Home ఆఫ్ బీట్ ‘అమ్మా’ నీకు ‘బోనమే’…

‘అమ్మా’ నీకు ‘బోనమే’…

ప్రభుత్వ పట్టువస్త్రాల సమర్పణ
రాత్రి 8గంటలకు శాంతి కల్యాణం
నిఘా కళ్ళ నీడలో పాతబస్తీ
రేపు మాతేశ్వరి ఘటాల భవ్య ఊరేగింపు

Bonalu Festival Celebration in Telangana

మన తెలంగాణ/చాంద్రాయణగుట్ట : తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే తెలంగాణ రాష్ట్ర పండుగ, బోనాల జాతరకు సర్వం సిద్ధమైయ్యింది. ప్రభుత్వం సుమారు 15 కోట్ల రూపాయలతో పలు  అభివృద్ధి పనులను చేపట్టింది. మాతేశ్వరి ఉత్సవాలు ఆలయ నిర్వాహకులకు భారం కాకుండా ప్రభుత్వం గత నాలుగేళ్లుగా అన్ని దేవాలయాలకు హితోదిక ఆర్థిక సహాయం అందిస్తోంది. ఈయేడు 15 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసింది. పాతనగర ప్రజలు అమ్మవారి పండగను ద్విగుణీకృత ఉత్సాహంతో, భక్తిశ్రద్ధలతో జరుపుకునేందు కు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. బోనాల జాతర అంగరంగ వైభవం గా జరపుకోనున్నారు.

ఆదివారం  తెల్లవారు జామున అమ్మవారికి బలిహరణం, అభిషేకానంతరం బోనాల సమర్పణ ప్రారంభమవుతుంది.  లాల్‌దర్వాజా శ్రీ సింహవాహిణి మహంకాళి దేవాలయం, హరిబౌలి శ్రీ అక్క న్న మాదన్న మహంకాళి దేవాలయం,  కోవబేలా శ్రీ బంగారు మైసమ్మ దేవాలయం, రాంబక్షిబండ శ్రీ బంగారు మైసమ్మ దేవాలయం, బేలా చందూలాల్ శ్రీ ముత్యాలమ్మ దేవాలయం, గౌలిపురా శ్రీ మహంకాళి మాతేశ్వరి భారతమాత, కోటమైసమ్మ దేవాలయం, ఉప్పుగూడ శ్రీ మహంకాళి దేవాలయం, అలియాబాద్ శ్రీదర్బార్ మైసమ్మ దేవాలయం, చార్మినార్ శ్రీ భాగ్యలక్ష్మి దేవాలయం, మీరాలం మండి శ్రీ మహంకాళి దేవాలయం, చాంద్రాయణగుట్ట కుమ్మర్‌వాడి శ్రీ కనకదుర్గ దేవాలయం, హరిజనబస్తీ శ్రీ నల్లపోచమ్మ దేవాలయం, చాంద్రాయణగుట్ట చౌరస్తాలోని శ్రీ బంగారు మైసమ్మ దేవాలయం, నారాయణబాగ్ శ్రీ రక్తమైసమ్మ దేవాలయం తదితర ప్రాంతాలలోని ఆలయాలను రంగు రంగుల విద్యుత్ దీపాలు, రకరకాల పూలు, వేప ఆకులతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు.

దారి పొడవున కళ్లు మిరుమిట్లు గొల్పే విద్యుళ్ళతలతో కూడిన భారీ దేవతా మూర్తులతో రూపొందించిన స్వాగత తోరణాలు ఉత్సవాలకు ఏర్పాటు చేశారు. పండగను పురస్కరించుకొని అధికార, అనధికార ప్రముఖులతోపాటు వివిధ పార్టీల రాజకీయ నాయకులు అమ్మవారిని దర్శించుకోనున్నారు. తీన్మార్ జానపద గీతాల మోతలు, అలంకరణలు పాతబస్తీలో బోనాల శోభను ఉట్టి పడేలా చేస్తున్నాయి. కాగా రాత్రి 8గంటలకు వేద పండితుల మంత్రాచ్ఛారణల మధ్య ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ అమ్మవారికి శాంతి కల్యాణం నిర్వహిస్తారు.