Home ఎడిటోరియల్ పందుల పెంపకాన్ని వ్యవసాయంగా గుర్తించాలి

పందుల పెంపకాన్ని వ్యవసాయంగా గుర్తించాలి

Breeding-Pigs

చిన్న రాష్ట్రాలు ఏర్పాటైతే, అభివృద్ధి వేగవంతమై అట్టడుగు స్థాయి సమూహాలకు అభివృద్ధి ఫలాలు అందుతాయి అని, ఉద్యమాలు చేసి, తెలంగాణ రాష్ట్రం సాధించుకుని, ఉద్యమ పార్టీకి రాజ్యాధికారం ఇచ్చి, ఫలితాల కోసం అన్ని వర్గాలతో పాటు పందులపెపకందారులైన సంచార జాతులు ఎదురుచూస్తున్న క్రమంలో ముఖ్యమంత్రి సూచనల మేరకు మార్చి 3న సచివాలయంలో పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర పందుల పెంపకందార్ల సదస్సు జరగటం శుభపరిణామం. పాడి, పాల పరిశ్రమ, గొర్రెలు,మేకలు, చేపలు, కోళ్ళు పెంపకం మాదిరిగా, పందుల పెంపకాన్ని గుర్తించినందుకు ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్రంలో పందుల పెంపకాన్ని ఎరకల, యానాది, చెంచు, డక్కల, దొంబొర, బేడ బుడిగం జంగం, మెహత్తర్, వడ్డెర, వంశరాజ్(పిచ్చికుంట్ల), మందుల, దొమ్మర, మొండిబండ, బుడబుక్కల, సిక్లిఘర్, దేవర మొదలగు ఎస్.టి కులాలు పూర్తిగా, ఇంకా కొన్ని కులాలు పాక్షికంగా పెంచుకుంటూ జీవిస్తున్నాయి. లక్ష కుటుంబాలకు దాదాపు ఐదులక్షల పైబడి పందులు ఉన్నాయి. వీరందరు సెంటు భూమిలేక, గుడిసెలు, పాలధిన్ కవర్ల కప్పుగా వున్న ఇండ్లలో, దారిద్య్రరేఖకి దిగువున నివసిస్తున్నారు.

1953లో కాకా కలేల్కర్ ఛైర్మన్‌గా జాతీయస్థాయి వెనుకబడిన తరగతుల కమీషన్ కూడా అత్యంత వెనుకబడిన కులాల వారే ఈ పందుల పెంపకం చేస్తారు. వీరికి స్థిరనివాసం లేదు. సంచారజాతులుగా పందులు, కోళ్ళు, కుక్కలు, గాడిదలతో తిరుగుతూ వుంటారు. వీరు, వీరి పిల్లలు కూడా నిరక్షరాస్యులు. భారతదేశంలో పందుల పెంపకానికి చాలా అనుకూల పరిస్థితులున్నాయి. గ్రామీణ ప్రాంతాలలో ఈ పెంపకాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. రాష్ట్రప్రభుత్వాలు ఈ కమ్యూనిటీలకు పందుల పెంపకానికి తగిన వసతులు కల్పించాల్సి ఉంటుంది. తద్వారా సంచార జీవితం మాని స్థిర నివాసం ఏర్పాటు అయ్యే అవకాశం ఉంటుంది అని సూచించారు. 1970లో అనంతరామన్ ఛైర్మన్‌గా ఉమ్మడి రాష్ట్ర బిసి కమిషన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బిసిల్లో దొమ్మరి, పిచ్చకుంట్ల, జోగుల, ఎస్టీల్లో ఎరకల మొదలగు కులాలు పందుల పెంపకం చేస్తారని, వీరంతా స్థిరనివాసం లేక సంచార జాతులుగా ఉన్నారని గుర్తించింది. విదేశాలలో మాదిరిగా పందుల పెంపకం దారుల కో-ఆపరేట్ సొసైటీలు ఏర్పాటు చేసి, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో వీటి పెంపకాన్ని, పరిశ్రమగా గుర్తించి మేలుజాతి విత్తన పందులని ఉత్పత్తి చేసి పంపిణీ చేయాలని, సబ్సిడి ధరలకి మేత సరఫరా చేయాలని, తగిన నీరు సరఫరా, వ్యాధినిరోధక చర్యలు చేపట్టి, పందిమాంసం అమ్మటానికి మార్కెట్, ఎగుమతి, దిగుమతి ఏర్పాట్లు చేయాలని సూచించింది.

