Home మహబూబ్‌నగర్ మీరు గెల్చుకున్నారు?

మీరు గెల్చుకున్నారు?

Prize-Moneyటాటా డొకొమో పేరిట రూ.4.5 లక్షల బురిడి, అమాయకులే టార్గెట్‌గా మోసగాళ్ళ వల, మోసపోయిన రాయికల్ వాసులు
పోలీస్టేషన్‌లో ఫిర్యాదు, ఇప్పటికీ డబ్బులు గుంజుతున్న వైనం

షాద్‌నగర్ టౌన్: కంగ్రాట్స్‌లేషన్ మీరు పాతిక లక్షల నగదు బహుమతిని గెల్చుకున్నారు. టాటా డొకొమో కంపెనీ తరఫున మీకు హార్థిక శుభాకాంక్షలు. వెంటనే కంపెనీ చెప్పిన విధంగా చేసినట్లయితే పాతిక లక్షల రూపాయలు మీవే. ఇది నిజమేనని నమ్మిన అమాయకుల వద్ద నుంచిట్యాక్స్‌ల పేరిట సుమారు నాలుగున్నర లక్షల రూపాయలను తమ అకౌంట్‌లోకి వేసుకున్న ఘరానా మోసగాళ్ళ మాయాజాలమిది. నిరక్షరాస్యులను లక్షంగా చేసు కొని టాటా డొకొమో వినియోగదారులకు పథకం ప్రకా రం గాలం వేసిన సంఘటనలో ఇది. మోసం జరిగిందని గ్రహించిన బాధితులు చివరికి షాద్‌నగర్ పోలీసులను ఆశ్రయించారు.

బాధితుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఫరూఖ్‌నగర్ మండలం రాయికల్ గ్రామానికి చెందిన ఎం.డి యూసూఫ్ తాను వాడుతున్న టాటా డొకొమో సెల్ ఫోన్ నెంబర్ 8897287149 కు గత నెల సెప్టెంబర్ 9న కాల్ వచ్చింది. టాటా డొకొమో కంపెని నెంబర్లు అంటూ 923460842661, 92306923584, 923471431317 నెంబర్ల నుండి పలు దఫాల్లో బాధి తుడు యూసుఫ్‌కు ఫోన్లు వచ్చాయి. అవతలి వ్యక్తులు నమ్మబలుకుతూ యూసూఫ్‌తో పాటు అతని కుమాసరుడు ఎం.డి నజీర్‌తో మాట్లాడుతూ 25 లక్షల ప్రైజ్‌మనీ గెలుచుకున్నారంటూ కల్లబొల్లి కహానీలు చెప్పారు. ఇది నమ్మిన తండ్రి కొడుకులు ప్రైజ్ మనీకోసం వారితో రెగ్యులర్‌గా ఫోన్‌లలో సంభాషణలు జరిపారు. చివరకు మోసగాళ్ళు ప్రైజ్‌మనీ 25లక్షల రూపాయలు మీకు చేరాలంటే కొన్ని నిబంధనలు ఉన్నాయని,దానికోసం పన్ను చెల్లించాల్సి ఉంటుందని నమ్మించారు. దీంతో పాతిక లక్షలు వస్తాయని నమ్మిన తండ్రి కొడుకులు యూసూఫ్, నజీర్‌లు మోసగాళ్ళు చెప్పినట్లు డబ్బులు బ్యాంకుల్లో జమచేసుకుంటూ వెళ్ళారు.

ఈ దశలో గత నెల 9న బ్యాంక్ ఆఫ్ బరోడాకు బౌమిక్ పరమేష్ పేరిట రూ.17250, 10న పవన్‌కుమార్ పేరిట రూ.33000, ఇండియన్ బ్యాంకు అకౌంట్‌లో రోషన్ ఆలం పేరిట రూ.40000, 11వ తేదిన భారత్ శర్మ పేరిట రూ.35000, మళ్ళి రోషన్ ఆలం పేరిట రూ.48000, రవి భూషణ్ పేరిట రూ. 48000, 14వ తేదిన రవికుమార్ పేరిట కెనరా బ్యాంక్‌లో రూ.36000, తిరిగి రోషన్ ఆలం పేరిట రూ.36000, రవిభూషణ్ తివారి పేరిట రూ.32000 డబ్బులు జమ చేశారు. ఆ తరువాత పాతిక వేల చొప్పున రెండు సార్లు 15వ తేదిన మరో వ్యక్తి రవి కుమార్ పేరిట 50వేలు జమచేశారు. అలాగే రోషన్ ఆలం పేరిట ఇండియన్ బ్యాంక్ ద్వారా 10వేలు ఒకసారి, 16వేలు రెండవ సారి, మూడవ సారి 39000ల నగదు జమ చేశారు. మొత్తం 440250 రూపాయలు ఇప్పటికి జమ చేశారు.

