Home కలం బి.ఎన్. శాస్త్రి- ఒక విజ్ఞాన సర్వస్వం

బి.ఎన్. శాస్త్రి- ఒక విజ్ఞాన సర్వస్వం

edit

తెలంగాణ చరిత్రకు అద్దం పట్టే అనేక గ్రంథాలు రాసినవాడు. శాసనాలకు జీవంపోసే చరిత్ర కళ్లు తెరిపించినవాడు. తెలంగాణ నేల ప్రాశస్తాన్ని ఆధారాలతో నిరూపించిన వాడు. తెలుగు గడ్డపై పుట్టి లోకంలో ఖ్యాతి గడించిన సుప్రసిద్ధుడు. నిత్యాన్వేషి, సత్శోధకులు, చరిత్ర పరిశోధనా తపస్వి బి.ఎన్. శాస్త్రి గారు. శాసన పరిష్కర్తగా, చరిత్ర కారుడిగానే కాక స్వాతంత్య్ర సమరయోధుడుగా, కవిగా, కథకుడిగా, నవలా కర్తగా, నాటక కర్తగా, విమర్శకుడిగా, ఉత్తమ స్కూల్ టీచర్‌గా, పత్రికా సంపాదకులుగా ఇలా అంచెలంచెలుగా ఎదిగి అటు చరిత్రలోనూ, ఇటు సాహిత్యంలోనూ శిఖర స్థాయిని గడించిన సారస్వతామూర్తి, బహుముఖ ప్రజ్ఞాశాలి బి.ఎన్. శాస్త్రి. ఆయన గురించి ఎవ్వరికీ కొత్తగా చెప్పవల్సిన పనిలేదు. తెలుగు గుండెలకు ఆయన పేరు సుపరిచితమే. ఆయన ఆలుపెరుగని కృషిని మరొక్కసారి గుర్తు చేసుకోవడం మన ధర్మం.
బి.ఎన్. శాస్త్రి. పూర్తి పేరు భిన్నూరి నరసింహ శాస్త్రి. మరికొందరి దృష్టిలో ‘శాసనాల శాస్త్రి’. 1932 డిసెంబర్ 10న సరస్వతమ్మ, రామకృష్ణయ్య పుణ్య దంపతులకు ప్రస్తుత యాదాద్రి భువనగిరి జిల్లా రామన్న పేట మండలం ఇంద్రపాలనగరంలో జన్మించారు. చిన్ననాడే పెద్ద బాలశిక్ష పూర్తి చెయ్యటమే కాక పద్యాలను ఒంటబట్టించుకున్నారు. ఉర్దూ, తెలుగు, ఆంగ్లం, సంస్కృతం, పాళీ వంటి భాషలు చిరుప్రాయం నుండే నేర్చుకోవటం ప్రారంభించి సఫలీకృతులయ్యారు. అంతటితో ఆగక ఎన్నో ఒడిదుడుకుల మధ్యన 1958లో బి.ఏ పూర్తి చేశారు. 1959లో ఓ.యూలో ఎం.ఏలో చేరి ఉత్తమ విద్యార్థిగా రాణించారు. నాడే ఓ.యూలో నిర్వహించిన సెమినార్లకు సంబంధించిన వ్యాసాలను మన సంస్కృతి-చరిత్ర అని, శ్రీనాథ భారతము అని రెండు సంకలనాలను వెలువరించారు. ఆచార్య ఖండవల్లి, బిరుదురాజు, పల్లా దుర్గయ్య వంటి పెద్దల ఆశీస్సులు పొందారు. బాల్య దశలో ఒక కోనేరు వద్ద ఆటలాడుతున్న శాస్త్రి గారికి ఒక శిలాఫలకం కనిపించింది. దాన్ని చదవడానికి ప్రయత్నించినా అది సాధ్యం కాలేదు. నాటి నుండే శాసనాలపై ఆయన దృష్టి మళ్ళినట్లుంది. క్రమంగా ఆయన జీవితమంతా శాసనాలకు, వాటి ఆధారంగా చరిత్రకు ఆయువు పోస్తూ సాగింది.
నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమాలను 7వ తరగతి నుండే నడిపారు. ఉద్యమ పాటలు రాయటమే గాక నల్లగొండలోని ప్రొద్దుటూరులో రావి నారాయణ రెడ్డి నాయకత్వంలో నిర్వహించిన ట్రైనింగ్ క్యాంప్‌లో పాల్గొన్నారు. అంతేగాదు నిజాం కాలంనాటి పరిస్థితులను కళ్ళకు గట్టే విధంగా ‘విప్లవ జ్వాల’ నవలను రాసారు. వివిధ సందర్భాలలో వాటికనుగుణంగా రాధ, జీవన పథం, తీరని కోరిక, పరివర్తన, జీవితం-గమనం, సంధ్యారాగం అనే సాంఘిక నవలలను, వాకాటక మహాదేవి, తుక్కాదేవి అనే చారిత్రక నవలలను రాసారు. నీరాజనం గేయనాటికతో పాటు సహకారం, గ్రామజీవనం, కిరాయిదారు, రెండు నాటికలు అనే నాటికలను రచించారు. బాలగేయ కావ్యమైన శాస్త్రిగారి పాపాయి పతకం గొప్పదైనదే. విమర్శకుడిగా ‘ కాశీ ఖండము దాని ప్రాశస్తము’ అను గ్రంథంలో శాస్త్రిగారు మనకు దర్శనమిస్తారు. చరిత్ర పరిశోధనలో నిరంతర నిమగ్నమైనప్పటికీ తన సృజనాత్మకతను సాహిత్యరంగంలో నిలుపుకోవడం శాస్త్రి గారికే దక్కింది. 1000 వరకూ శాసనాలను పరిశీలించి స్వయంగా 400 శాసనాలు పరిష్కరించటం, కనుగొనడం ఆయన పరిశోధనా పటిమకు నిదర్శనం. 12 శాసన సంపుటాలను, 5 సర్వస్వములతో పాటుగా ఆంధ్రదేశ చరిత్ర-సంస్కృతిని తెలిపే 20 భాగముల బృహత్ గ్రంథాలను ఒంటిచేత్తో లిఖించి చరిత్ర పూర్వాపరాలు జాతికి అందించిన పరిశోధకాగ్రేసరుడు శాస్త్రిగారు. ఇవే కాక అనేకంగా అముద్రిత గ్రంథాలున్నాయి.
శాస్త్రి గారిని ఉత్తమ పరిశోధకుడిగా నిలబెట్టింది విష్ణుకుండినులపై చేసిన పరిశోధన. కొమర్రాజు, మల్లంపల్లి, నేలటూరి, మారేమండ వంటి ప్రముఖ చారిత్రకుల సరసన చేరే స్థాయికి ఈ పరిశోధన దోహదం చేసింది. విష్ణుకుండినులకు చెందిన రెండు శాసనాలపై శాస్త్రిగారు ప్రత్యేక అధ్యయనం చేశారు. అవి- గోవింద శర్మ శాసనం, విక్రమేంద్ర భట్టారక వర్మ శాసనాలు. వీటి ఆధారంగా విష్ణుకుండినులు తెలంగాణ ప్రాంత పాలకులని, వీరి రాజధాని నేటి ఇంద్రపాలనగరం(పెద్ద తుమ్మలగూడెం) అని నిరూపించి చరిత్రను తిరగరాశారు. అంతకుపూర్వం అమరావతి, విజయవాడ, వేంగి, దెందులూర్‌లనే విష్ణుకుండినులు పాలించినట్లు చరిత్రకారులు గుర్తించగా, శాస్త్రిగారి పరిశోధన మూలంగా సజీవచరిత్ర బయటికి వచ్చింది. ఈయన ప్రకారం క్రీ.