Home జాతీయ వార్తలు అయ్యో రామ! నన్నెవరు గుర్తుంచుకుంటారు?

అయ్యో రామ! నన్నెవరు గుర్తుంచుకుంటారు?

Deve Gowdaబెంగళూరు: తాను శంకుస్థాపన చేసిన ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి తనను ఆహ్వానించకపోవడంపై మాజీ ప్రధాని దేవెగౌడ ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలోని అత్యంత పొడవైన అస్సాంలోని బోగీ బీల్ వంతెనను ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం ప్రారంభించిన విషయం తెలిసిందే. బ్రహ్మపుత్ర నదిపై 4.9 కిలోమీటర్ల పొడవైన ఈ రైల్-కమ్-రోడ్డు వంతెన నిర్మాణానికి రూ 5900 కోట్ల వ్యయమైంది. 1985 నాటి అస్సాం ఒప్పందంలో భాగంగా 1997-98లో ఈ వంతెన నిర్మాణానికి అనుమతి మంజూరైంది. 1997 జనవరి 22న అప్పటి ప్రధాని, జనతా దళ్(ఎస్) అధ్యక్షుడు దేవెగౌడ శంకుస్థాపన చేశారు.

కాశ్మీరుకు రైల్వే లైన్, ఢిల్లీ మెట్రో, బోగీ బీల్ వంతెన వంటి అనేక ప్రాజెక్టులను నేనే(ప్రధానిగా) మంజూరు చేశాను. ఈ ప్రాజెక్టులకు వంద కోట్ల చెప్పున బడ్జెట్‌లో నిధులు కూడా కేటాయించి శంకుస్థాపనలు చేశాను. అవన్నీ ప్రజలు నేడు మరచిపోయారు అని గౌడ వాపోయారు.

బోగీ బీల్ వంతెన ప్రారంభోత్సవానికి రావలసిందిగా మీకు ఆహ్వానం అందిందా అన్న విలేకరుల ప్రశ్నకు, అయ్యో రామ! నన్నెవరు గుర్తుంచుకుంటారు? కొన్ని పత్రికలు మాత్రం నాటి విషయాలను ప్రస్తావించి ఉండవచ్చు, అని దేవెగౌడ వ్యాఖ్యానించారు. ఈ వంతెన నిర్మాణానికి దశాబ్దాల తరబడి జాప్యం జరగడాన్ని గురించి ప్రశ్నించగా, తాను ఈ విషయంలోనే విభేదిస్తానని ఆయన చెప్పారు. హస్సన్-మైసూరు ప్రాజెక్టును 13 నెలల్లో పూర్తి చేశాను. రెండు వంతెనలు సకాలంలో పూర్తి చేశాను. ఘటప్రభపై అనగ్‌వాడి వంతెన, కృష్టానదిపై వంతెనను వెళ్లి చూడండి, అని ఆయన చెప్పుకొచ్చారు.

People forgot me, says Deve Gowda