ఆన్‌లైన్‌లో ప్రముఖుల పేరిట చెక్ చూపిస్తూ
మోసగాళ్ళు డబ్బులు గుంజుతున్న తరుణంలో బాధితులు యూసూఫ్, నజీర్‌లు వేసిన డబ్బులకు సరిగ్గా సమాధానం రావడం లేదని, మా డబ్బులు మాకు ఇవ్వాలంటూ మోసగాళ్ళకు మళ్ళి ఫోన్‌లు చేస్తూ వత్తిడి పెంచారు. దీంతో మోసగాళ్ళు మరింత నమ్మించే విధంగా ఆన్‌లైన్ లో ఓ చెక్కును తయారుచేసి వీరికి నఖలు పంపారు. ఈ చెక్కుపై 25లక్షల రూపాయలతో పాటు బాధితుడు యూసూఫ్ ఫోటోతో బిగ్‌బి బాలీవుడ్ నటుడు అమితాబచ్చన్ కరోడ్‌పతి ఫోటో, అదే విధంగా భారత ప్రధాని నరేంద్రమోడి ఫోటోను కూడా చెక్‌పై ప్రచురించారు. మీ చెక్ సిద్ధమైం దని ఇక 1.75లక్షల రూపాయలు జమ చేస్తే 25లక్షల చెక్కు వస్తుందని ఫోన్‌లో చెప్పారు. దీంతో విసుగెత్తిన బాధితులు వారి ప్రవర్తనపై అనుమానం రేకెత్తింది.

అర్థంకాని లాజిక్‌లు ఎన్నో
ఈ మొత్తం తతంగంలో అర్థంకాని లాజిక్‌లు చాలానే ప్లే చేయడంతో బాధితులు వీరి ఉచ్చులో చిక్కారనిపిస్తుంది. కేవలం బాధితుడు యూసూఫ్ ఫోన్ నుంచి మాత్రమే మోసగాళ్ళకు ఫోన్ వెళ్తుంది. ఇతర ఏ ఫోన్ నుంచి కాల్‌చేసినా స్విచ్‌ఆఫ్ వస్తుంది. అలాగే మోసగాళ్ళ బురిడితో తండ్రి యూసూఫ్ ఫోన్‌కు కొడుకు నజీర్ ఫోన్‌లు రావడం ఆ ఫోన్‌ను కూడా ట్యాప్ చేసి మాట్లాడటం లాంటి చేష్టలతో వీరు కంపెని వారే అని గట్టిగా నమ్మారు. అలాగే కేవలం వీరు మాట్లాడితేనే వారి ఫోన్ నెంబర్లు రింగ్ కావడం మిగతా నెంబర్లతో ట్రైచేస్తే కలువకపోవడం లాంటి లాజిక్‌లు ఎన్నో ప్లేచేశారు. మొత్తం 12 డిజిట్‌లతో కూడిన మోసగాళ్ళ సెల్‌ఫోన్ నెంబర్లు 923460842661, 92306923584, 923471431317 విచిత్రంగా ఉండటం దాదాపు ఇవి ఇతర దేశాలవే నన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి.

తుదకు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు
మొత్తం తతంగం పరిశీలించిన మీదట బాధితులు యూసూఫ్, నజీర్‌లకు అనుమానం బలపడింది. తాము ఇంకా మోసపోతున్నామన్న తపన పెరగడంతో ఇతరులకు జరిగిన విషయం చెప్పారు. దీంతో వారు జరిగింది మోసం అని కనిపెట్టి లబోదిబోమన్నారు. చివరగా మీడియాను గురువారం కలుసుకున్నారు. మీడియా సాక్షిగా బాధితులు మోసగాళ్ళ నెంబర్లకు ఫోన్‌లు చేయగా మళ్లీ వారు స్పందించి మాట్లాడారు.