శ. 388-90 మధ్య మహారాజేంద్రవర్మ ఇంద్రపాల నగరంను స్థాపించి, తెలంగాణ ప్రాంతాన్ని ఏలినారు. ఈ విషయమంతా 1965లో శాస్త్రిగారు భారతి పత్రికలో రాసి అందరికీ ఫోకస్ అయ్యారు. ఇదిలాఉండగా సురవరం ప్రతాపరెడ్డిగారు అప్పటికే ‘ఆంధ్రుల సాంఘిక చరిత్ర’ 11వ శతాబ్దం నుండి కుంఫిణీ యుగం వరకు అందించారు. కానీ 11వ శతాబ్దం పూర్వపు చరిత్ర అస్పష్టంగానే మిగిలి ఉంది. ఒక సందర్భంలో కొమర్రాజుగారు తెలంగాణలోగల శాసనాలను సేకరించనిదే ఆంధ్రుల సంస్కృతి, చరిత్ర నిర్మాణం సమగ్రంగా కావు అని తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఇటువంటి కారణాలచేత బి.ఎన్. శాస్త్రి శాసనాలు పరిశోధన వైపే పూర్తిగా మొగ్గుచూపి ఆ దిశలో సాగారు.
మొదటగా ‘శాసన సంపుటి 1,2 భాగాలు’ అన్న గ్రంథం అచ్చువేసారు శాస్త్రి. ఎం.ఏ.లో అప్పటికే ఆంధ్రుల చరిత్ర-సంస్కృతిని అధ్యయనం చేసిన వాడు గనుక అనేకాంశాలపై విస్తృతంగా అవగాహన కలిగి వున్నాడు. 1974లో వచ్చిన ఈ గ్రంథంలో మొదటి భాగం విష్ణుకుండిన, మాఠర, కళింగుల ఐదు తామ్రశాసనాలను, రెండవ భాగంలో కందూరి చోడుల, కళ్యాణి చాళుక్యులు, కాకతీయ మొదలగు వంశస్థుల 33 శిలాశాసనాలు సవివరించారు. 72 శాసనాలకు సంక్షిప్త వివరణలతో పాటు 15 కొత్త శాసనాల వివరాలు గల మరో గ్రంథం ‘త్రిపురాంతక దేవాలయ శాసనాలు’. 12 జ్యోతిర్లింగాల్లో 2వది శ్రీశైలం. శ్రీశైలానికి 8 దిక్కుల్లో 8 ద్వార క్షేత్రాలుండగా తూర్పు దిశలో గల ద్వార క్షేత్రమే ఈ త్రిపురాంతక దేవాలయం. దీన్ని గూర్చి చెప్పిందీ గ్రంథం. కాకతీయులకు సామంతులుగా తర్వాత స్వతంత్రులుగా గత కందూరి చోడుల రాజధానులు నల్లగొండలోని కొలనుపాక, పానగల్లు పట్టణాలని, మహబూబ్ నగర్‌లోని కందూరు, కోడూర్, వర్ధమాన పురాలని తెలుపుతూ వారిచ్చిన అగ్రహారాలు, సువర్ణ గోదానాలను గూర్చి శిల్పకళను, సాహిత్య విశేషాలను గూర్చి దాదాపు 40 శాసనాలు సంపాదించి శాస్త్రి గారు పేర్కొన్న ఉద్గ్రంథం’కందూరి చోడుల శాసనాలు-చరిత్ర-సంస్కృతి’.
