Home ఎడిటోరియల్ బిజెపికి నల్లేరుపై నడకకాదు!

బిజెపికి నల్లేరుపై నడకకాదు!

BN Prahlad as BJP's Candidate in Karnataka Jayanagar Election

బిజెపి ఎన్నికలకు సిద్ధమవుతోంది. ప్రధాని నరేంద్రమోడీ, పార్టీ అధ్యక్షుడు అమిత్ షా దూకుడు ప్రకటనలు దీన్ని సూచిస్తున్నాయి. మీడియాలో అడ్వర్టయిజ్‌మెంట్లు కూడా, 2019 ఎన్నికలకు ముందు “మోడీ షైనింగ్‌” లక్షణాన్ని సూచిస్తున్నాయి. క్షేత్రస్థాయి మేనేజిమెంట్‌లో సిద్ధహస్తుడైన షా, బలహీనమైన రాష్ట్రాలను గుర్తించి నియోజకవర్గ స్థాయిలో పని చేయటం అప్పుడే ప్రారంభించారు. అయితే కొత్త పొత్తులు రూపుదిద్దుకుంటున్నాయి, రాజకీయ పొందికల్లో మార్పులు రావచ్చు. ‘మోడీ మ్యాజిక్’ తగ్గిందా, లేదా? 2019లో బిజెపి మెజారిటీతో అధికారంలోకి తిరిగి వస్తుందా, లేదా అని అప్పుడే ఊహాగానాలు జరుగుతున్నాయి. దీనికితోడుగా, బిజెపికున్న ప్రధాన మిత్రపక్షాలు నాలుగింటిలో మూడు శివసేన, టిడిపి, పిడిపి ఇప్పుడు అలయెన్స్‌లో లేవు. బిజెపి 2014లో 282 సీట్లు గెలుచుకోగా, పార్టీ కనీసం 15 రాష్ట్రాల్లో ఎక్కువగా శ్రమించాల్సి ఉంటుంది.
భారతీయ జనతాపార్టీ 2014 నుంచి ఎంతో విస్తరించింది. అది ఈనాడు 10 కోట్ల మంది సభ్యులతో అత్యంత సంపన్నమైన పార్టీ. దాని రెక్కలు సుదూరంగా, విస్తృతంగా విచ్చుకున్నాయి. ఈశాన్య భారత్‌లో కూడా కొన్ని రాష్ట్రాలు గెలుచుకోవటం ద్వారా అది దేశమంతటికీ విస్తరించిన జాతీయపార్టీ అయింది. అయితే ఒడిసా, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక, కేరళ, ఢిల్లీ, పంజాబ్, తమిళనాడు, పుదుచ్చెరిల్లో ఆ పార్టీ బలంగా లేదు. జమ్మూ కశ్మీర్‌లో పిడిపితో ఇటీవల సంబంధాలు తెంచుకోవటంతో ఆ రాష్ట్ర పరిస్థితి కూడా అస్థిమితమే.
టిడిపి ఈ సంవత్సరం ఎన్‌డిఎ నుంచి వైదొలగటంతో బిజెపికి దక్షిణాదిన మిత్ర పక్షాలు లేవు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లో ప్రాంతీయ పార్టీల నాయకులు కె. చంద్రశేఖర రావు, నారా చంద్రబాబు నాయుడు బలంగా అధికార పీఠంపై ఉన్నారు. తమిళనాడులో ద్రవిడియన్ పార్టీల మధ్య పోరాటం తీవ్రస్థాయికి చేరటంతో పరిస్థితి గందరగోళంగా ఉంది. బిజెపికి రాష్ట్రంలో ప్రజాకర్షక నాయకుడు లేకపోవటం, తమిళనాడు రాజకీయాలకు మూలమైన ద్రవిడియన్ సిద్ధాంతంలో ప్రవేశంలేకపోవటంవల్ల బిజెపి తన పరిస్థితిని మెరుగుపరుచుకోవటం కష్టం. కర్నాటకలో ప్రభుత్వం ఏర్పాటు అవకాశాన్ని అది ఇటీవల కొద్ది తేడాతో కోల్పోయినప్పటికీ, కాంగ్రెస్ జెడి(ఎస్) సంకీర్ణ ప్రభుత్వం సక్రమంగా పని చేయగలిగితే, బిజెపి నష్టపోతుంది. కేరళ ఎప్పటివలె యుడిఎఫ్ ఎల్‌డిఎఫ్ మధ్య ఊగులాడుతోంది. పుదుచ్చేరిలో కాంగ్రెస్ దృఢంగా
స్థిరపడింది.
2014 ఎన్నికల్లో ఆరు ప్రధాన రాష్ట్రాల్లోని 248 సీట్లలో ఎన్‌డిఎ 224 గెలుచుకోగలిగింది. అయితే ఈ పర్యాయం ఆ విధమైన నల్లేరుపై నడక సాధ్యం కాకపోవచ్చు. గుజరాత్‌లో గతంలోలాగా మొత్తం 26 సీట్లు గెలవటం కష్టమని అసెంబ్లీ ఫలితాలు స్పష్టం చేశాయి. అందువల్ల పార్టీ ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. రైతులు, యువత పార్టీతో తీవ్ర అసంతృప్తి చెంది ఉన్నారు. మోడీ ఆఖరి దశ ప్రచారం అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని కాపాడింది.
అతి హెచ్చు జనాభా ఉన్న రాష్ట్రం, బిజెపి జేబులో ఉన్న రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ ఇటీవల ఆ పార్టీకి ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల మూడు లోక్‌సభ ఉప ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలైంది. 2014 ఎన్నికల్లో బిజెపి 80లో 71 స్థానాలు గెలుపొందటం, సంవత్సరం క్రితం అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన దృష్టా ఈ రాష్ట్రంపై పార్టీకి పెద్ద ఆశలున్నాయి. అయితే మారుతున్న ప్రజల మనోగతాన్ని బిజెపి విస్మరించజాలదు.
