Home ఎడిటోరియల్ జమిలి ఎన్నికలకు బిజెపి సమర్థన

జమిలి ఎన్నికలకు బిజెపి సమర్థన

BJP wants to remove Mamata Banerjee from office

లోక్‌సభ, రాష్ట్ర శాసన సభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్న ప్రధానమంత్రి నరేంద్రమోడీ అభిప్రాయాన్ని బలపరుస్తూ బిజెపి అధ్యక్షుడు అమిత్ షా, లా కమిషన్‌కు 8 పేజీల లేఖ పంపారు. లా కమిషన్ ఛైర్మన్ జస్టిస్ బి.ఎస్. చౌహాన్ గత నెలలో రాజకీయ పార్టీలతో సమావేశాలు పిలిచినపుడు బిజెపి, కాంగ్రెస్ పార్టీలు తమ అభిప్రాయాలు తెలియజేయటానికి మరికొంత వ్యవధి కోరాయి. కాంగ్రెస్ నాయకులు కొద్ది వారాల క్రితం లా కమిషన్‌ను కలిసి జమిలి ఎన్నికలు ఫెడరల్ స్వరూపానికి విరుద్ధమని పేర్కొంటూ తమ పార్టీ అందుకు వ్యతిరేకమని తెలియజేసింది. ఇతర అనేక పార్టీలు ఇంతకు ముందే అనుకూల, వ్యతిరేక వాదనలు వినిపించాయి. అమిత్ షా లేఖ పంపిన అనంతరం వ్యక్తమైన రెండు అభిప్రాయాలు గమనించదగినవి. ఎన్‌డిఎలో భాగస్వామి, జెడి(యు) అధ్యక్షుడు, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అభిప్రాయం: జమిలి ఎన్నికలు సిద్ధాంత రీత్యా సరైనవి, కాని 2019లో సాధ్యం కావు. రెండు, ప్రధాన ఎన్నికల కమిషనర్ ఒ.పి. రావత్ అభిప్రాయం: వివిపాట్ (ఓటు యంత్రాలకు జత చేసే పేపర్ ట్రయిల్ యంత్రాలు) తగిన సంఖ్యలో లభ్యతలో లేనందున జమిలి ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదు.
జమిలి ఎన్నికలను వ్యతిరేకించటాన్ని ‘రాజకీయ దురుద్దేశం’గా అమిత్ షా కొట్టి పారేశారు. అయితే జమిలి ఎన్నికలకు బిజెపి అనుకూలతకు ప్రతిపక్షాలు అదే ఆరోపణ చేయవచ్చు. అందువల్ల ఇది రెండు పక్షాల మధ్య రాజకీయ కుస్తీ కాదు. రాజ్యాంగ ఫెడరల్ స్వరూపం, చట్టరీత్యా సాధ్యాసాధ్యాలు, నిర్వహణ సమస్యలను క్షుణ్ణంగా అధ్యయనం చేయాల్సిన విషయం. దేశంలో ఏటా ఎక్కడో ఒకచోట ఎన్నికలు జరుగుతున్నందున అధిక వ్యయ ప్రయాసలతోపాటు అభివృద్ధి కార్యక్రమాలకు ఆటంకం కలుగుతోందని, దేశం ఎల్లప్పుడూ ‘ఎన్నికల మోడ్’లో ఉంటుందనేది వాస్తవం. ఒకసారి ఎన్నికలు ముగిస్తే ఐదేళ్ల వరకు ప్రభుత్వాలు పరిపాలనపై కేంద్రీకరించవచ్చనే వాదన కూడా సమర్థనీయమే. అందువల్లనే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరపాలన్నది బిజెపి అభిప్రాయం. 1952, 1957, 1962,1967 సంవత్సరాల్లో లోక్‌సభ, అసెంబ్లీకు ఒకేసారి ఎన్నికలు జరిగాయంటే దేశం మొత్తం మీద కాంగ్రెస్ గుత్తాధిపత్యం ఉండటం, రాజకీయ వ్యవస్థ ఇప్పటిలాగా చిన్నాభిన్నం కాకపోవటం వల్లనే సాధ్యమైంది. ఎన్‌డిఎ తొలి ప్రభుత్వంలో హోంమంత్రి ఎల్.