శ్రీకాకుళంలోగల ప్రసిద్ధ శైవక్షేత్రమైన ముఖలింగ దేవాలయ చరిత్రను ప్రకటిస్తూ 100కు పైగా శాసనాలతో కలిగిన పుస్తకం ‘ముఖలింగ దేవాలయ చరిత్ర-శాసనములు’. దీన్ని గిడుగువెంకట సీతాపతి గారి స్ఫూర్తితో వెలువరించారు. మరో 95కుపైగా శాసనాలు కనిపెట్టి బెజవాడ ప్రాంతంలోని దుర్గామళ్లీశ్వరాలయ లోకానికి చాటారు. ఈ గ్రంథంలో తెలుగు వచనం, తెలుగు పద్యాలు మొదలగు విశేషాలు శాసనాలపై ఎలా ఉన్నాయో ముద్రించారు. కుతుబ్‌షాహీలు అనగానే మదికి తట్టేది గోలకొండ. బహమనీ రాజ్యం క్రీ.శ. 1600లో 5 స్వతంత్ర రాజ్యాలుగా విడిపోగా, అందులో గోలకొండ రాజ్యం ఒకటి. గోలకొండ పాలకులు కొంతకాలం తర్వాత రాక్షసతంగడి యుద్ధంలో తుళువ వంశాన్ని అంతం చేసి, అళియరామరాయలను సంహరించి సువిశాల రాజ్యంగా గోలకొండ రాజ్యాన్ని విస్తరింప చేసినారు. వీరి కాలంనాటి శాసనాలు ఉర్దూ, అరబీ, పారశీ, సంస్కృతాంధ్ర బాషల్లో ఉండగా వాటిని వెలికితీసి చరిత్రకు కొత్త రూపం కల్పించారు. 17 శాసనాలతో చెఱకు రెడ్డి వంశ-చరిత్ర-శాసనములు, 27 శాసనాలతో రేచర్ల రెడ్డి వంశ చరిత్ర-శాసనములు అను కృతులను శాసన ప్రతిబింబాలు, శిల్పాల ఛాయా చిత్రాలతో సహా ప్రచురించి ఖ్యాతి పొందారు. వల్లూరు, గండికోట రాజధానులుగా పానగల్లు పరిసర ప్రాంతాలు పాలించిన ‘కాయస్థ రాజులు’ సంక్షిప్త చరిత్రను 1991లో బయల్పర్చారు. దక్షిణ కాశిగా చెప్పబడే తెలంగాణలోని శైవక్షేత్రం వేములవాడ. దాని చరిత్రను ప్రకటిస్తూ ‘వేములవాడ చరిత్ర-శాసనములు’ అను మహత్తర గ్రంథం శాస్త్రి గారు 12 శాసనాల్లో తెల్పారు. ఇక్కడ రాజరాజేశ్వరాలయం, భీమేశ్వరాలయం, బద్దిగేశ్వరాలయం, నగరేశ్వరాలయాలు కలవు. చాళుక్య రాజవంశాల పాలనలో సబ్బిసాయిర మండలమని పిలవబడిన కరీంనగర్‌కు బోధన్ రాజధానిగా ఉండేదని చరిత్ర. వారి కాలంలో నిర్మించబడిన ఆలయాలు, వారి చరిత్ర, సంస్కృతికి దర్పణం పట్టే శాసనాలు భూ పొరల్లోంచి పెకిలించి విశదీకరించారు శాస్త్రి. నాటి కాలంలో గల పంపకవి, జినవల్లభుల వివరాలు చెప్పారు. ‘మాల్యాల వంశ చరిత్ర-శాసనములు’ అను మరో గ్రంథం కూడా ప్రకటించి మాల్యాల వంశీయులకు విరియాల, గోన వంశీయులతో గల బంధుత్వాన్ని వివరించారు. గోనబుద్ధారెడ్డి కుమార్తె కుప్పాంబిక మాల్యాల వంశానికి చెందిన గుండదండాధీశున్ని వివాహ మాడిన విషయాలు ఈ గ్రంథంలో మనకు అగుపిస్తాయి. ఇవన్నీ ఒక ఎత్తైతే విజ్ఞాన సర్వస్వాలను రాయటం మరో ఎత్తు. మొదట తన జిల్లాపై గల అభిమానంతో ‘నల్లగొండ మండల సర్వస్వం’ రాసి ప్రకటించారు. అదే అదునుగా ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, రెడ్డిరాజ్య, బ్రాహ్మణ రాజ్య సర్వస్వాలు విడుదల చేసి ఆయా ప్రాంతాల పుణ్యక్షేత్రాలు, దర్గాలు, మతాలు, కవులు, పండితులు, సమరయోధుల వివరాలు, ప్రజపోరాటాలతో పాటు ప్రాంతం యొక్క భౌగోళిక చరిత్రను, మండల ప్రశస్తిలు, ఆచార వ్యవహారాలు ఇలా సర్వం ఇందు పొందుపరిచారు. వరంగల్,కరీంనగర్ సర్వస్వాలే కాక తెలంగాణ శాసన సర్వస్వం కూడా సిద్ధం చేయుటకు పూనుకున్న తెలుగుజాతి ఆణిముత్యం శాస్త్రి గారు. సురవరం గారి ‘ఆంధ్రుల సాంఘిక చరిత్ర’ను పూర్వపక్షం చేసే దిశలో అలాగే ఇక్ష్వాకువంశం తర్వాత 500 ఏండ్ల చరిత్రను (విష్ణుకుండినుల శాసనాల ఆధారంగా) బట్టబయలు చేసే గమనంలో ‘ఆంధ్రుల చరిత్ర సంస్కృతి’ గ్రంథాలు రాసి నాటి ప్రముఖ చరిత్రకారులనే అబ్బురపరిచారు శాస్త్రి. ఇక ఆదికవి స్థానం నన్నెచోడుడికే దక్కాలని అనేక ఆధారాలు కట్టుదిట్టం చేసి నిరూపించారు. తన పిహెచ్‌డి గ్రంథం ‘డెవలప్‌మెంట్ ఆఫ్ తెలుగు లాంగ్వేజ్ త్రూ ఇన్సిప్షన్’లో ఈ వివరాన్ని చేర్చగా దాన్ని అనాటి ఆచార్యులు సహించక తనతో ఏకీభవించలేదు. సిద్ధాంత గ్రంథాన్ని తిరగరాస్తే పట్టా ఇస్తామన్నారు. అందుకు శాస్త్రిగారు ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోవటమేకాక పిహెచ్‌డినే వదులుకున్న సత్శీలురు. ఇవి ఆయన పట్టుదలకు, ఆయనపై ఆయనకు గల విశ్వాసానికి ప్రతీకలు.
శాస్త్రిగారు 1980లో ‘మూసీ’ పత్రికను ప్రారంభించగా మధ్యలో కాస్తా ఆగినా నేటికీ అనేక ప్రామాణిక, పరిశోధనాత్మక వ్యాసా లు తెలుగు వారి సిరులపంటగా అందిస్తూ నడుస్తుంది. వలిగొండ వద్ద మూసీ నది ఒడ్డున నిర్మించ తలపెట్టిన త్రిశక్తి దేవాలయాలు శాస్త్రిగారికి హిందుత్వంపై, ప్రాచీన భారతీయ సంప్రదాయంపైగల అభిమానాన్ని చాటుతున్నాయి. 2002, ఏప్రిల్ 4న తన భౌతికకాయం విడిచిన బి.ఎన్. శాస్త్రి అవార్డులకూ, రివార్డులకు ఏనాడూ ఆశపడనివాడు. స్వయం కృషినే నమ్మినవాడు. బి.ఎన్. లేనిదే తెలంగాణకే కాదు తెలుగుకే చరిత్ర లేదనేది వాస్తవం. అందుకే బి.ఎన్. శాస్త్రి గారంటే ఒక సంకల్పబలం. ఒక విశ్వవిద్యాలయం. ఒక విజ్ఞాన సర్వస్వం. ఒక జగత్తు.