కమిషన్లు సూచనలు చేసినా, ఈ పందుల పెంపకందార్లలో నిరక్ష రాస్యత, అమాయకత్వం, ఆదిమసమాజ ఆనవాళ్లు, పౌర సమాజంతో సంబంధాలు లేకపోవటం వలన ప్రభుత్వం ద్వారా లబ్దిపొందే అవగాహన ఇప్పటివరకు లేదు. పందుల పెంపకందారులు సచివాలయంలో అడుగుపెట్టి మంత్రితో మాట్లాడటం అనేది ఇదే మొదటిసారి కావచ్చు. తెలంగాణ, ప్రదేశ్ ఎరకలసంఘం 1956 నుండి ఈ పందుల పెంపకం పైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకి విజ్ఞాపన పత్రాలు ఇస్తూనే ఉంది . ఇంతవరకు గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. ఆర్థిక సహాయం చేయకపోగా గత 35 సంవత్సరాలనుండి మెదడువాపు వ్యాధి పేరు చెప్పి మున్సిపల్ గ్రామ పంచాయతీ సిబ్బంది విచక్షణారహితంగా, ముందస్తు సమాచారం లేకుండా, ప్రత్యామ్నాయ మార్గాలు చూపకుండా, ఇష్టానుసారంగా పందులని చంపటం జరుగుతుంది. చిన్నకులాలు, చిన్న గుంపులు కావటం వలన వారి సాంప్రదాయ హక్కులు హరించుకు పోతున్నా, ప్రశ్నించలేక, బాధలు భరిస్తున్నారు. తమ శక్తికొలది నిరసనలు తెలిపి అధికారులకి మెమోరాండాలు ఇస్తూ, మానవ హక్కుల సంఘంలో ఫిర్యాదు చేసినారు. 1986 లో ఆంధ్రప్రదేశ్ ఆదిమజాతి సేవాసంఘం వారు విచక్షణారహితంగా పందులు చంపటాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో కేసు వేశారు. జస్టిస్ కె.భాస్కరన్, జస్టిస్ ఆంజనేయులు బెంచి విచారణ జరిపి ఈ విధంగా తీర్పు ఇచ్చారు.

1.ప్రభుత్వం స్వయంగా మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీ, గ్రామపంచాయతీలకి వారి వారి ప్రాంతాలలో పందుల పెంపకానికి తగిన స్థలాల్ని గుర్తించమని ఆదేశా లివ్వాలి. 2. మూడు లేక నాలుగు ఏరియాలు చూపించి, అందులో ఒక ఏరియా ఎంచుకునే అవకాశం పెంపకం దారులకే ఇవ్వాలి. 3. అట్టి స్థలం ప్రభుత్వ భూములు అయినచో లీజుకివ్వాలి లేదా అమ్మకానికైనా ఇవ్వాలి. 4 ఆ స్థలాలకి పందులతో పాటు కుటుంబాలు వెళ్లే ఏర్పాట్లు చేయాలి. 5. లైసెన్సులు మంజూరు చేయాలి. 6. లైసెన్సు లేబుల్స్ పదుల మెడకి తగిలించాలి. 7.తరచు పర్యవేక్షణ చేయాలి. వారిలోస్కిల్ డెవలప్ చేయాలి 8. ఈ చర్యలని రెండు వారాల్లో పూర్తి చేయాలి అని తీర్పు ఇచ్చింది. 30సంవత్సరాలు గడిచింది గత ప్రభుత్వాలకి కనువిప్పు కలగటానికి వారికి కండ్లు లేవు. అడగటానికి ఈ కులాలకి నోరు లేదు, ప్రశ్నించే తత్వం లేదు. హైకోర్టు ఇంత చక్కని తీర్పు ఇచ్చింది అంటే పందుల పెంపకందారుల బాధలని దగ్గర నుండి చూచినట్లుగా భావించాలి. ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ వివిధ వేదికల మీద పందుల పెంపకం గురించి మాట్లాడారు. పశుసంవర్థక శాఖమంత్రి సచివాలయంలో చర్చలు జరిపి బడ్జెట్‌లో గొర్రెలు, కోళ్ళు, చేపల పెపకం, చేనేత తదితర కులవృత్తుల గురించి ప్రస్తావించిన విత్తమంత్రి పందుల పెంపకం గురించి ఒక్క మాట కూడా మాట్లాడకపోవటం లక్ష కుటుంబాల వృత్తిపట్ల అశ్రద్ధ వహించినట్లుగా భావించాల్సి ఉంటుంది. ఈ విషయంలో ముఖ్యమంత్రి శ్రద్ధ వహించాలని కుటుంబాల ఆకాంక్ష.