రాజస్థాన్‌లో 2014లో బిజెపి మొత్తం 25 సీట్లు గెలుచుకుంది. అయితే ప్రస్తుత మనోగతాన్ని గమనిస్తే ముఖ్యమంత్రి వసుంధర రాజె ప్రజాదరణ తగ్గింది, కాని ఆమె పదవిని అంటిపెట్టుకుని ఉన్నారు. ప్రభుత్వ వ్యతిరేకత కొటోచ్చినట్లు కనిపిస్తున్నది. ఇటీవల కాలంలో ఉప ఎన్నికల ఫలితాలను చూచినపుడు కాంగ్రెస్ పునరుజ్జీవం పొందుతున్నది. ఈ సంవత్సరాంతంలో అసెంబ్లీ ఎన్నికలు భవిష్యత్ దృశ్యాన్ని సూచిస్తాయి.
మధ్యప్రదేశ్‌లో కూడా బిజెపి తగినంతగా ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కొంటున్నది. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వరుసగా నాల్గవ పర్యాయం అధికారం కోరుతున్నారు. అది రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధానాంశాల్లో ఒకటి కానుంది. కాంగ్రెస్ సమైక్యంగా పనిచేస్తే బిజెపి అవకాశాలు సందేహమే. 2014లో ఇక్కడ కూడా 29లో 27 సీట్లను బిజెపి గెలుచుకుంది.
నితీష్ కుమార్ నాయకత్వంలోని జెడి(యు) ఎన్‌డిఎ కూటమిలోకి తిరిగి వచ్చాక బీహార్ ఆసక్తికరంగా తయారైంది. గత పర్యాయం నితీష్ కాంగ్రెస్, ఆర్‌జెడిలతో మహాకూటమిలో ఉన్నారు. 2014లో బిజెపి, దాని మిత్రపక్షాలు మొత్తం 40లో 31 సీట్లు గెలుచుకున్నాయి. మారిన రాజకీయ పొందికలతో బిజెపి మంచి ఫలితాలు సాధించవచ్చు. ఇందుకుగాను అది చిన్నచిన్న పార్టీలతో పొత్తును నిలుపుకోవాలి. 2014 లెక్కలకు భిన్నంగా నితీష్ జెడి(యు)కి అదనపు సీట్లు కేటాయించాలి. గత పర్యాయం జెడి(యు) రెండు సీట్లే గెలిచింది. సీట్ల కేటాయింపు ఇప్పుడే తేలాలని నితీష్ ఒత్తిడి చేస్తుండగా, సమయమొచ్చినపుడు చూద్దాం అంటూ బిజెపి దాటవేస్తున్నది.
మహారాష్ట్రలో, బిజెపి చిరకాల మిత్రపక్షం శివసేన ఎట్టకేలకు బిజెపితో సంబంధాలు తెంచుకుని, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించింది. అయినా మోడీ ప్రభుత్వంలో ఆ పార్టీ మంత్రి కొనసాగుతున్నారు. అలాగే మహారాష్ట్ర ప్రభుత్వంలో మంత్రులు కొనసాగుతున్నారు. అయితే శివసేన తమతోనే ఉంటుందని భావిస్తున్న అమిత్ షా ఇటీవల ముంబైలో శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రేతో చర్చలు జరిపారు. అవేమి సానుకూల ఫలితమివ్వలేదు. 2014లో బిజెపి, శివసేన కూటమి మొత్తం 48 లోక్‌సభ స్థానాల్లో 42 గెలుచుకున్నాయి. వాటిలో శివసేన వాటా 18. కాంగ్రెస్, శరద్‌పవార్ ఎన్‌సిపి చర్చలు ఫలించి ఒక్కటిగా పనిచేస్తే బిజెపికి ఇబ్బందులు తప్పవు.
అయినప్పటికీ, బిజెపికి అనేక సానుకూలతలున్నాయి. నిబద్ధతగల కార్యకర్తలు, అపరిమితమైన ఆర్థిక వనరులు, వాగ్ధాటిగల నాయకులు, కొన్ని రాష్ట్రాల్లో శక్తిమంతమైన మిత్రపక్షాలు, అన్నిటికీమించి మంచి కమ్యూనికేటివ్ స్కిల్స్ దానికున్నాయి. అంతిమంగా, ఓటరు మనోగతం ఎంతో ముఖ్యం.
బిజెపి ఆర్థిక వ్యవస్థను సక్రమంగా నిర్వహించి, అంచనా వేస్తున్న 7.6 శాతం వృద్ధిరేటు సాధించగలిగితే, వర్షాలు మంచిగా పడి పల్లె సీమలు కళకళలాడితే, అభ్యర్థుల ఎంపిక సవ్యంగా చేస్తే, సమర్థవంతంగా పొత్తులు నిల బెట్టుకుంటూ మంచిగా ప్రచారం చేయగలిగితే ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన సంఖ్యను బిజెపి చేరుకోవచ్చు. బిజెపి గెలుపు లేదా ఓటమి ప్రతిపక్ష ఐక్యతపై ఆధారపడి ఉంటుంది. ప్రతిపక్షం చీలికలతోనే ఉండే పక్షంలో అధికార పీఠం మళ్లీ బిజెపిని వరించవచ్చు.
(ఐపిఎ)