Home లైఫ్ స్టైల్ బతికి బయటపడ్డ గోయల్ మగవాళ్ళలో బ్రెస్ట్ క్యాన్సర్

బతికి బయటపడ్డ గోయల్ మగవాళ్ళలో బ్రెస్ట్ క్యాన్సర్

cancer

మగవాళ్ళలోనూ బ్రెస్ట్‌క్యాన్సర్ వస్తుందా? అంటే వస్తుందనే అంటున్నారు డాక్టర్లు. అందుకు తాజాగా ఢిల్లీకి చెందిన సంజయ్‌గోయెల్‌ను ఉదాహరణగా చూపిస్తున్నారు. గోయెల్ టెలికాం డిపార్ట్‌మెంట్‌లో ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. వయసు 45 సంవత్సరాలు. టీనేజ్ నుంచే ఆయనకు ఒక రొమ్ము ఎత్తుగా ఉండేది. ఎందుకిలా పెరుగుతోంది అసహ్యంగా అనుకునేవాడు. వీడు మగాడు కాడని, గడ్డాలు మీసాలు పెరిగిన ఆడవాడని అవహేళన చేసేవారు. అసలు ఆడామగా కాని బాపతు అనేవారు. ఏమైందో అర్థంకాదు. ఎవరికి చూపించుకోవాలో తెలిసేదికాదు.
ఈ పరిస్థితి ఒక పక్కనే ఉండేది. రెండోవైపు బాగానే ఉండడంతో విషయం అర్థంకాక గందరగోళపడేవాడు. దానికి తగ్గేట్టే 24వ యేట నుంచి పెరుగుతున్న రొమ్మునుంచి రసికారడం మొదలైంది.
లోపలి బనీను, పై చొక్కా కూడా తడిగా అయిపోతుండడంతో హేళన చేశారు జనం. అవమానాలు భరించలేక బైటికి రావడం మానుకున్నాడు. 30యేళ్ళు వచ్చేసరికి రొమ్ము మరింతగా ఉబ్బి రక్తం కారడం మొదలైంది. దాంతో కంగారు మరింత ఎక్కువైంది. సిగ్గుపడుతూ కూచుంటే మొదటికే మోసం వచ్చేలా ఉందని డాక్టర్ దగ్గరకు పరిగెత్తాడు. గోయెల్ కంగారు చూసి డాక్టర్ నవ్వేశాడు. నువ్వేమైనా ఆడపిల్లవటయ్యా రొమ్ముక్యాన్సర్ రావడానికి అని కామెంట్ కూడా చేశాడు. తగ్గిపోతుందిలే బాధపడకు..అని కొన్ని యాంటీబయోటిక్ మందులు ఇచ్చాడు. అవి వాడాక రొమ్ము నుంచి రసికారడం ఆగింది. ‘చూశావా..అనవసరంగా భయపడ్డావ్! ఏమైనా మంచిపనే చేశావులే! మళ్ళీ ఏమైనా అనిపిస్తే మొహమాటపడకుండా రా..’ అని చెప్పాడు డాక్టర్. కానీ ఆయన హెచ్చరించినట్టు ఏమీ కాలేదు. అమ్మయ్య తగ్గిపోయిందని ధైర్యంగా నిద్రపోవడం మొదలుపెట్టాడు గోయెల్. అలా కొన్ని నెలలు గడిచిందోలేదో సమస్య తిరగబడింది.
