Home ఎడిటోరియల్ పెద్దనోట్ల రద్దుపై ద్వంద్వయుద్ధం

పెద్దనోట్ల రద్దుపై ద్వంద్వయుద్ధం

sampadakeyam

సంవత్సరం క్రితం రూ.1000, రూ.500 కరెన్సీ నోట్లను రద్దు చేసిన ప్రధాని నరేంద్రమోడీ చర్య ఆర్థిక వ్యవస్థకు వినాశకరమా లేక చరిత్రాత్మకమా, నైతికంగా సరైందా అనే చర్చ దాని తొలి వార్షికోత్సవం (నవంబర్ 8) సందర్భంగా పునరావృతం కావటమే అది ఎంతటి వివాదాస్పద నిర్ణయమో విదితం చేస్తున్నది. ప్రతిపక్షాలు ‘నిరసన దినం’ పాటిస్తుండగా, ప్రభుత్వం తన ఆకస్మిక చర్యను గట్టిగా సమర్థించుకుంటూ ‘నల్లధనం వ్యతిరేక దినం’ జరుపుతోంది. పెద్దనోట్ల రద్దు చర్య “సంఘటిత లూటీ, చట్టబద్ధమైన దోపిడీ” అని పార్లమెంటులో ప్రకటించిన ప్రసిద్ధ ఆర్థికవేత్త, మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్‌సింగ్ గుజరాత్‌లో వ్యాపారుల సమావేశంలో ప్రసంగిస్తూ, ‘డీమానిటైజేషన్ రాజకీయ లాభాలు పొందటానికి చేసిన బడాయి చర్యగా రుజువైంది. అసలు నేరస్థులు తప్పించుకున్నారు. అది సంఘటిత లూటీ, చట్టబద్ధమైన దోపిడీ అన్న మాటలను పునరుద్ఘాటిస్తున్నాను. డీమానిటైజేషన్ మన ఆర్థిక వ్యవస్థకు, ప్రజాస్వామ్యానికీ చీకటి రోజు’ అని వక్కాణించారు. నల్లధనాన్ని, పన్ను ఎగవేతను అరికట్టవలసిన అవసరం ఉందని చెబుతూ డీమానిటైజేషన్ అందుకు సరైన మందు కాదు. ఒక్క ఆకస్మిక నిర్ణయంతో 86 శాతం నగదును ఉపసంహరించిన నిర్బంధ చర్యను ప్రపంచంలో ఏ ప్రజాస్వామ్యదేశం తీసుకోలేదని గుర్తు చేశారు. లోక్‌సభలో డాక్టర్ సింగ్ హెచ్చరించినట్లుగా జిడిపి వృద్ధిరేటు దాదాపు 2శాతం పడిపోయింది. కరెన్సీ రద్దు లక్షాల్లో ఏ ఒక్కటి నెరవేరనందున ఆ మహా తప్పిదంనుండి ప్రభుత్వం పాఠాలు తీసుకోవలసింది పోయి, జిఎస్‌టి అమలుతో ముందుకెళ్లింది. ఈ జంట దెబ్బలు ఆర్థిక వ్యవస్థను, వృద్ధిరేటును దెబ్బతీశాయన్నారు. అవినీతిపై పోరాటం పేరుతో మోడీ ప్రభుత్వం ‘పన్ను టెర్రరిజం’కు పాల్పడుతున్నదని, దాని భయంతో పెట్టుబడులు పెట్టటానికి వ్యాపార సంస్థలు ముందుకు రావటం లేదన్నారు.
డాక్టర్ సింగ్ అభిప్రాయాల్లో విభేదించాల్సినవేవీ లేవు. అయితే తప్పును సమర్థించుకోక తప్పని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ గత యుపిఎ ప్రభుత్వంపై ఎదురుదాడి చేస్తున్నారు. అది తాము సృష్టించిన ఇక్కట్లకు సమాధానం కాజాలదు. ఆయన మాటల్లో, “2016 నవంబర్ 8 భారత ఆర్థికవ్యవస్థ చరిత్రలో చిరస్థాయిగా గుర్తుంటుంది. మొత్తంగా విశ్లేషించినపుడు, దేశం మరింత స్వచ్ఛమైన, పారదర్శకమైన, నిజాయితీగల ఆర్థిక వ్యవస్థలో అడుగుపెట్టింది. దీని లాభాలు కొందరికి ఇప్పటికీ కనిపించటం లేదు” అన్నారు. నల్లధనం నిర్మూలన, నకిలీ కరెన్సీ ఏరివేత, టెర్రర్ నిధులు అరికట్టటం అనే ప్రకటిత లక్షాల వైఫల్యం గూర్చి సంజాయిషీ ఇవ్వకుండా, నగదు రహిత లావాదేవీలు (డిజిటల్ చెల్లింపులు) పెరుగుదల, పన్ను చెల్లింపుదారుల పెరుగుదల వగైరా గూర్చి ఆయన మాట్లాడుతున్నారు. రిజర్వుబ్యాంక్ లెక్క ప్రకారమే రద్దయిన నోట్లలో 99శాతంపైగా బ్యాంకుకు చేరింది. అంటే ప్రభుత్వం ఆశించిన రూ.2- 3లక్షల కోట్లు నల్లధనంగా మిగిలిపోలేదు. నల్లధనమంతా తెల్లధనంగా మారింది. కొద్దిశాతంమంది సృష్టించే నల్లధనంపై దాడికి అత్యధిక శాతం ప్రజలను కష్టనష్టాల పాల్జేయాలా? సూక్ష్మంగా ఆనాటి పరిస్థితులను గుర్తుచేసుకుంటే, నవంబర్ 9న తెల్లవారేసరికి ప్రజలు నిర్‌ధనులు అయినారు. పప్పుఉప్పు కొనుక్కునే పరిస్థితి లేదు. వ్యాపారాలు స్తంభించాయి. ఎటిఎంల వద్ద, బ్యాంకుల వద్ద నెలల తరబడి క్యూలు, బ్యాంకుల్లో డబ్బుకు రేషన్. పైగా రూ.2000 నోటిస్తే బయట చిల్లరలేదు. క్యూలో నిలబడి 150మందిదాకా ప్రాణాలు విడిచారు. రిజర్వుబ్యాంక్ రోజుకొక ఆంక్ష. కార్పొరేట్ల సంగతెలా ఉన్నా, నిత్యం నగదుతో లావాదేవీలు జరిపే చిన్నమధ్య తరహా పరిశ్రమలు క్రమంగా బంద్, దాదాపు 15లక్షలమందికి ఉపాధినుంచి ఉద్వాసన. మూడు నెలల్లో అన్నీ సర్దుకుంటాయన్న ప్రధాని మాట నీటిమూట అయింది. సంవత్సరం తర్వాత కూడా ఆర్థిక వ్యవస్థలోని వివిధ రంగాలు పునరుజ్జీవం పొందలేదు.పేదల సంక్షేమం కొరకే డీమానిటైజేషన్ చేసినట్లు ప్రధాని ఢంకా బజాయింపు ప్రసంగాలు ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బిజెపికి మేలుచేసి ఉండవచ్చు. డీమానిటైజేషన్ లోతుపాతులు సామాన్య ప్రజలకు అర్థం కాకపోవచ్చు. అయితే డీమానిటైజేషన్, జిఎస్‌టి తర్వాత తమ బతుకులు మరింత దుర్భరమైనట్లు అర్థం చేసుకుంటున్నారు.