పందిమాంసం అత్యంత పోషక విలువలు కలిగినది అని ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. ఇతర మాంసాహారం కంటే ఇది చాలారుచిగా వుంటుంది అనేది తిన్న వారికి తెలుస్తుంది. ఊరగాయ మాదిరి పచ్చడి పెట్టుకొని వారాల తరబడి నిల్వ ఉంచుకుని తినవచ్చు. ఎండబెట్టిన వట్టి తునకలు నెలల తరబడి నిల్వ వుంచుకోవచ్చు. రక్తం అవయవాలతో వండిన నల్ల(సొలాయి) చాలా రుచిగా వుంటుంది. ఈ మాంసం ద్వారాతీసే నూనె (సమురు)లో పోషక విలువలతో పాటు ఔషధ లక్షణాలున్నాయి. ఎద్దుల మెడలపై ఏర్పడిన వాపులుకు (అర్రులు), పంటల రక్షణకు ఏర్పాటు చేసే కంచెలకు, మోకాళ్ళ నొప్పులకి, ఇతర జబ్బుల నివారణకి ఉపయోగిస్తారు. ముట్టెమాంసం తినుటవలన పిల్లలు పక్క తడుపుకోవటం, ముక్కులో నుండి రక్తం కారటం ఆగిపోతాయి. వీటి వెంట్రుకలు కేజి వెయ్యినుండి రెండు వేలు ధర వుంటాయి. వీటి పేడ తోటలకి చక్కటి ఎరువు. పందిపది విధాల మేలు అనేది నానుడి, సంచార జాతుల్లో వాడుకలోవుంది. చీకపార వేసిన మామిడి టెంకలలో జీడి, సర్కారు తుమ్మచెట్ల కాయలు, మానవుడు విసర్జించిన మలినాలు స్వీకరించి పర్యావరణ రక్షణ చేస్తుంది. ఎటువంటి వాతావరణా నికైనా తట్టుకొని ఎవరికి హానిచేయని సాధుజంతువు. మనం తినగా మిగిలి పోయిన వ్యర్థాల ద్వారా లభించే కుడితి తన ఆహారంగా తీసుకుంటుంది.

పుట్టిన గున్న తన జాతిని బట్టి 6నెలలు, సంవత్సరంలోపున ఈని 5నుండి 10గున్నలు పెడుతుంది. తదుపరి ప్రతి 6 నెలలకు ఒకసారి చొప్పున దాదాపు 10 సంవత్సరాల పైబడి 20 ఈతలు ఈనుతూ 100నుండి 150 గున్నలు ఇస్తుంది. కొన్ని జాతులు సంవత్సరానికి మూడు ఈతలు ఈనుతాయి. మాంసం కేజి రూ.150 నుండి రూ.200 ధర పచ్చితూకం (లైవ్) కేజి రూ.60 నుండి రూ.90 ఉంటుంది. కేరళ, గోవా, ఢిల్లీ, కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో మాంసానికి మంచి గిరాకి ఉంది. అమెరికా దేశ ఒక రాజకీయ పార్టీ గుర్తు, కాకతీయ రాజుల జెండాపై గుర్తు, దశావతారాల్లో ఒక అవతారం, అట్టడుగు కులాల జీవిత సంపద, వెలుగు. ప్రత్యర్థులపై కసి తీర్చుకోవడానికి ఉపయోగించే పదం ఈ వరాహం. ఒక్క ఎకరం వ్యవసాయం చేస్తే ఎంత లాభం వస్తుందో అంతకన్నా పది ఇంతల లాభం పందుల పెంపకంలో వస్తుందని పందుల పెంపకం అనుభవంతో చెబుతున్నాను.

– వై.వెంకటనారాయణ, సంచారజాతుల సంఘం అధ్యక్షులు, 9640274949