Home ఆఫ్ బీట్ మహిళకు బ్రెస్ట్ క్యాన్సర్ మరణశాసనమా?

మహిళకు బ్రెస్ట్ క్యాన్సర్ మరణశాసనమా?

Breast-Cancer

ఒకప్పుడు క్యాన్సర్ అనే పదం సినిమాల్లో వినిపించేది. బాగా డబ్బున్న వాళ్లకు మాత్రమే వచ్చే జబ్బు అనుకునేవారు. రోజులు మారాయి. మామూలు మహిళలు కూడా బ్రెస్ట్ క్యాన్సర్ బారినపడుతున్నారు. ముందుగానే గుర్తిస్తే నయం చేసుకోవడం సులభం. సమస్యంతా తమకు రొమ్ము క్యాన్సర్ ఉందన్న విషయం లాస్ట్ స్టేజ్‌లో గానీ గుర్తించలేకపోవడం. ఒక్కోసారి ఎలాంటి లక్షణాలూ కనిపించకుండానే ఇది శరీరాన్ని ఆక్రమిస్తుంది. అందుకే ఎలాంటి లక్షణాలు లేకున్నా, ఆరోగ్యంగా ఉన్నా ఒంట్లో క్యాన్సర్ ఉందో లేదో తెలుసుకోవడానికి అప్పుడప్పుడూ స్క్రీనింగ్ టెస్టులు చేయించుకుంటూ ఉండాలి.  మహిళకు బ్రెస్ట్ క్యాన్సర్ మరణశాసనం కారాదు.

రొమ్ము క్యాన్సర్ అనగానే గతంలో ఒక రకమైన ఆందోళన ఉండేది. అయితే ఇప్పుడు రొమ్ము కేన్సర్ ఏ దశలోనైనా దాదాపు అందరిలోనూ పూర్తిగా తగ్గుతుందని తెలిశాక మరోరకం ఆందోళన మహిళలను వేధిస్తోంది. అదే రొమ్మును తొలగించాల్సి వస్తుందేమోనన్న ఆందోళన.కానీ ఇప్పటి ఆధునిక చికిత్సలతో చాలా వరకు రొమ్మును తొలగించాల్సిన ( మాస్టెక్టమీ) అవసరం ఉండదు.  

అక్టోబర్: బ్రెస్ట్ క్యాన్సర్  అవేర్‌నెస్ మన్త్ 

మహిళల్లో వచ్చే రొమ్ము క్యాన్సర్ విషయంలో వయసుకూ, వ్యాధికీ దగ్గరి సంబంధం ఉంది. అంటే వయసు పైబడుతున్నకొద్దీ వ్యాధి వచ్చే అవకాశాలు అంతగా పెరుగుతుంటాయని క్యాన్సర్ నిపుణులు చెబుతున్నారు. కుటుంబ చరిత్రలో ఈ వ్యాధి వచ్చినవారు, పిల్లలు లేనివారు, 30ఏళ్లు దాటాక మొదటి బిడ్డను కన్న మహిళలు వీరంతా రొమ్ము క్యాన్సర్‌కు రిస్క్ గ్రూపుగా చెప్పవచ్చు. ఈ రిస్క్ గ్రూపులు మూడు రకాలైన పరీక్షలు చేయించుకోవాలి. అందులో మొదటిది ఎవరికి వారే చేసుకునే రొమ్ము పరీక్ష. ప్రతి మహిళా తమ రుతుక్రమం ముగిసిన వారం తర్వాత ఎడమ రొమ్మును కుడిచేత్తో, కుడి రొమ్మును ఎడం చేత్తో తాకుతూ పరీక్ష చేసుకోవాలి. ఫలితంగా రొమ్ములో ఏ చిన్న మార్పు వచ్చినా డాక్టర్ కంటే ముందుగా తమకే అర్థమౌతుంది. రొమ్ములో తేడా ఏమైనా ఉంటే దాన్ని గైనకాలజిస్ట్ దృష్టికి తీసుకెళ్తే, అదేమైనా ప్రమాదకారా లేక మామూలు గడ్డా అన్నది చెబుతారు. మమోగ్రఫీ అనే మరో పరీక్షతోనూ రొమ్ము క్యాన్సర్‌ను తేలిగ్గా గుర్తించవచ్చు.

