Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

ఐపిఎల్ ఆరంభ వేడుకలకు బాలీవుడ్ స్టార్లు..

ckt

ముంబయి : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ట్వంటీ20 టోర్నమెంట్ పదకొండో ప్రారంభోత్సవ వేడుకలకు బాలీవుడ్ స్టార్లు ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నారు. ఏప్రిల్ 7న ముంబయిలోని వాంఖడే స్టేడియంలో ఈ ప్రారంభ వేడుకలు జరుగనున్నాయి. ఈ వేడుకలను భారీ ఎత్తున నిర్వహించేందుకు ఐపిఎల్ నిర్వాహకులు చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో బాలీవుడ్ యువ స్టార్లు అలరించనున్నారు. రణ్‌వీర్ సింగ్, పరిణితి చోప్రా, వరుణ్ ధావన్, జాక్వలిస్ ఫెర్నాండెజ్‌లు తమ ప్రదర్శనతో అభిమానులను కనువిందు చేయనున్నారు. ఈ విషయాన్ని శనివారం ఓ జాతీయ మీడియా వెల్లడించింది. డిఫెండింగ్ చాంపియన్ ముంబయి ఇండియన్స్, మాజీ చాంపియన్ చెన్నై సూపర్‌కింగ్స్ జట్ల మధ్య వాంఖడే స్టేడియంలో తొలి మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు ప్రారంభ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టారు. బాలీవుడ్ స్టార్లు తమ ప్రదర్శనతో కనువిందు చేసేందుకు సిద్ధమయ్యారు. వీరితో పాటు చాలా మంది బాలీవుడ్ స్టార్లు, మాజీ, ప్రస్తుత భారత క్రికెటర్లు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నారు. కాగా, ఈసారి వేడుకలకు రెండు జట్ల కెప్టెన్లు మాత్రమే హాజరుకానున్న విషయం తెలిసిందే. ముంబయి కెప్టెన్ రోహిత్ శర్మ, చెన్నై సారథి మహేంద్ర సింగ్ ధోనిలు మాత్రమే ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరవుతున్నారు. ఇదిలావుండగా గతంలో కంటే ఈసారి ఐపిఎల్ ఆరంభోత్సవ వేడుకలు కాస్త భిన్నంగా జరుగనున్నాయి. దీనికి కారణం సుప్రీం కోర్టు పర్యవేక్షణలోని పాలక మండలి విధించిన ఆంక్షలే కారణం. ప్రారంభోత్సవానికి ఈసారి చాలా తక్కువ మొత్తంలోనే నిధులను కేటాయించారు. గతంలో ఆరంభ వేడుకలకు 30 కోట్ల రూపాయలను కేటాయిస్తే ఈసారి ఈ మొత్తాన్ని రూ.20  కోట్లకు కుదించారు. దీంతో ప్రారంభ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని భావించిన ఐపిఎల్ యాజమాన్యానికి ఇది కొంత కలవర పరిచే అంశమే. మరోవైపు ముంబయి వేదికగా జరిగే ఆరంభోత్సవ కార్యక్రమానికి బాలీవుడ్, క్రికెట్ రంగాలకు చెందిన ప్రముఖులతో పాటు రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నారు. దీని కోసం భారీ భద్రత ఏర్పాట్లను చేస్తున్నారు. మరోవైపు ప్రారంభోత్సవ కార్యక్రమానికి సంబంధించిన టిక్కెట్ల ధరలను కూడా ఈసారి భారీగా పెంచినట్టు సమాచారం. కాంప్లిమెంటరీ పాస్‌లను ఈసారి రద్దు చేసినట్టు తెలిసింది.

Comments

comments