Home లైఫ్ స్టైల్ పుస్తకంతో విశ్వదర్శనం

పుస్తకంతో విశ్వదర్శనం

Book-faie-in-telangna

పుస్తక ప్రియులకు శుభవార్త…ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే పుస్తకాల పండుగ వచ్చేస్తోంది.. దేశ విదేశాల నుంచి వేల సంఖ్యలో పుస్తకాలు ప్రదర్శనలో కొలువుదీరనున్నాయి. విభిన్న భావధారల సముచిత సమాహారం…విభిన్న ఆలోచనలకు…ధోరణులకు, వాదాలకు, చర్చలకు ఆలవాలం హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శనశాల. లుక్ కల్చర్ వచ్చిన తర్వాత బుక్ కల్చర్ పోయిదనుకునేవారికి సమాధానం ఈ పుస్తక ప్రదర్శన… పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ ఎఫైర్స్, జీకే, తెలుగు అకాడెమీ, పోటీ పరీక్షల పుస్తకాలు, తెలంగాణ చరిత్ర, జీవత చరిత్రలు, రాజకీయ విజ్ఞానం, భాషాసాహిత్యాలు, సామాజిక శాస్త్రం , అర్ధ శాస్త్రం, జర్నలిజం, విజ్ఞానం, ఆరోగ్యం, విద్య, బాల సాహిత్యం, కథలు, నవలలు, పాటలు, సమకాలీన రాజకీయాలు, వ్యక్తిత్వ వికాసం, వ్యాకరణం, డిక్షనరీలు ఇలా ఒకటనికాదు అన్ని రకాల పుస్తకాలు కొలువుదీరే ప్రదేశమిది…ఈ నేపథ్యంలో హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షుడు, కవి, రచయిత, బీసీ కమిషన్ సభ్యులు జూలూరి గౌరీశంకర్‌తో మాటాముచ్చట…

పుస్తకాలను పండుగలా జరుపుతున్నట్లున్నారు?

అవును. చిన్నాపెద్దా తారతమ్యం లేకుండా అందరూ సందర్శించే ఈ ప్రదర్శనను పుస్తకాల పండుగలానే భావించాలి. ఇది పుస్తక మతం. దీంట్లో అందరూ రావచ్చు. విస్తృతమైనటువంటిది. పుస్తక ప్రదర్శనల ద్వారా లక్షలాది మంది దగ్గరకు పుస్తకం చేరుతుంది. హైదరాబాద్ బుక్ ఫెయిర్ గురించి… పుస్తకాలకు సంబంధించి దేశంలోనే హైదరాబాద్ బుక్ ఫెయిర్ రెండో స్థానంలో నిలిచింది. 35 సంవత్సరాల క్రితం బుక్‌ఫెయిర్ హైదరాబాద్ నగరంలోని సిటీ సెంట్రల్ లైబ్రరీలో ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 3ం ప్రదర్శనలు జరిగాయి. ఢిల్లీ, కలకత్తా, జైపూర్ తర్వాత అతిపెద్ద పుస్తక ప్రదర్శన మనదే. ప్రతి ఏడాది డిసెంబర్‌లో నిర్వహిస్తున్నాం. ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న హైదరాబాద్ బుక్ ఫెయిర్ ఈ నెల 18 నుంచి 28 వరకు జరుగనుంది. జ్ఞాన తెలంగాణ నిర్మాణానికి పునాదిగా నిర్వహించే ఈ ప్రదర్శనను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాక ఇతర రాష్ట్రాల నుంచి పుస్తక విక్రేతలు తరలిరానున్నారు. తెలంగాణ కళాభారతి (ఎన్‌టిఆర్ స్టేడియం)లో జరిగే 31వ పుస్తక ప్రదర్శన ఇది. గత ఏడాది పదిలక్షల మంది పుస్తక ప్రియులు ప్రదర్శనను సందర్శించారు. ప్రతి ఏడాది డిసెంబర్‌లో జరిగే పుస్తకప్రదర్శన ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా వాయిదా పడింది. సాంస్కృతికంగా, భాషాపరంగా తెలుగు మహాసభలు జరిగితే హైదరాబాద్ బుక్ ఫెయిర్ అనేది జ్ఞాన తెలంగాణ నిర్మాణానికి పునాదిగా జరుగనుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పేరెన్నికగల పుస్తకాలన్నింటికీ సంబంధించి కూడా పబ్లిషర్స్ పుస్తకాలను తీసుకొచ్చి ఇక్కడ పెడతారు. ప్రపంచవ్యాప్తంగా ఈ నెలలో రిలీజైన పుస్తకం కూడా ప్రదర్శనశాలలో దొరికే అవకాశం ఉంటుంది. అన్ని కోణాల నుంచి అన్ని రకాల పుస్తకాలు దొరుకుతాయి. పలు జాతీయ భాషలు, పలు రాష్ట్రాల మాతృభాషలకు సంబంధించిన స్టాల్స్ ఉంటాయి.

