Home తాజా వార్తలు కిడ్నీలకు బీపీ ,షుగర్ తో చేటు

కిడ్నీలకు బీపీ ,షుగర్ తో చేటు

Kidney disease

సిటీబ్యూరో : మూత్రపిండాల సమస్యకు రక్తపోటు, మధుమేహం కారణమవుతున్నాయని నిమ్స్ నెఫ్రాలజీ విభాగం అధిపతి డా. శ్రీభూషణ రాజు తెలిపారు. చాలా వరకు ఆహారలోపంతోనే ఈ వ్యాధిగ్రస్తులు మృత్యువాతకు గురవుతున్నారని చెప్పారు. గురువారం ప్రపంచ మూత్రపిండాల దినోత్సవం సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. తన ఛాంబర్‌లో ఏర్పాటు చేసిన సమాయంలో డా.శ్రీభూషణ రాజు మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం ఒక థీమ్‌తో ముందుకు పోతున్న వరల్డ్ కిడ్నీ డే ఈ ఏడాది కిడ్నీ ఆరోగ్యం..ప్రతి చోట.. ప్రతి ఒక్కరికి నినాదంతో సమస్య పరిష్కారానికి అవగాహన కల్పించనున్నట్టు తెలిపారు.
సమస్యకు మూలం..
స్ధూలకాయంతో పాటు పొగత్రాగడం, ఆల్కాహాల్ వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉంటే కిడ్నీ సమస్యలు ఏర్పడవని చెప్పారు. మరీ ముఖ్యంగా గర్భిణీ స్త్రీల సంరక్షణకు ప్రాధాన్యతను ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. శిశువు బరువు తక్కువతో పుట్టినా.. నెలలు నిండకుండానే ముందుగా పుట్టినా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని చెప్పారు. వాటిలో ప్రధానంగా రక్తపోటు, షుగర్, కిడ్నీ జబ్బులు వస్తాయన్నారు. మాత శివు రక్షణ చాలా ముఖ్యమని స్పష్టం చేశారు. వాస్తవానికి కిడ్నీ సమస్యలకు ప్రారంభ దశలో ఎలాంటి లక్షణాలు ఉండవని డా. భూషణ్ రాజు తెలిపారు.
16 శాతం కిడ్నీ సమస్య..
దేశ జనాభాలో 16 శాతం మేరకు కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నట్టు చెప్పారు. తొమ్మిది నగరాల్లో నిర్వహించిన అధ్వాయనంలో ఈ విషయం స్పష్టమైందన్నారు. మధుమేహం, రక్తపోటు, పక్షవాతం, గుండె జబ్బు, కీళ్ల నొప్పులు, చర్మవ్యాధులు వంటి అనారోగ్య సమస్యలతో మూత్రపిండాల వ్యాధిబారినపడుతున్నారని చెప్పారు. వీటి తోడు జన్యుపరమైన కోణంలో కూడా కిడ్నీ సమస్య ఉత్పనమవుతుందని..ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పులను కూడా ఒక కారణంగా పేర్కొనవచ్చని వివరించారు. చివరికి వైద్య పరీక్షల కారణంగా కూడా కిడ్నీ సమస్యలు తలెత్తుతున్నాయి. సిటీస్కాన్, ఎంఆర్‌ఐ పరీక్షలతో పాటుగా పెయిన్ కిల్లర్ మందులను అధికంగా వాడినా ఇబ్బందేనన్నారు. సహజంగా కడుపులో నొప్పి, గ్యాస్ సమస్యలతో ఈ పెయిన్ కిల్లర్లను వినియోగించడం పరిపాటిగా మారిందని చెప్పారు.
ప్రతి రోజూ 75 మంది గుర్తింపు
కిడ్నీ సమస్యకు గురైన వారిని రోజుకు 75 మంది చొప్పున గుర్తించడం జరుగుతుందన్నారు. తెలుగు రాష్ట్రాల్లో 20 వేల మంది కిడ్నీ సమస్యతో బాధపడేవాళ్లు తమ రక్తాన్ని శుద్ధి (డయాలసిస్) చేయించుకుంటున్నారని చెప్పారు. నిమ్స్ ఆసుపత్రికి ప్రతి రోజూ 150 నుంచి 180 రోగులు వస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది వేల మంది మూత్రపిండాల మసస్యతో బాధపడుతున్నారని చెప్పారు. అదే దేశం మొత్తం మీద పరిశీలిస్తే సంవత్సరానికి రెండు లక్షల మంది చొప్పున డయాలసిస్ చేయించుకుంటున్న వారి సంఖ్య పెరుగుతూ వస్తుందన్నారు. దేశ జనాభాలో 10 .. 12 కోట్ల మంది మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నారని చెప్పారు. వీరిలో 60 నుంచి 70 శాతం మంది డయాలసిస్ చేయించుకుంటున్నారని, మిగిలిన వాళ్లు అవగాహన లేక మరణాలు సంభవిస్తున్నాయని చెప్పారు. 50 శాతం మంది కిడ్నీ సమస్య గురైన ఆరు నెలల్లోనే తమ ప్రాణాలను పోగొట్టుకుంటున్నారని.. 10 శాతం మంది మాత్రం ఐదేళ్ల వరకు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారని చెప్పారు.
మూడు లీటర్లు నీరు..
కిడ్నీ సమస్యలకు దూరంగా ఉండాలంటే తప్పనిసరిగా ప్రతి వ్యక్తి రోజు మొత్తంలో మూడు లీటర్ల నీటిని తాగాలని చెప్పారు. శీతలపానీయాలకు చాలా దూరంగా ఉండాలని సూచించారు. ఆహారంలో ఉప్పు చాలా వరకు తగ్గించాలన్నారు. అంతే కాకుండా విధిగా వ్యాయామం చేయడంతో పాటుగా పాజిటివ్ థికింగ్‌తో ఉండాలని చెప్పారు. నిరాశవాదంతో గడపడం వల్ల సాధించేది ఏం లేదన్నారు. దాని వల్ల అనారోగ్యాలను కోరి తెచ్చుకోవడమవుతుందని డా. శ్రీభూషణ్ రాజు స్పష్టం చేశారు.

Blood pressure and kidney disease