికల తర్వాత పొత్తు కుదుర్చు కున్న పక్షాలకు స్పష్టమైన మెజారిటీ ఉన్నా గవర్నర్ కాదు పొమ్మన్నారు. ఏ పక్షానికీ స్పష్టమైన మెజారిటీ రానప్పుడు ప్రభుత్వం ఏర్పాటులో గవర్నర్‌పాత్ర చాలా కీలకం. ఆ సమయంలో గవర్నర్ తన విచక్షణాధికారాన్ని ఉపయోగిం చవచ్చు. అయితే అది కచ్చితంగా విచక్షణతో కూడినదై ఉండాలి. రాజ్యాంగానికి, ఆనవాయితీలకు, అత్యున్నత న్యాయస్థానం తీర్పుల సరళికి అనుగుణంగా ఉండాలి. ఇందులో ఒక్కఅంశాన్ని కూడా అమలు చేయకుండా వాజూభాయ్ వాలా బిజెపిని హడావుడిగా గద్దెనెక్కించారు. ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సింది సంఖ్యాబలం. ఏ పక్షానికీ ఎన్నికల తర్వాత మెజారిటీలేకపోతే రాష్ట్రాలలో గవర్నలు అనుసరించవలసిన విధానాన్ని సర్కారియా కమిషన్ అనుమానరహితంగా నిర్దేశించింది. ఈ విధానానికి ప్రాధాన్య క్రమం ఏమిటో కూడా చెప్పింది. ఆ క్రమం ప్రకారం (మొదటిది) ఎన్నికలకు ముందు ఏర్పడిన కూటమికి ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇవ్వడం. (రెండవది) అన్నింటి కన్నా పెద్ద రాజకీయ పక్షంగా అవతరించిన పార్టీ ఇండిపెండెంట్లతోసహా ఇతరుల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగితే ఆ పక్షాన్ని ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించడం. (మూడు) ఎన్నికల తర్వాత ఏర్పడిన కూటమికి అవకాశం ఇవ్వడం. (నాలుగు)- ఎన్నికల తర్వాత ఏర్పడిన కూటమి ఇండి పెండెంట్లతో సహా ఇతర పక్షాలు వెలుపలినుంచి మద్దతు ఇచ్చే వీలుంటే ఆ పక్షానికి అవకాశం ఇవ్వడం.
కర్నాటక గవర్నర్ యడ్యూరప్పను ఆహ్వానించడానికి ఈ నాలుగింట్లో దేన్నీ ఖాతరు చేయలేదు. కాంగ్రెస్, -జె.డి. ఎస్ ఎన్నికల తర్వాత కూటమిగా ఏర్పడి తమకు 116 మంది సభ్యుల మద్దతు ఉందని జాబితా సమర్పించినా గవర్నర్ వాజూభాయ్ వాలా ఏమాత్రం పట్టించుకోకుండా తనను గవర్నర్‌గా నియమించిన కేంద్రంలో అధికారంలో ఉన్న పక్షానికి జీ హుజూర్ అంటూ అతిపెద్ద పక్షంగా అవతరించిన యడ్యూరప్పచేత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. కర్నాటకలో మొదటి రెండు అంశాలకు అవకాశం లేదు. కాని మూడవ అంశానికి అవకాశం ఉన్నా గవర్నర్ పట్టించుకోలేదు. ఎన్నికల తర్వా త కూటమిగా ఏర్పడిన హెచ్.డి.కుమారస్వామికి ప్రభు త్వం ఏర్పాటు చేయడానికి అవకాశం ఇవ్వాలన్న చట్ట బద్ధమైన విధిని వాజూభాయ్ వాలా పాటించలేదు. 2005 లో బూటాసింగ్ బిహార్ గవర్నర్‌గా ఉన్నప్పుడు బిహార్ శాసన సభను రద్దు చేయాలని సిఫార్సు చేశారు. నిజానికి మొదట ఉన్న ప్రభుత్వం మెజారిటీ కోల్పోతే మరోపక్షం ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నా ఆ విషయం కేంద్రానికి చెప్పకుండా తొక్కిపెట్టారు. అదేమంటే ఆ పక్షం ప్రభుత్వం ఏర్పాటుకు అనుచిత విధానాలు అనుసరిస్తోందన్నారు. బూటాసింగ్ వ్యవహార సరళిని అప్పుడు సుప్రీంకోర్టు తప్పుపట్టింది. చివరకు బూటా సింగ్ 2006 జనవరి 26న రాజీనామా చేయాల్సి వచ్చింది.