టైమింగ్స్ ఎలా ఉంటాయి?

ప్రతి రోజూ మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 8.30 వరకు ప్రదర్శన నడుస్తోంది. ఈసారి రెండు వేదికలు పెడుతున్నాం. ఒక పెద్ద వేదిక, ఒక చిన్నవేదిక ఉంటాయి. పుస్తకావిష్కరణ కార్యక్రమాలన్నీ చిన్నవేదికపై జరుగుతాయి. సాయంత్రం పూట 5 నుంచి 8.30 వరకు జరుగబోయే సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రముఖుల సందేశాలన్నీ పెద్ద వేదికపై నిర్వహించనున్నాం.

తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత బుక్‌ఫెయిర్ పరిస్థితుల్లో ఏమైనా మార్పులు వచ్చాయా?
రాష్ట్రం అవతరించిన తర్వాత బుక్‌ఫెయిర్‌కు మరింత అందం వచ్చింది. దేశవ్యాప్తంగా 350కి పైగా పబ్లిషర్స్ ఈ ప్రదర్శనలో పాల్గొంటారు. ప్రభుత్వం కూడా పుస్తక ప్రదర్శనకు మరింత చేయూత నిస్తుంది. నగరం నడిబొడ్డున ఉన్న తెలంగాణ కళాభారతి(ఎన్‌టిఆర్ స్టేడియం)ని ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది. ఇది చాలా పెద్ద సాయం.

పుస్తకాలు చదివే అలవాటు బాగా తగ్గింది కదా?
పుస్తకాలు చదివే అలవాటు కొంత తగ్గినమాట నిజమే. బుక్ కల్చర్ కొంత తగ్గి లుక్ కల్చర్ పెరిగింది. పుస్తక ప్రదర్శనలు యువతలో కొత్త ఆలోచనలు రేకెత్తించడానికి ఉపయోగపడతాయి. ఎలక్ట్రానిక్ మీడియా నుంచి పుస్తకం వైపునకు దృష్టి మరల్చడానికి దోహదపడతాయి.

తెలంగాణ నిర్మాణంలో పుస్తకాల పాత్ర…
తెలంగాణ ఉద్యమ సమయంలో పుస్తకాలు అత్యంత కీలకపాత్ర పోషించాయి. ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ రచించిన తెలంగాణలో ఏం జరుగుతుందిఅన్న పుస్తకం రాష్ట్రసాధన ఉద్యమానికి ఎంతో ఉపయోగపడింది. తెలంగాణ ఉద్యమానికి భావజాల ప్రచారానికి పుస్తకాలు ఎంతో దోహదపడ్డాయి. తెలంగాణ పునర్నిర్మాణంలో వీటి పాత్ర మరింత ఉంది. పునర్నిర్మాణం పటిష్టంగా జరగాలంటే అది జ్ఞాన తెలంగాణగా మారాలి. సాహిత్యం నుంచి శాస్త్ర సాంకేతిక రంగాల వరకు మన పునాది గట్టి పరచుకోవడానికి అన్ని శాస్త్రాలకు సంబంధించిన పుస్తకాలను యువత లోతుగా అధ్యయనం చేయాల్సి ఉంది.

తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత తెలంగాణ సంస్కృతి ఆట పాట మాట ఇవన్నీ ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. తెలంగాణ సంస్కృతి కులీకుతుబ్‌షాల చరిత్ర, నిజాం రాజుల పాలన, తెలంగాణలో ఉన్న భిన్న సంస్కృతులు, గుళ్లు గోపురాలు ఇవన్నీ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ముఖ్యంగా పోటీ పరీక్షలకు వెళ్లే అభ్యర్థులు ఈ పుస్తకాలు చదవాల్సి ఉంటుంది. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డా. నలిమెల భాస్కర్ రాసిన తెలంగాణ పదకోశం లాంటి వేలాది పుస్తకాలు ఈ ప్రదర్శనలో ఉంటాయి. తెలంగాణ చరిత్ర భిన్న కోణాల్లో వచ్చాయి. అవి లక్షల్లో అమ్ముడుపోతున్నాయి.

పుస్తక పఠనం ప్రాధాన్యం…
పుస్తక పఠనంతో వీసాలేకుండా విశ్వదర్శనం చేయొచ్చు. ప్రతి ఒక్కరి జీవితాల్లో పుస్తకానిది ఓ ప్రత్యేకస్థానం. అన్ని కులాలు, మతాల వారిని తన వద్దకు తెచ్చుకునేవి… భాషను సాహిత్యాన్ని బతికించేవి పుస్తకాలే. పుస్తకాన్ని మించిన మిత్రుడు లేడు..పుస్తక పఠనం విచక్షణాజ్ఞానాన్ని ఇనుమడింపజేస్తుంది. కుటుంబంపై గౌరవం, దేశంపై భక్తి , సమాజంపై నిబద్ధత ..మొత్తం ప్రపంచంపైన అవగాహన కల్పించేవి పుస్తకాలే. అందుకే ప్రతి ఒక్కరూ పుస్తకాలను చదవడం నిత్యకృత్యం చేసుకోవాలి. పుస్తక పఠనంతో ఆరోగ్యం, ఆయుష్షు పెరుగుతుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. పూర్వం శుభకార్యాలకు పుస్తకాలను బహుమతిగా ఇచ్చేవారు. మళ్లీ అదే సంప్రదాయం కొనసాగాలి.

పిల్లలను పుస్తకాల వైపు మళ్లించాలంటే ..?
ఎలక్ట్రానిక్ మీడియా, సామాజిక మాధ్యమాల వల్ల పిల్లల ఆలోచనలు ఎప్పుడూ వాటిచుట్టూనే తిరుగుతుంటాయి. చేతిలో సెల్‌ఫోన్ .. ఆలోచనలన్నీ వైఫై చుట్టూనే తిరుగుతుంటే.. సహజంగా వారిలో సృజనాత్మకత తగ్గుతుంది. పాఠశాల స్థాయి నుంచే పిల్లల ఆలోచనల్లో మార్పులు వచ్చే విధంగా వారిని తీర్చిదిద్దేవి పుస్తకాలే. అందుకు తరగతి గదే పునాది. అటు ఉపాధ్యాయులు, ఇటు తల్లిదండ్రులు పిల్లలచేత కథలు, నవలలు, కవితలు, ఆత్మకథలు చదివించాలి. మంచి సాహిత్యాన్ని వారి చేతికందించాలి. పిల్లలకు పుస్తకాలు చదివే అలవాటు వస్తే, అదే వారి జీవితాన్ని మార్చేస్తుంది.
పుస్తకాలు సమాజాన్ని మారుస్తాయా?
తప్పకుండా మారుస్తాయి. సమాజ మార్పునకు ప్రధాన పనిముట్టు పుస్తకమే. ఉదాహరణకు ప్రపంచంలో అత్యధిక సర్కులేషన్ ఉన్న అమ్మ నవలను కోట్లాది మంది పాఠకులు చదివారు. ఈ పుస్తకం ఎంతో మందికి అద్భుత ఆలోచనల్ని కలిగించింది. కమ్యూనిష్టులను తయారు చేసింది. తెలంగాణ ఉద్యమ నిర్మాణానికి, తెలంగాణ ఆవిర్భావానికి పుస్తకాలే కారణం.

-వ్యక్తిగతంగా ఎలాంటి మార్పులను కలిగిస్తుంది పుస్తకం?
పుస్తకం చదివిన వారే ప్రశ్నించడం మొదలుపెడతారు. అప్పుడే సమస్యలు పరిష్కారం అవుతాయి. తర్వాతనే వ్యక్తితోపాటు సమాజం సన్మార్గంలో నడుస్తుంది. రష్యావిప్లవం, ఫ్రెంచి విప్లవం, ప్రపంచ మార్పునకు పుస్తకాలే దోహదం చేశాయి. అలాగే పారిశ్రామిక విప్లవానికి పుస్తకాలే పునాదులు.

