Home ఎడిటోరియల్ మమతకు అమిత్ షా సవాల్

మమతకు అమిత్ షా సవాల్

BJP wants to remove Mamata Banerjee from office

రానున్న ఎన్నికలకు పశ్చిమ బెంగాల్‌పై ప్రత్యేక దృష్టి పెట్టిన భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై విమర్శల దాడి కొనసాగిస్తున్నది. నరేంద్ర మోడీని గద్దె దించటం లక్షంగా పనిచేస్తున్న మమతా బెనర్జీని గద్దె దించాలని బిజెపి కోరుకోవటం సహజం. ఇరుపక్షాల పిలుపుల్లో సాధ్యాసాధ్యాల మాటెలా ఉన్నా సెగ రగులుతోంది. అసోంలో బంగ్లాదేశ్ చొరబాటుదారులను గుర్తించే నిమిత్తం చేపట్టిన భారత పౌరసత్వ రిజిస్టర్ (ఎన్‌ఆర్‌సి) ఇరు పార్టీల మధ్య తాజా వివాదాంశంగా మారింది. ఎన్‌ఆర్‌సి ముసాయిదాలో 40 లక్షల మంది పేర్లు లేకపోవటంతో బెంగాలీలకు ఉద్దేశపూర్వకంగా అన్యాయం జరిగిందని, ఇది పౌరుల మధ్య “అంతర్యుద్ధానికి”, “రక్తపాతానికి” దారి తీస్తుందని మమతా బెనర్జీ మాట తూలటం బిజెపి చేతిలో ఆయుధంగా మారింది. ఈ నేపధ్యంలో భారతీయ జనతా యువ మోర్చా శనివారం కోల్‌కతాలో నిర్వహించిన పెద్ద బహిరంగ సభలో బిజెపి అధ్యక్షుడు అమిత్ షా ప్రసంగిస్తూ “మమతాజీ! మీరు చొరబాటుదారుల పక్షమా లేక జాతీయ భద్రత పక్షమా రాష్ట్ర ప్రజలకు వివరించాలి” అని సవాలు విసిరారు.

తాము అధికారంలోకి వస్తే పశ్చిమ బెంగాల్‌లో కూడా ఎన్‌ఆర్‌సి చేబడతామనే రాష్ట్ర బిజెపి నాయకుల ప్రకటనలను షా ప్రస్తావించలేదు. అయితే చొరబాట్లు జరుగుతున్న తీరు చూస్తే పశ్చిమ బెంగాల్ పశ్చిమ బంగ్లాదేశ్‌గా మారుతుందని అంటూ తృణమూల్ కాంగ్రెస్‌ను అధికారం నుంచి దించాలని రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అయితే ఆయన అటువంటి పిలుపు ఇచ్చినప్పుడల్లా టిఎంసి మరింత బలపడుతున్నది. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో అటువంటి పిలుపుతో బిజెపి సర్వం ఒడ్డినప్పటికీ 295 సభ్యుల అసెంబ్లీలో టిఎంసి 211 సీట్లు గెలుపొందగా బిజెపికి మూడే సీట్లు దక్కాయి. 2014 సార్వత్రిక ఎన్నికలూ అంతే. బిజెపికి 42 లో 2 సీట్లే దక్కాయి. 2019 ఎన్నికలకు రెండు పార్టీలు ఇప్పుడు సన్నద్ధమవుతున్నాయి. మోడీ నాయకత్వంలోని బిజెపిని అధికారం నుంచి దించటం లక్షంగా మమతా బెనర్జీ ప్రతిపక్షాల్లో సాధ్యమైనంత విస్తృత ఐక్యత సాధించేందుకు నడుం కట్టారు. ఇటీవల మూడు రోజులపాటు ఢిల్లీలో ఆమె మకాం, పలు పక్షాల నేతలతో ఆమె మంతనాలు ఆ ప్రయత్నంలో భాగమే. ఇది బిజెపికి కంటగింపుగా తయారైంది.