మమోగ్రఫీ ఎవరెవరు చేయించుకోవాలంటే…

Cancer Disease Spread in India

30 ఏళ్లప్పుడు ఓసారి మమోగ్రామ్ చేయించాలి. -ఆ తర్వాత 35 ఏళ్లప్పుడు ఒకసారి, 40 ఏళ్లప్పుడు మరోసారి చేయించాలి. 40 ఏళ్లు దాటాక 50 వ ఏటి వరకూ ప్రతి రెండేళ్లకోసారి చొప్పున చేయించుకోవాలి. -50 ఏళ్లు వచ్చాక ఏడాదికోమారు చేయించుకుంటే మంచిది.- ఎక్కువ రిస్క్ ఉన్నవాళ్లకు డాక్టర్ సలహా మేరకు ఇంకా ముందుగానే ఈ పరీక్ష అవసరం కావచ్చును.

కొందరిలో ఈ వ్యాధి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ అని వైద్యులు అనుకుంటే, ఒక చిన్న రక్త పరీక్ష ద్వారా దాన్ని కనుక్కోవచ్చు. జన్యు పరీక్షల ద్వారా బీఆర్‌సీఏ1, బీఆర్‌సీఏ 2 అనే జీన్ మ్యూటేషన్స్ ఉన్నాయా లేవా అనే దాన్ని బట్టి వాళ్లకు రొమ్ము క్యాన్సర్ వచ్చేదీ రానిదీ తెలుసుకోవచ్చు. గతంలో ప్రపంచవ్యాప్తంగా గుర్తించిన ప్రతి 5గురు క్యాన్సర్ పేషెంట్లలో ఒకరు భారతీయులు. కానీ ఇటీవల ప్రతి నలుగురిలో ఒకరుగా ఉంటున్నారు. క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించి, అరికట్టగల విషయంలో భారత్‌దే అగ్రస్థానం. కానీ దురదృష్టకరమైన విషయం ఏమంటే దీన్ని ముందుగా గుర్తించలేకపోవడం.

తప్పెవరిది.. రొమ్యు క్యాన్సర్ పట్టణ ప్రాంతాల్లో చాలా ఎక్కువగా విస్తరిస్తోంది. ఇప్పుడు చాలా మంది యువతులు కెరీర్ కోసం అంటూ చాలాకాలంపాటు వివాహాలు చేసుకోవడం లేదు. 30ఏళ్లు దాటితేగానీ గర్భధారణకు ప్లాన్ చేసుకోవడం లేదు. అందం చెడుతుందనే అపోహతో పాపాయిలకు పాలు పట్టడం లేదు. సమయానికి తినడం లేదు. మంచి పోషకాహారం తీసుకోవడం లేదు. కాలుష్యాలకు దూరంగా ఉండటం లేదు. ఇలాంటి ఎన్నో అంశాలన్నీ కలగలిసి రొమ్ముక్యాన్సర్ రావడానికి కారణాలుగా మారుతున్నాయి.