కుమారస్వామి తమ కూటమికి మెజారిటీ ఉందని వాదించినప్పుడు, ఆ కూటమికి మెజారిటీ ఉందని లెక్కలే తేలుస్తున్నప్పుడు, రెండు రోజుల్లో మెజారిటీ నిరూపించు కుంటానని హామీ ఇచ్చినప్పుడు గవర్నర్ ఆయనకు అవకా శం ఇవ్వాల్సింది. కాని రాజును మించిన రాజభక్తి ప్రదర్శిం చే హడావుడిలోఉన్న వాజూభాయ్ గత ఆనవాయితీలనూ చెత్తబుట్టలో వేశారు. పైగా వారం రోజుల్లో మెజారిటీ నిరూపించుకుంటానని యడ్యూరప్ప చెప్పినా చాలా ఉదారంగా 15 రోజుల గడువిచ్చారు. ఎడ్యూరప్పకు మెజారిటీ సమకూరడం కష్టసాధ్యమని గవర్నర్‌కు తెలియ కకాదు. కష్టసాధ్యాన్ని సుసాధ్యంచేసే అవకాశం ఇవ్వాల నుకున్నారు. అంతే. అంటే బేరసారాలకు, ఎమ్మెల్యేల కొనుగోళ్లకు వీలుకల్పించారు. యడ్యూరప్పకు, వాజూ భాయ్‌కి ఉన్న ఆశ ఏమిటంటే శాసనసభ్యులు ప్రమాణం చేయకముందు పార్టీ ఫిరాయిస్తే ఫిరాయింపుల నిరోధక చట్టం వర్తించే వీలులేకపోవడమే. గవర్నర్ చర్యను సవాలు చేస్తూ కాంగ్రెస్ దాఖలు చేసిన పిటిషన్‌ను అర్ధరాత్రి విచారించిన సుప్రీంకోర్టు బెంచి ఈ విషయాన్నే అడిగితే ప్రభుత్వ న్యాయవాది కె.కె.వేణుగోపాల్ ప్రమాణం స్వీకరించక ముందు ఫిరాయిస్తే ఫిరాయింపుల నిరోధక చట్టం వర్తించదని అన్నారు. ఇది ‘అసంబద్ధమైన’ వాదన అని బెంచి వ్యాఖ్యానించింది. ఇది బేరసారాలకు, ఎమ్మె ల్యేల కొనుగోలుకు వీలుకల్పించడమేనని కూడా దెప్పి పొడి చింది. కాని మోదీ, షా ద్వయం లక్ష్యమే అది.
అతిపెద్ద పక్షాన్ని ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించ డం తప్పుకాకపోవచ్చు. ఏ పక్షానికీ మెజారిటీ రానప్పుడూ ప్రభుత్వం ఏర్పాటుకు సకల అవకాశాలనూ అన్వేషించ డం కేంద్రంలో రాష్ట్రపతి, రాష్ట్రాలలో గవర్నర్ల బాధ్యత. ఈ విషయంలో సత్సంప్రదాయాలను నెలకొల్పిన రాష్ట్రపతు లున్నారు. 1989 లోకసభ ఎన్నికలలో ఏపక్షానికీ మెజారి టీ రాలేదు. అప్పుడు కాంగ్రెస్‌కు 197 స్థానాలే వచ్చి అతిపెద్ద పక్షంగా అవతరించింది. అప్పటి రాష్ట్రపతి అతిపెద్ద పక్షంగా అవతరించిన కాంగ్రెస్ పక్షనాయకుడు రాజీవ్‌గాంధీని ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశాలు పరిశీ లించాలని కోరారు. నేరుగా ప్రభుత్వం ఏర్పాటుకు అవకా శం ఇవ్వలేదు. కాని రాజీవ్ నిరాకరించారు. ఆ తర్వాత వి.పి.సింగ్ నాయకత్వంలోని నేషనల్ ఫ్రంట్‌కు అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత 1996లో ఇదే పరిస్థితి ఏర్పడితే అప్పటి రాష్ట్రపతి శంకర్‌దయాళ్ శర్మ అతిపెద్ద పక్ష నాయకుడైన వాజపేయిని ప్రభుత్వం ఏర్పాటుకు అవకా శాలు పరిశీలించమంటే వాజపేయి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. వారం రోజుల్లోనే వాజపేయి మెజారిటీ సాధించ లేరని తేలిపోయింది. ఆయన 13 రోజులే ప్రధానిగా కొన సాగారు. తర్వాత దేవెగౌడ నాయకత్వంలో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పడింది. వాజపేయి 13 నెలలు అధికా రంలో ఉన్నప్పుడూ సంపూర్ణమైన మెజారిటీ లేదు. కాని అప్పటి రాష్ట్రపతి కె.ఆర్.నారాయణన్ అనేక షరతులతో వాజపేయికి అవకాశం ఇచ్చారు.
గవర్నర్లుగా ఎలాంటి వారిని నియమించాలో సర్కారి యా కమిషన్ కొన్ని ఉత్తమ మార్గదర్శకాలను సూచిం చింది. ఇటీవలి కాలం దాకా రాజకీయాల్లో ఉన్న వారిని గవర్నర్లుగా నియమించకూడదని సర్కారియా కమిషన్ చెప్పినా కాంగ్రెస్ హయాంలో ప్రారంభమైన ఈ దుష్ట సంప్రదాయం బిజెపి ఏలుబడిలో మూడు పూవులూ ఆరు కాయలుగా విస్తరిల్లి ప్రజాస్వామ్య సంప్రదాయాలను తుంగలో తొక్కుతోంది. గవర్నర్ పదవికి ఉన్న పవిత్రత కాపాడాలంటే ‘తగిన‘ వారిని ఆ స్థానంలో నియమించా లని సుప్రీంకోర్టు న్యాయమూర్తి అరిజిత్ పసాయత్ రామేశ్వర్ ప్రసాద్ కేసులో వ్యాఖ్యానించారు. ప్రజాస్వా మ్యాన్ని పరిరక్షించాలనుకునే వారికి ఈ సూత్రాలు వర్తిస్తాయి. విరూపం చేసే వారికి ఎటూ ఈ నియమాలు బేఖాతరే. కాంగ్రెస్ ఇదే పని చేసింది కదా అన్నది బిజెపి వాదన. కావచ్చు. అదే పని చేయడానికైతే బిజెపికి పట్టం కట్టడం ఎందుకు? మోదీని గెలిపించింది ‘మార్పు‘ తీసుకొస్తారన్న ఆశతో కదా!