వేదికపై పుస్తకావిష్కరణ జరుపుకోవాలంటే …?
పుస్తకావిష్కరణకు సంబంధించి ఎవరెవరు పుస్తకాలు పెడతారు, ఏ సమయానికి ఇవ్వాలన్న విషయాలన్నీ రచయితలు ముందే మాకు దరఖాస్తు చేసుకుంటారు. ఆ ప్రకారంగా వారు కోరుకున్నటువంటి రోజున, కావాల్సినటువంటి షెడ్యూల్‌ను ఒకటి నిర్ణయిస్తాం. దాని ప్రకారం వారికి ఇస్తాం. నెలరోజుల క్రితమే దేశవ్యాప్తంగా పబ్లిషర్స్‌కు తెలియజేశాం. పుస్తకావిష్కరణకు చెందినవారు అప్లై చేసుకోవడం , శ్లాట్ కావాలని అనడం, ఆ శ్లాట్‌కి ఏరోజు, ఎప్పుడు కావాలో మాట్లాడుకోవడం అవన్నీ జరిగిపోయాయి. అందుకోసం వారు నామినల్ రెంట్ కట్టాల్సి ఉంటుంది.
-ప్రత్యేకమైన స్టాల్స్ ఏమేం ఉంటాయి?
రచయితలు తమ రచనల్ని సొంతంగా ప్రదర్శించాలనుకుంటారు. అటువంటివారి కోసం ప్రత్యేకమైన స్టాల్స్ ఏర్పాటుచేశాం. వీరు కూడా నామినల్‌గా రెంట్ కడితే సరిపోతుంది. అదేవిధంగా అన్ని దినపత్రికలకు సంబంధించిన స్టాల్స్ కూడా ఈసారి పెడుతున్నాం. ఇప్పటివరకు 320 స్టాల్స్ వచ్చాయి. ఇంకా అడుగుతున్నారు. కానీ వీలుగాదు.
ప్రదర్శనకు వచ్చేవారికి ఏర్పాట్లు …
ప్రదర్శనకు వచ్చే సందర్శకులకు మంచినీటి సౌకర్యం, మూత్రశాలలు ఏర్పాటు చేస్తున్నాం. అంతేకాకుండా వారు తిరిగేటప్పుడు కింద దుమ్ము రేగకుండా ఉండేందుకు నీళ్లు చల్లుతున్నాం.

ప్రభుత్వ సహకారం ఉందా?
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, సాంస్కృతిక వ్యవహారాల శాఖ, భాషా సాంస్కృతిక శాఖలు మాతో సహకరిస్తున్నాయి. దాంట్లో భాగంగానే తెలంగాణ కళాభారతి(ఎన్‌టిఆర్ గ్రౌండ్)ను ఉచితంగా ఇస్తున్నారు. ఇది మాకెంతో కలిసివచ్చింది. లేకుంటే రోజుకు లక్ష రూపాయల వరకు కిరాయి చెల్లించాల్సి ఉండేది. ఆర్థికంగా, హార్థికంగా అన్నిరకాలుగా సహకరిస్తున్నారు. కల్చరల్ ప్రోగ్రాంకు కూడా చేదోడువాదోడుగా ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వం, హైదరాబాద్ బుక్‌ఫెయిర్ సంయుక్తంగా బుక్‌ఫెయిర్‌ను నిర్వహిస్తోంది.
-నెల మారినట్లుంది కదా?
పిల్లల పరీక్షలకు ముందుగానే ప్రతి ఏడాది డిసెంబర్‌లో పుస్తక ప్రదర్శనను ఏర్పాటుచేస్తున్నాం. ఈ సారి మాత్రం ప్రపంచ తెలుగు మహాసభలను వాటి కుండే ప్రాధాన్యత వల్ల వాయిదా పడింది. గత సంవత్సరంబుక్‌ఫెయిర్‌ను పదిలక్షల మంది పుస్తక ప్రియులు సందర్శించారు. ఈ ఏడాది కూడా తప్పకుండా పది లక్షలు దాటతారని అంచనా.