క్యాన్సర్ పెంపొందించే కారణాలివే…

Breast-Cancer

వయసు పెరుగుతున్న కొద్దీ రొమ్ము కేన్సర్ వచ్చే అవకాశాలు పెరుగు తాయి. దగ్గరి బంధువులైన అమ్మ, అమ్మమ్మ, అక్కచెల్లెళ్లు, మేనత్తలలో ఈ కేన్సర్ ఉంటే వీరికి వచ్చే అవకాశా లెక్కువ. కుటుంబంలో ఎవరికైనా రెండు రొమ్ములకూ కేన్సర్ వచ్చినప్పుడు కూడా దగ్గరివారికి వచ్చే అవకాశం ఉంటుంది. ఇంట్లో ఎవరైనా పురుషులకు రొమ్ము క్యాన్సర్ వచ్చిన దాఖలాలు ఉన్నా ఆ ఇంట్లో వారికి ముప్పు ఎక్కువే. స్థూలకాయం, తక్కువ శారీరక శ్రమ చేయడం కూడా ప్రమాదం తెచ్చేవే. చిన్న వయసులోనే రుతుక్రమం మొదలై పెద్ద వయసులో చాలా ఆలస్యంగా మెనోపాజ్ ఆగడం, రుతుక్రమం ఆగిపోయి హార్మోన్ రీప్లేస్‌మెంట్ చికిత్స తీసుకుంటూ ఉండటం కూడా ప్రమాదమే. రాత్రుళ్లు నిద్రలేకుండా పనిచేయడం, పొగతాగడం, మద్యం వంటి దురలవాట్లూ కారణాలే.

రొమ్ము క్యాన్సర్ లక్షణాలు

రొమ్ము క్యాన్సర్‌కు సంబంధించిన లక్షణాలను మూడుగా విభజించుకోవాలి. వాటిని ప్రతిసారీ గమనిస్తూ ఉండాలి. ఏదైనా తేడా అనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. రొమ్ముకు సంబంధించినవి రొమ్ములో ఒక గడ్డలా కదులుతూ రొమ్ముపైనున్న చర్మం నుంచి అది స్పర్శకు తగలడం. రొమ్ము ఆకృతిలో మార్పులు, రొమ్ము పై మానని పుండు, సొట్టలు కనిపించడం, చర్మం మందంగా మారడం.నిపుల్‌కు సంబంధించినవి రొమ్ముపై దద్దుర్లు వంటివి లేదా పుండ్లు పడటం, రొమ్ము నిపుల్ లోపలికి ముడుచుకుపోయినట్లుగా ఉండటం, నిపుల్ నుంచి కొన్ని స్రావాలు వస్తుండటం, చంకల్లో గడ్డలు పెరగడం దాని స్పర్శ తెలియడం.

సొంతంగా పరీక్షించుకోవచ్చు…

20 ఏళ్లు నిండిన ప్రతి యువతీ నెలకోసారి ఈ పరీక్ష చేసుకోవాలి. ఇదెంతో సులభం. ఏవైనా లక్షణాలుంటే ముందే పసిగట్టవచ్చు. చికిత్సను తేలిక చేస్తుంది. ఖర్చు తగ్గిస్తుంది. వెరసి ప్రాణాలు కాపాడుతుంది. అవేంటో చూద్దాం…

* రొమ్ముల పైభాగం, కింది భాగం ఇలా చుట్టూరా చూసుకోవాలి. చంకల కింద కూడా నొక్కి చూడాలి. ఏవైనా గడ్డల్లా కనిపించాయా, చేతికి తగులుతున్నాయా గమనించుకోవాలి. స్నానం సమయంలో సబ్సు రాసుకున్నప్పుడు రొమ్ము టెండర్‌గా మారి రొమ్ములోని మార్పు ఎంత చిన్నదైనా తేలిగ్గా తెలుస్తుంది. ఎడమ అరచేత్తో కుడి రొమ్మునూ, కుడి అరచేత్తో ఎడమ రొమ్మును పరీక్షించుకుంటే రొమ్మును పూర్తిగా గమనించవచ్చు.

CANCER1

* అద్దం ముందు నిలబడి చేతులను తల వెనకకు పెట్టి బ్రెస్ట్ ఆకారాన్ని గమనించాలి.

* చేతులను నడుము మీద పెట్టి భుజాలను లోపలికి కుదించి మోచేతులను దేహం ముందు వైపునకు తీసుకురావాలి. ఇలా చేస్తున్నప్పుడు రొమ్ములు కదులుతాయి. ఆ కదలికలను బట్టి కండరాల్లో మార్పులు ఉన్నాయేమో గమనించుకోవాలి.