కె. అద్వానీ కూడా తరచూ ఎన్నికల నివారణకు ఒక ప్రతిపాదన ముందుకు తెచ్చారు. అది జర్మనీలాగా చట్ట సభలకు ఐదేళ్ల పదవీకాలాన్ని చట్టబద్ధం చేసి, మధ్యలో ఏ కారణం చేతనైనా ప్రభుత్వాలు మెజారిటీ కోల్పోతే, కొత్త సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు ప్రయత్నించటం, అది సాధ్యమయ్యేవరకు కేంద్ర పాలన విధించటం. ప్రజలెన్నుకున్న ప్రభుత్వం కూలిపోతే కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు ప్రజలకు గల ప్రజాస్వామ్య హక్కును, పార్లమెంటరీ ప్రజాస్వామ్య మూలసూత్రాన్ని అది నిరాకరిస్తున్నది. మన రాజ్యాంగం ప్రకారం కేంద్రంలో రాష్ట్రపతి పాలనకు అవకాశం లేదు. అందువల్ల ఆ ప్రతిపాదనకు మద్దతు లభించలేదు. ఇప్పుడు జమిలి ఎన్నికల ప్రతిపాదన చేయటంలో ప్రధానమంత్రి ఉద్దేశం ఏమైనప్పటికీ, ఎన్నికలను అధ్యక్ష తరహా పోటీగా మార్చి తమను దెబ్బతీయ జూస్తున్నారనే భావం అనేక ప్రాంతీయ పార్టీల్లో ఉంది. రెండు నుంచి నాలుగేళ్ల వరకు పదవీ కాలం మిగిలిఉన్న ఏ ప్రభుత్వం కూడా దాన్ని కోల్పోయేందుకు సిద్ధపడదు. సంవత్సరంన్నర క్రితమే ఉత్తరప్రదేశ్‌లో చేతిక వచ్చిన అధికారాన్ని అప్పుడే ప్రజా తీర్పుకు పెట్టటానికి బిజెపి సిద్ధపడుతుందా?
కాబట్టి నితీష్ కుమార్ అన్నట్లు 2019లో దేశమంతటా జమిలి ఎన్నికలు అసాధ్యం. అయితే రెండు రెండున్నరేళ్ల విరామంతో అసెంబ్లీలన్నిటికీ ఎన్నికలు నిర్వహించే ఆలోచన పరిశీలించదగింది. కొన్ని రాష్ట్రాల్లో, (రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, మిజోరం) అసెంబ్లీ ఎన్నికలను కొంతకాలం వాయిదావేయటం, మరికొన్ని రాష్ట్రాల (మహారాష్ట్ర, జార్ఖండ్, హర్యానా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్) ఎన్నికలను కొంత ముందుకు తీసుకురావటం ద్వారా లోక్‌సభతోపాటు ఎన్నికలు జరిగే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిసాలను కలుపుకుని కనీసం 1011 రాష్ట్రాల్లో జమిలి ఎన్నికలను ఆలోచించవచ్చు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధమని తెలంగాణ ప్రభుత్వం చెబుతుండగా, ముందుగా అసెంబ్లీ ఎన్నికలను ఎ.పి. వ్యతిరేకిస్తున్నది. చట్టసభల నిర్ణీత పదవీకాలం ముగిసే ఆరు మాసాల ముందు ఎన్నికలు జరిపే అధికారం ఎన్నికల కమిషన్‌కు ఉంది. అందువల్ల డిసెంబర్‌లో ఎన్నికల ఊహాగానాలకు ప్రాతిపదిక ఉంది. ఏమైనా రాజ్యాంగ, శాసన ధర్మసూకా్ష్మలపై లా కమిషన్ నివేదికకు వేచి చూడటం ఉత్తమం.