Home తాజా వార్తలు బోయింగ్ విమానాలపై నిషేధం

బోయింగ్ విమానాలపై నిషేధం

Boeing 737 MAX Planesసాయంత్రానికల్లా అన్నింటిని నిలిపివేయాలన్న డిజిసిఎ

ముంబై: ఇథియోపియన్ విమానం కూలి 157 మంది మృత్యువాత పడిన ఘటనతో బోయింగ్ 737 మాక్స్8 విమానాలకు ఫుల్‌స్టాప్ పడుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ విమానాలను నిలిపివేస్తుండగా.. భారత్‌లోనూ ఇదే నిర్ణయం తీసుకున్నారు. బుధవారం సాయంత్రం 4 గంటల వరకల్లా బోయింగ్ విమానాలన్నింటి కిందకి దింపేయాలని, వీటిని ఇకపై నడపొద్దని డిజిసిఎ(డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) ఆదేశాలు జారీ చేసింది. ఈ విమానాలను తక్షణమే విమానాశ్రయాలకు పరిమితం చేయాలన్న పౌర విమానయాన మంత్రిత్వశాఖ నిర్ణయించింది.

ఈమేరకు డిజిసిఎ కూడా బోయింగ్ విమానాలను నిలిపివేయాల్సిన సమయాన్ని కూడా ప్రకటించింది. ఇటీవల ఇథియోపియాలో జరిగిన ఘోర విమాన ప్రమాదంతో ప్రపంచంలోని పలు దేశాలు ఈ రకం విమానాలను నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఆరు నెలల వ్యవధిలో రెండు సార్లు బోయింగ్ 737 మ్యాక్స్ రకానికి చెందిన విమానాలు ప్రమాదానికి గురయ్యాయి. దీంతో వాటి భద్రతా ప్రమాణాలపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భారత్ విషయానికొస్తే స్పైస్‌జెట్, జెట్ ఎయిర్‌వేస్‌లు ఈ రకం విమానాలను కలిగి ఉన్నాయి. డిజిసిఎ ఆదేశాల మేరకు ప్రయాణికులు, సిబ్బంది భద్రత దృష్టా బోయింగ్ 737 మ్యాక్స్ సేవల్ని రద్దు చేస్తున్నట్లు స్పైస్ జెట్ ప్రకటించింది.

హైదరాబాద్‌లో నిలిపివేశారు

హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరాల్సిన స్పైస్ జెట్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన రెండు బోయింగ్ విమానాలను రద్దు చేశారు. అహ్మదాబాద్, బెంగళూరుకు వెళ్లాల్సిన విమానాలు రద్దు కావడంతో ప్రయాణికుల కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు.

పతనమైన స్పైస్‌జెట్ షేరు

బోయింగ్ 737 మాక్స్ విమానాలను నిషేధిస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేయడంతో ఈ విమానాలను నడుపుతున్న ప్రైవేటు విమాన సంస్థ స్పైస్‌జెట్ షేర్లు మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. ఏ దశలో 8 శాతం వరకూ నష్టపోగా, ఆ తర్వాత కొంత మేరకు పుంజుకున్నాయి. ఉదయం స్పైస్‌జెట్ షేరు ధర రూ.74 వద్ద ప్రారంభమైంది. ఇంట్రాడేలో 7.99 శాతం నష్టంతో రూ.72.50 వద్ద ట్రేడ్ అయ్యింది. ఆ తర్వాత కోలుకుని ఆఖరికి 2 శాతం నష్టంతో రూ.77.15 వద్ద స్థిరపడింది. బోయింగ్ విమానాల నిషేధంతో స్పైస్‌జెట్ బుధవారం 14 విమాన సర్వీసులను రద్దు చేసింది. స్పైస్‌జెట్‌కు 12 బోయింగ్ 737 మాక్స్ విమానాలున్నాయి. మరో ప్రైవేటు విమానయాన సంస్థ జెట్ ఎయిర్‌వేస్ షేర్ల పరిస్థితి కూడా ఇలాగే ఉంది.

6 ఎయిర్‌పోర్ట్‌లను నిర్వహణకు రూ.3 లక్షల కోట్లు

పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యం(పిపిపి) కింద ఆరు విమానాశ్రయాల నిర్వహణకు గాను అదానీ గ్రూప్ ఎఎఐ(ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా)కు దాదాపు రూ.3 లక్షల కోట్లను చెల్లించనుంది. అహ్మదాబాద్, జైపూర్, లక్నో, తిరువనంతపురం, గువహటి, మంగళూరు వంటి ఆరు విమానాశ్రయాలకు కంపెనీ హైయ్యెస్ట్ బిడ్డర్‌గా నిలిచింది. ఫిబ్రవరి 25న ఈ బిడ్‌లను నిర్వహించారు. అదానీ గ్రూప్ ఎక్కువ బిడ్ చేసింది.

విస్తారా విదేశీ ఫ్లైట్లకు అనుమతి

టాటా సన్స్, సింగపూర్ ఎయిర్‌లైన్స్ సంయుక్త సంస్థ విస్తారా ఇకపై అంతర్జాతీయ మార్గాల్లో విమానాలను నడిపేందుకు అనుమతి పొందింది. ఈమేరకు బుధవారం కేంద్ర పౌర విమానయా మంత్రిత్వశాఖ కార్యదర్శి ప్రకటన చేశారు. జూన్‌లో విమాన సంస్థ 20 ఫ్లైట్లను అంతర్జాతీయంగా నడిపేందుకు తగిన అవసరాలను పొందింది.

Boeing 737 Max 8 Aircraft To Stop