* నిపుల్స్ మెల్లగా నొక్కినపుడు పాలలాగ లేదా నీటిలాగా లేదా బ్రౌన్ రంగు, రక్తవర్ణంలో ఏదైనా ద్రవం విడుదలవుతుందేమో చూడాలి.

* రొమ్ములలో వాపును గమనించినా, చర్మం మీద దురద పెడుతున్నా, బుడిపెలాంటిది ఏర్పడినా, నిపిల్స్‌లో నొప్పి, ఎరుపుదనం, లోపలికి ముడుచుకుపోవడం వంటి లక్షణాలను గమనించినా అశ్రద్ధ చేయకూడదు.

* ఈ పరీక్షలను రుతుక్రమం పూర్తయిన ఏడో రోజున చేసుకుంటే మంచిది. ఎందుకంటే పీరియడ్స్ మొదలయ్యే సమయంలో సాధారణంగానే రొమ్ములలో చిన్నపాటి గడ్డలు ఏర్పడుతుంటాయి. ఇవి రుతుక్రమం మొదలైన మూడు, నాలుగు రోజుల్లో కరిగిపోతాయి. ఆ తర్వాత కూడా ఏదైనా లంప్ తలిగితే అది బ్రెస్ట్ క్యాన్సర్‌కు సూచిక అయి ఉండవచ్చనే సందేహంతో డాక్టర్‌ను సంప్రదించి నిర్ధారణ చేసుకోవాలి.

రొమ్ము కోల్పోతామేమో అనే ఆందోళన వద్దు

cancer

రొమ్ము క్యాన్సర్ అనగానే గతంలో ఒక రకమైన ఆందోళన ఉండేది. అయితే ఇప్పుడు రొమ్ము క్యాన్సర్ ఏ దశలోనైనా దాదాపు అందరిలోనూ పూర్తిగా తగ్గుతుందని తెలిశాక మరోరకం ఆందోళన మహిళలను వేధిస్తోంది. అదే రొమ్మును తొలగించాల్సి వస్తుందేమోనన్న ఆందోళన.కానీ ఇప్పటి ఆధునిక చికిత్సలతో చాలా వరకు రొమ్మును తొలగించాల్సిన ( మాస్టెక్టమీ) అవసరం ఉండదు. పైగా సంప్రదాయక క్యాన్సర్ శస్త్రచికిత్సతో, ఆధునిక ప్లాస్టిక్ సర్జరీని మేళవించి రూపొందించిన శస్త్రచికిత్సలతో ఒక వేళ రొమ్మును తొలగించాల్సి వచ్చినా ‘ఆంకో ప్లాస్టిక్ సర్జరీ’ తో రొమ్మును పూర్తిగా పునర్నిర్మించడం సాధ్యమే. అందుకే ఇప్పుడు మహిళలు తాము స్త్రీత్వానికి సంపూర్ణమైన ప్రతీకగా భావించే రొమ్మును కోల్పోతామేమో అని ఆందోళన పడాల్సిన అవసరం లేదు.

ఆంకో ప్లాస్టిక్ సర్జరీ అంటే…

అటు ఆంకాలజీ తాలుకు సర్జరీనీ, ఇటు ప్లాస్టిక్ సర్జరీని కలగలపిన అత్యాధునిక శస్త్రచికిత్స ప్రక్రియ ఆంకో ప్లాస్టిక్ సర్జరీ. గతంలో రొమ్ము క్యాన్సర్ వచ్చినప్పుడు వ్యాధిగ్రస్తమైన రొమ్ము భాగాన్ని తీసేసేవారు. దాంతో వ్యాధి తగ్గినా ఒకవైపు రొమ్ము లేకపోవడం అన్న విషయం మహిళలను న్యూనతకు గురిచేసేది.  కానీ ఇప్పుడు పెరిగిన శస్త్రచికిత్స సునిశితత్వపు నైపుణ్యంతో వ్యాధిగ్రస్తమైన ట్యూమర్ చుట్టూతా 5 మి.మీ తొలగిస్తే చాలు. ఇక వ్యాధి నుంచి పూర్తిగా విముక్తులైనట్లే! అప్పుడు ఇలా తొలగించిన భాగంలో అంటే ఆ సొట్ట పడ్డచోట ఇతర భాగాల్లోంచి ప్రధానంగా (భుజం కింది భాగాన్నుంచి) కండరాన్ని తీసుకుని అక్కడ భర్తీ చేస్తారు. ఇటీవల స్టెమ్‌సెల్స్‌తో ఖాళీని పూరించే విధానాలూ అందుబాటులోకి వచ్చాయి. ఆధునిక విధానాలతో చికిత్స తర్వాత రెండు రొమ్ములనూ ఒకే ఆకృతిలోనూ, ఒకే పరిమాణంలోనూ ఉండేలా కూడా చూడవచ్చు.