బంగ్లాదేశ్ చొరబాటుదారులను మమతా బెనర్జీ ఓటు బ్యాంక్‌గా ఉపయోగించుకుంటున్నా రనేది బిజెపి ఆరోపణ. ఆమె ఒకప్పుడు కమ్యూనిస్టులపై ఇదే ఆరోపణ చేసింది. 2005 నుంచి ఆమె మారారు. బెంగాలీ, బంగ్లా ముస్లింలకు ఆమె తేడా చూపటం లేదు. అయితే బంగ్లాదేశ్ వలస ప్రజల సమస్య అసోం తదుపరి పశ్చిమ బెంగాల్‌కే పరిమితమైంది కాదు. రాజస్థాన్, పంజాబ్, బీహార్‌ల్లో కూడా ఉంది. నేపాలీ గూర్ఖాలు మన దేశంలో పెద్ద సంఖ్యలో ఉన్నారు. అయితే వీరంతా ఇటీవల కాలంలో వచ్చిన వారు కాదు. తరతరాలుగా మన దేశంలో స్థిరపడినవారున్నారు. 1971లో బంగ్లాదేశ్ విముక్తి ఉద్యమంపై పాకిస్థాన్ సైన్యం విరుచుకుపడినప్పుడు కొన్ని లక్షల మంది వచ్చారు. అసోంలోని ప్రత్యేక పరిస్థితిలో అక్కడ ఎన్‌ఆర్‌సి రూపొందిస్తున్నప్పటికీ, అలా వలస వచ్చి మన దేశంలో స్థిరపడినవారు బిజెపి చిత్రిస్తున్నట్లుగా ఇన్ని దశాబ్దాల్లో ‘భద్రతా సమస్య’ కాలేదు.

వలస ముస్లిం ప్రజలను దేశం నుంచి పంపివేయటం, అది సాధ్యం కాకపోతే కాందీశీక శిబిరాలకు పరిమితం చేయటం, హిందువులకు పౌరసత్వ ఇవ్వటం అనే బిజెపి ప్రయత్నంలో మత విభజన దృష్టి స్పష్టంగా కనిపిస్తున్నది. కోల్‌కతా సభలో అమిత్ షా పునరుద్ఘాటన ఈ వివక్షను తేటతెల్లం చేస్తున్నది. ‘బిజెపి నాయకత్వంలోని ప్రభుత్వం పౌరసత్వ (సవరణ) బిల్లు, 2016 తెచ్చింది. ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్, పాకిస్థాన్‌ల నుంచి వలస వచ్చిన హిందువులు, బౌద్ధులు, క్రైస్తవులకు పౌరసత్వమిచ్చే నిబంధన అందులో ఉంది. ఆశ్రయం కోరిన వారు దేశంలో ఉండేటట్లు భారత ప్రభుత్వం చూస్తుంది’ అని షా చెప్పారు.

తృణమూల్ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు డెరిక్ ఓ బ్రియన్ అమిత్ షా ఆరోపణలను కొట్టివేస్తూ బెంగాల్ సంస్కృతి, ఉపజాతుల పొందికపై షాకు అవగాహన లేదు, ఎన్‌ఆర్‌సికి సంబంధించి భారత పౌరులను కాపాడటం మా నినాదం, మతతత్వ రాజకీయాలను బెంగాల్ ఆమోదించదని స్పష్టం చేశారు. ఏమైనా ఎన్‌ఆర్‌సి సమస్యపైనే మమతా బెనర్జీని ఇరకాటంలో పెట్టటం బిజెపి వ్యూహమైనప్పటికీ, ఆమె ఆటుపోట్లలో రాటుదేరిన మనిషి. బెంగాలీల నాడి పట్టిన నారి. అందువల్ల అమిషా సవాళ్లు, ఆరోపణలు ఆమె పునాదులను ఇప్పటికైతే కదిలించలేవు.