-సాంస్కృతిక కార్యక్రమాలకు పెద్దపీట వేస్తున్నట్లున్నారు?
కావల్సిన పుస్తకాల్ని చూడటం, కొనుక్కోవడంతో సరిపోదుగదా. సందర్శకులకు కొంత ఆటవిడుపు కావాలి. అందుకోసం సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తుంటాం. హైదరాబాద్ బుక్‌ఫెయిర్‌లో పుస్తకావిష్కరణ అంటే రచయితలు గౌరవంగా భావిస్తారు. ముఖ్యంగా రాష్ట్రం ఏర్పడ్డాక చాలా పుస్తకాలు వేదికపై ఆవిష్కరణకు నోచుకున్నాయి. విభిన్న ఆలోచనలకు, విభిన్న ధోరణులకు, విభిన్న వాదాలకు సంబంధించిన అంశాలపై కూడా గత ఏడాది సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాం. ఇక పుస్తక ప్రదర్శనశాలకు వచ్చినవారికి ఆటవిడుపుగా బయట తినుబండరాలు లభిస్తాయి. రకరకాల పచ్చళ్లు, పూతరేకుల్లాంటి పిండివంటలు ఇలాంటివన్నీ ఉంటాయి. పార్కింగ్ ప్లేస్ సెపరేట్‌గా ఉంటుంది.

-పుస్తక ప్రదర్శనకు అయ్యే ఖర్చు…
పుస్తకాలకు సంబంధించి ప్రతీ స్టాల్ దగ్గరా మేం కొంత డబ్బు వసూలు చేస్తాం. ఒక స్టాల్ నిర్మించడానికి దాదాపుగా రూ.15, 20 వేలు ఖర్చవుతుంది. స్టాల్ తీసుకునే వారికి కనీస అవసరాలు, ఎలక్ట్రిసిటీ, వాటి నిర్వహణ ఖర్చుతో కూడుకొంది. అందుకే ఒక్కో బుక్‌స్టాల్ దగ్గర రూ. 9వేల వరకు తీసుకుంటాం. ఇంగ్లీషు బుక్ స్టాల్ అయితే రూ.25 నుంచి 35 వేల వరకు వసూలు చేస్తాం. స్టాల్స్‌ను లాటరీ పద్ధతి ద్వారా ఇస్తాం.

వేదికలకు సాహిత్యకారుల పెట్టడానికి కారణం?
రాష్ట్రం ఏర్పడ్డాక నిర్వహిస్తున్న పుస్తక ప్రదర్శన ప్రతిసారీ ప్రాంగణానికీ, వేదికలకు తెలంగాణ ఔన్నత్యానికి సంబంధించినటువంటి మహామహుల పేర్లను పెడుతున్నాం. ఇప్పటివరకు కాళోజీ ప్రాంగణం, జైశంకర్ ప్రాంగణం, సురవం ప్రతాపరెడ్డి ద్వారం, తొలి తెలుగు పాట రాసిన చందాల కేశవదాసు ప్రాంగణం, కవులు సుద్దాల హనుమంతు వేదిక, మహాశ్వేతాదేవి, గూడ అంజన్న వంటి వారి పేర్లు పెట్టాం.