రొమ్ము క్యాన్సర్ కొన్ని వాస్తవాలు

నిజానికి వయసు ఒక రిస్క్ ఫ్యాక్టరే అయినా కొన్ని సార్లు పెద్దవారు కాని వాళ్లలో కూడా రొమ్ముక్యాన్సర్ కనిపించవచ్చు.
రొమ్ములో దాదాపు 80 శాతం గడ్డలు హానికరం కానివే. అయితే వయసు మీరుతున్న కొద్దీ ఈ శాతం సంఖ్య మారుతుంది. సాధారణంగా నిపిల్‌లో కనిపించే స్రావాలన్నీ క్యాన్సర్‌కు సూచిక కాదు. చాలా మంది మహిళల్లో దాదాపు 60 శాతం మందిలో ఇది కనిపిస్తుంది. ఆ స్రావాలు పాలలా, కాస్తంత పసుపు రంగు లేదా ఆకుపచ్చ రంగులో కనిపిస్తుంటే అది ప్రమాదకరం కాదు. అయితే బ్రౌన్ రంగు లేదా ఎరుపు రంగులో ఉంటే మాత్రం డాక్టర్‌ను సంప్రదించాలి. -మమోగ్రామ్ వల్ల క్యాన్సర్ ముందుగా తెలుసుకోవచ్చు గానీ దాని వల్ల క్యాన్సర్‌ను నివారించలేం. మమోగ్రామ్ అన్నది పూర్తిగా సురక్షితమైన ప్రక్రియ. అందలో కొంత రేడియోషన్ వెలువడే అవకాశాలున్నా. ఆధునిక మమోగ్రామ్ ప్రక్రియలో ఉపయోగించే రేడియేషన్ ఏ మాత్రం హానికరం కాని మోతాదుల్లోనే ఉంటుంది. అయితే అది నూరు శాతం కనిపెట్టకపోవచ్చు. వయసును పరిగణలోకి తీసుకుంటే 80 శాతం మందిలో మమోగ్రామ్ క్యాన్సర్‌ను పసిగడుతుందనుకోవచ్చు.
గడ్డలా కనిపించడం రొమ్ము క్యాన్సర్ కనిపెట్టడానికి ఒక సూచిక. అయితే అది గడ్డలా చేతికి అందకముందు కూడా పరీక్షించిన సందర్భాల్లో క్యాన్సర్ ఉండి ఉండవచ్చు.-

ఎలాంటి చికిత్సలు అవసరమంటే…

సంప్రదాయిక క్యాన్సర్ చికిత్స ప్రక్రియల్లో శస్త్రచికిత్స, కీమో థెరపీ, రేడియేషన్ థెరపీ ఉంటాయన్న విషయం తెలిసిందే. అవసరాన్ని బట్టి డాక్టర్లు ఏ ప్రక్రియను ముందుగా చేయాలో ఏయే కాంబినేషన్లలో చేయాలో నిర్ణయిస్తారు. ఇప్పుడు శస్త్రచికిత్సతో పాటు కీమోథెరపీ, రేడియోషన్ చికిత్సల్లో చాలా అధునాతన ప్రక్రియలు అందుబాటులోకి వచ్చాయి.
కీమో థెరపీ ఇందులో ఎన్నో కొత్త మందులు అందుబాటులోకి రావడంతో ఇదివరకటిలాగా శరీరం మీద వాటి దుష్ప్రభావాల తీవ్రత బాగా తగ్గిపోయింది. ఒకసారి కీమో ఇచ్చాక కూడా క్యాన్సర్ మళ్లీ వస్తే గతంలో అయితే ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి. కానీ ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన కొత్త కొత్త మాలిక్యూల్స్ వల్ల, నోటి ద్వారా తీసుకునే ఓరల్ కీమోథెరపీ మందుల వల్ల జీవిత కాలన్ని గణనీయంగా పొడగించే అవకాశాలున్నాయి.

