Home జాతీయ వార్తలు బిజెపికి ఉత్తమప్రదేశ్

బిజెపికి ఉత్తమప్రదేశ్

UP

న్యూఢిల్లీ : దేశంలో లోక్‌సభ ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయగల ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీకి ఎన్ని సీట్లే కాకుండా ఏ పార్టీకి ఎంత శాతం ఓట్లు వచ్చాయన్నది కూడా ముఖ్యమే. రాష్ట్రంలో మొత్తం 80 సీట్లుండగా, బిజెపి తన మిత్రపక్షమైన అప్నాదళ్‌కు రెండు సీట్లను వదిలేసి మొత్తం 78 సీట్లకు పోటీ చేసింది. అలాగే ఎస్‌పి, బిఎస్‌పి కూటమి రెండు సీట్లను కాంగ్రెస్ పార్టీ నాయకులు సోనియాగాంధీ, రాహుల్ గాంధీలకు వదిలేసి 78 సీట్లకు పోటీ చేసింది. పోటీ చేసిన 78 సీట్లకుగాను బిజెపి 62 సీట్లను గెలుచుకోగా, దాని మిత్ర పక్షమైన అప్నాదళ్ రెండు సీట్లను గెలుచుకుంది. గత ఎన్నికల్లో బిజెపికి 71 సీట్లు, అప్పాదళ్‌కు రెండు సీట్లు వచ్చాయి. ఈసారి అజిత్ సింగ్ నాయకత్వంలోని రాష్ట్రీయ లోక్‌దళ్‌ను కలుపుకొని ఎస్‌పి, బిఎస్‌పి పార్టీలు మహా కూటమిగా పోటీ చేసినా పెద్దగా లాభం ఏమీ లేకపోయింది. ముజఫర్‌నగర్ నుంచి పోటీ చేసిన అజిత్ సింగ్ ఓడిపోగా, మిగతా సీట్లలో బిఎస్‌పికి పది సీట్లు, ఎస్‌పికి ఐదు సీట్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక్క సోనియా గాంధీయే రాయ్‌బరేలి నుంచి విజయం సాధించారు. రాహుల్ గాంధీ పోటీ చేసిన అమేథి నియోజకవర్గంలో ఆయనపై కేంద్ర మంత్రి, బిజెపి అభ్యర్థి స్మతి ఇరానీ 55 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. యుపిలో బిజెపికి మొత్త 49.6 శాతం ఓట్లు రాగా, బిఎస్‌పి19.3 శాతం ఓట్లు, ఎస్‌పికి 18 శాతం ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీకి 6.3 శాతం ఓట్లు వచ్చాయి. ఈ పార్టీ కూడా కూటమితో చేతులు కలిపి ఉన్నట్లయితే కాంగ్రెస్‌కు రెండు సీట్లు, కూటమికి మరో రెండు సీట్లు వచ్చేవి.

Bjp Wins 62 seats in Uttar Pradesh