మళ్ళీ రసికారడం నొప్పిలేవడం మొదలైంది. గోయెల్ డాక్డర్ దగ్గరకు పరిగెత్తాడు. ‘ఏంకాదు..ఆ పాత మందుల్నే రిపీట్ చేయండి’ అని అవే మందులు రాసిచ్చాడు. అలాగే చేశాడు. ఈసారి రోగలక్షణాలు తగ్గకపోగా మరింత ముదిరాయి. నొప్పి భరించరానిదిగా తయారైంది. దాంతో డాక్టర్ మీద నమ్మకం పోయిన గోయెల్ డాక్టర్‌ను మార్చి మరొకరిని కన్సల్ట్ చేశాడు. ఫైన్ నీడిల్ ఆస్పిరేషన్ సైటాలజీ పరీక్ష చేయించాడు. సూది పరీక్షలో గోయెల్‌కు క్యాన్సర్ అని తేలింది. బయాప్సీ చేయించారు. అది కూడా క్యాన్సర్ అనే తేల్చింది. టైప్2 అని నిర్ధారించారు. అది వేగంగా వ్యాపిస్తోందని తేల్చారు. ఆ మాట వినగానే కాళ్ళకింద భూమి అదిరినట్లయింది.
‘నాకు మతిపోయింది. నాకే దురలవాటూలేదు. మందుకొట్టను. మాంసం ముట్టను. పాన్‌లు, గుట్కాలు వేయను. పైగా రోజూ యోగాచేస్తా.. అయినా నాకెలా వచ్చింది?’ అని తలపగులకొట్టుకున్నాను. క్యాన్సర్ వస్తే మనిషి బతకడనే నా నమ్మకం. ఎందరో బంధువులు, మిత్రులు క్యాన్సర్ బారిన పడితే వాళ్ళను చూడడానికి కూడా వెళేవాణ్ణికాను. వెళ్తే నాకెక్కడ తగులుతుందో అని భయం. అందుకే వాళ్ళవైపు కన్నెత్తి కూడా చూసేవాణ్ణి కాను.
నాకు క్యాన్సర్ అని తేలగానే మా ఆవిడ కొయ్యబారిపోయింది. నా పై ప్రాణాలు పైకే ఎగిరిపోయాయి. నా వాళ్ళు అనుకున్నవాళ్ళు పరామర్శించాలని వెంపర్లాడిపోయాను. వాళ్ళ మాటలతోనైనా ఓదార్పు పొందాలనుకున్నాను. కానీ ఎవ్వరూ వచ్చేవారు కారు. క్యాన్సర్ వచ్చిందన్న ఆందోళనకన్నా అందరూ సంఘ బహిష్కరణ చేసినట్టుగా నావైపు రాకపోవడం నన్ను అమితంగా బాధించింది. మా ఆవిడ తీవ్రమైన డిప్రెషన్‌లో కూరుకుపోయింది” అని చెప్పాడు గోయెల్! క్యాన్సర్ అని ధ్రువపడ్డాక డాక్టర్లు ఒక్క రోజు కూడా ఆలస్యం చేయకుండా ఆపరేషన్ చేశారు. కీమోథెరపి, రేడియోథెరపి, హార్మోన్ థెరపీ చేశారు. హార్మోన్ థెరపీ ఇంకా కొనసాగుతోంది.
‘ఇది వరకు క్యాన్సర్ ట్రీట్‌మెంట్ అంటే ఎంతో భయపడ్డాను. చచ్చిపోతాననే అనుకున్నాను.
ఒక వేళ ప్రాణాలతో బైటపడినా క్వాలిటీ లైఫ్ మటుమాయమైపోతుందని, మంచానికే పరిమితమైపోయే జీవితమే ఉంటుదని అనుకున్నాను. కానీ నా భయాలు తప్పని తేలిపోయింది. నేను మందులువాడుకుంటూ బాగానే ఉన్నాను. ఇదివరకటిలాగే నా పనులు నేను చేసుకో గలుగుతున్నాను. ప్రయాణాలు చేస్తున్నాను. యోగా చేసుకోగలుగుతున్నాను. నేను మా ఆవిడ, మా పాప అన్యోన్యంగా ఉంటున్నాం క్యాన్సర్ తర్వాత ఇలాంటి జీవితాన్ని అనుభవిస్తానని కలలో కూడా అనుకోలేదు’ అని చెప్పాడు గోయెల్.