రేడియేషన్ థెరపీ ఒకప్పుడు వ్యాధికి గురైన రొమ్ము భాగానికి రేడియేషన్ ఇస్తే, దాంతో పాటు శ్వాసకోశ వ్యవస్థ, గుండె కూడా దుష్ప్రభావానికి లోనయ్యేవి. కానీ ఇప్పుడు నూతన రేడియేషన్ విధానాలు అందుబాటులోకి వచ్చాయి. ఐఎమ్‌ఆర్‌టీ (ఇంటెన్సివ్ మాడ్యులేటెడ్ రేడియో థెరపీ), ఐజీఆర్‌టీ (ఇమేజ్ గైడెడ్ రేడియో థెరపీ) లతో వి మ్యాట్ సాంకేతికత సహాయంతో రేడియేషన్ ఇస్తే , రోగగ్రస్తమైన భాగానికి చాలా వేగంగా రేడియేషన్ అందించడం ఇప్పుడు సాధ్యమవుతోంది. పైగా దీనివల్ల ఆ పొరుగున ఉండే సాధారణ కణజాలానికి ఏ మాత్రం హాని కలగదు.  ఇటీవల అందుబాటులోకి వచ్చిన పార్షియల్ బ్రెస్ట్ రేడియేషన్ అనే విధానం ద్వారా మొత్తం రొమ్ముకు కాకుండా కణితి ఉన్న చోటే రేడియేషన్ ఇవ్వడం ఈ ప్రక్రియ ప్రత్యేకత.

ఇప్పుడు ఇంట్రా ఆపరేటివ్ రేడియో థెరపీ ప్రక్రియల ద్వారా సర్జరీ చేస్తున్నప్పుడే రేడియేషన్ ఇవ్వడమూ ఒక సారి పూర్తయ్యేలాగా చికిత్స అందుబాటులో ఉన్నాయి. సైబర్‌నైఫ్ సహాయంతో చేసే పార్షియల్ రేడియేషన్‌తో ఒక్క రోజులో చికిత్స పూర్తవుతుంది.

ఇవేగాక హార్మోన్ థెరపీ, మోనోక్లోనల్ యాంటీబాడిస్ వంటి అధునాతనమైన ప్రక్రియలు అందుబాటులోకి వస్తున్నాయి. దాంతో ఇప్పుడు అన్ని రకాల రొమ్ము క్యాన్సర్లకు దాదాపుగా పూర్తి చికిత్స సాధ్యమేనని చెప్పవచ్చు.చాలా సందర్భాలల్లో చికిత్సతో ఎంతటి రొమ్ము క్యాన్సర్ అయినా తగ్గేందుకు అవకాశాలెక్కువగా కన్పిస్తున్నాయి.

క్యాన్సర్‌ను జయించొచ్చు.. బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడ్డ సినీ నటి గౌతమి, మనీషా కొయిరాలా, మమతా మోహన్‌దాస్‌లు క్యాన్సర్ ను ఆత్మస్థైర్యంతో జయించారు. తిరిగి సినిమాల్లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన సందర్భాలున్నాయి. కనుక క్యాన్సర్ ఉన్నట్లు తెలిసినప్పుడు, కుంగిపోకుండా ధైర్యంగా చికిత్స చేయించుకుంటే తిరిగి మంచి జీవితాన్ని ఆస్వాదించే అవకాశం ఉంటుంది.