ప్రదర్శనలు హైదరాబాద్‌కే పరిమితమా?
దేశ వ్యాప్తంగా ఢిల్లీ వరల్డ్ బుక్‌ఫెయిర్, కొచ్చిన్‌లో ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్, విజయవాడ, హైదరాబాద్‌లో జాతీయ పుస్తక ప్రదర్శనగా జరుపుకుంటారు. కానీ మేం హైదరాబాద్ పుస్తక ప్రదర్శనను ఈ మహానగరం నుంచి మట్టి పాదాల దగ్గరకు తీసుకెళ్లాం. అంటే మారుమూల నున్న గ్రామంలో కూడా పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేశాం. ఒక వెయ్యి నుంచి రెండు వేల పుస్తకాలను గ్రామంలో పెట్టాం. ఖమ్మంజిల్లా రొట్టెమాకు రేవు అనే ఊరిలో యాకూబ్‌లాంటి కవి, రచయితల పోత్సాహంతో ప్రదర్శనలు జరిగాయి. అక్కడ ప్రదర్శనకు చుట్టుపక్కల గ్రామాలవారు వచ్చారు. ఖమ్మం, వరంగల్లు, మహబూబ్‌నగర్, కొత్తగూడెం, కామారెడ్డి, కరీంనగర్‌జిల్లాలోనూ పుస్తక ప్రదర్శనలు ఏర్పాటుచేశాం. నగరంలో పదిలక్షలు వస్తుంటే అక్కడ లక్షమంది వస్తున్నారు. జిల్లా కేంద్రాలకి, మండల కేంద్రాలకి, మారుమూల గ్రామాలకీ ఈ పుస్తక ప్రదర్శనలను తీసుకుపోతున్నాం. పుస్తకానికి విసృతమైన ప్రచారం కల్పించడమే మా లక్షం. పుష్పక విమానంలాంటి పుస్తక విమానాన్ని ఎక్కితే ప్రపంచాన్ని మొత్తం ఖర్చు లేకుండా చుట్టిరావచ్చు. ఏడాది మొత్తంలో ఒక్కోనెల ఒక్కోచోట జిల్లాలో ప్రదర్శనలు ఏర్పాటుచేస్తున్నాం.

-ఎటువంటి పుస్తకాలు ఉంటాయి?
పంచతంత్రం, చందమామ, బాలల బొమ్మలు, తెనాలిరామలింగడు, భాగవతం, అరేబియన్‌నైట్స్, బంగారు నీతికథలు, అక్బర్ బీర్బల్, గ్రీకుపురాణంలాంటి బాలసాహిత్యానికి సంబంధించిన పుస్తకాలు లభిస్తాయి. భక్తి నుంచి అంతరిక్షంలో జరుగుతున్న శాస్త్రసాంకేతిక పుస్తకాల వరకు ఇక్కడ దొరుకుతాయి. కొత్త తరంలోకి పుస్తకాన్ని తీసుకెళ్లడానికి, విభిన్న భాషల్లో, విభిన్న అంశాల్లో వచ్చినటువంటి వాదాలు, వివిధ సంఘర్షణలు, జాతీయ పోరాటాల దగ్గర నుంచి ఆత్మగౌరవ పోరాటాల వరకు రాసిన పుస్తకాలన్నీ స్టాల్స్‌లో లభ్యమౌతాయి. మహిళలకు సంబంధించినవి అన్ని రకాల పుస్తకాలతోపాటు స్త్రీవాదం, దళితవాదం, బహుజనవాదం, మైనార్టీవాదాలు, మార్కిజం, లెనినిజం, మావో ఆలోచనావిధానానికి సంబంధించినవి ఇలా అన్నిరకాలు లభిస్తాయి. జ్యోతిషం, వాస్తు, భక్తి రక్తి ముక్తి ఇలా అన్నిరకాలుంటాయి. వ్యక్తిత్వం రూపుదిద్దుకోవడానికి, సన్మార్గంలో నడవడానికి దోహదపడేది పుస్తకం. దేశాన్ని నిలబెట్టే ఆయుధం పుస్తకం. జ్ఞాన సముపార్జనకు పుస్తకాలే శరణ్యం. పుస్తకాలు చదవడాన్ని ఉద్యమంగా అలవర్చుకోవాలి. మహనీయులు కారులో ప్రయాణం చేసినా, చెరసాలలో ఉన్నా పుస్తకాలే చదివేవారు. పుస్తకాలకు కళ్లుంటాయి. అవి ప్రపంచాన్ని చూపిస్తాయి. ప్రగతిపథంవైపు నడిపిస్తాయి. మనల్ని విజ్ఞాన సింహాసనంపైకి ఎక్కిస్తాయి. ప్రపంచంలోని అనేక మంది వ్యక్తులు మంచి పుస్తకాలు చదివి మహోన్నతులయ్యారు. అధ్యయనం ఒక్కటే మనిషిని తీర్చిదిద్దుతుంది.

                                                               ఈ నెల 18 నుంచి 28 వరకు తెలంగాణ కళాభారతిలో బుక్‌ఫెయిర్

                                                                                                మల్లీశ్వరి వారణాసి