క్యాన్సర్‌కు దూరంగా ఉంచే ఆహారం…

వెల్లుల్లి: వెల్లుల్లి ముక్కలను పచ్చిగా, పొడిచేసుకుని తినాలి. ఇది మంచి యాంటీ కాన్సర్ కారకంలా పని చేస్తుంది.
బ్రకోలి:: ట్యూమర్ కణాలను హతమార్చగల శక్తివంతమైనది.
బీన్స్:రొమ్ము కాన్సర్‌ను సమర్థవంతంగా తట్టుకుని, వ్యాధిని నిర్మూలించడానికి బీన్స్ చక్కగా పనిచేస్తాయి.
సోయాబీన్స్‌లో ఉండే ఐసోఫ్లావోన్స్ ట్యూమర్ ఎదుగుదలను నిరోధించగలదు.
గోధుమ పిండి: ఈ పిండితో తయారైన పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. గోధుమ పిండి గుండెకు కూడా మంచిది.
ద్రాక్ష: క్యాన్సర్‌ను సమర్థవంతంగా నిర్మూలించడంలో ద్రాక్ష ఎంతగానో ఉపకరిస్తుంది.
గ్రీన్ టీ: హర్బల్ గ్రీన్ టీ వల్ల తరచుగా సేవిండటం వల్ల యాంటీ ఇన్‌ఫ్లామెటరీ కారకంగా పని చేస్తుంది.
డ్రై ఫ్రూట్స్: జీడిపప్పు, స్ట్రాబెర్రీలు, ఫ్లాక్స్ సీడ్స్, పొద్దుతిరుగుడు పువ్వు విత్తులు, పీనట్స్ వంటివి కాన్సర్ ప్రభావాన్ని క్రమంగా తగ్గిస్తాయి.
దానిమ్మ: క్యాన్సర్ తో పోరాడుతుంది. గుండెకు కూడా మేలు చేస్తుంది. దానిమ్మలో ఉండే ఫోలిఫినాయిల్స్ బ్రెస్ట్ క్యాన్సర్ తో పోరాడే గుణాలు పుష్కలంగా ఉన్నాయి.
ఆకు కూరలు : వీటిల్లో ఫొల్లెట్, విటమిన్ బి, ఫైబర్ తో పాటు ఐరన్, జింక్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఈస్ట్రోజెన్ ఉత్పత్తిని తగ్గిస్తాయి. దాంతో పాటు బ్రెస్ట్ క్యాన్సర్ సెల్స్ ను కూడా తగ్గిస్తాయి.
సాల్మన్: సాల్మన్ చేపల్లో బ్రెస్ట్ క్యాన్సర్ ప్రాపర్టీస్ అధికంగా ఉంటాయి. సాల్మన్ లో ఉండే ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ బ్రెస్ట్ క్యాన్సర్ సెల్స్ పెరుగుదలను తగ్గిస్తాయి.
మష్రుమ్: పుట్టగొడుగుల్లో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలం ఎల్ ఈస్ట్రోజెన్ ఇది క్యాన్సర్ బారిన పడకుండా , క్యాన్సర్ శరీరంలో వ్యాప్తి చెందకుండా ఆరోగ్యాన్ని కాపాడుతాయి.
బ్రొకోలీ మొలకలు: ఇది మరో బ్రెస్ట్ క్యాన్సర్ ఫైటింగ్ ఫుడ్. ఇందులో పుష్కలమైన యాంటీఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇందులో ఉండే సల్ఫోరఫేన్ సెల్స్ క్యాన్సర్ సెల్స్ ను పారద్రోలతాయి.
పాల ఉత్పత్తులు: మహిళల డైట్ లో పాలఉత్పత్తులను చేర్చడం చాలా ముఖ్యం. ఇందులో క్యాల్షియం, ఐరన్, ఆరోగ్యానికి కావాల్సిన ఎసెన్షియల్ న్యూట్రీషియన్స్ పుష్కలంగా ఉంటాయి .

Breast Cancer Awareness Month

Telangana news