Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

కరీంనగర్‌కు కంటి వెలుగు

Brihath program of the eye lights throughout the state

ఉమ్మడి జిల్లాలో 33 లక్షల 50వేల జనాభా                                                                                                          845 గ్రామాలతో సహా 283 వార్డుల్లో శిబిరాల ఏర్పాటుకు నిర్ణయం

మన తెలంగాణ/కరీంనగర్ : సమాజంలోని ముప్పై శాతానికి పైగా ప్రజలు కంటికి సంబంధించిన సమస్యలతో సతమతం అవుతుండటాన్ని దృష్టిలో ఉంచుకున్న ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కంటి వెలుగు పేరిట బృహత్ కార్యక్రమ నిర్వహణకు ముందుకు వచ్చింది. గ్రామీణ ప్రాంతాలు, పట్టణాల్లోని వార్డుల వారీగా శిబిరాలు నిర్వహించడం ద్వారా ప్రతిపౌరుడు లబ్దిపొందేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఇందులో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 33 లక్షల 50 వేల పైచిలుకు గల జనాభాకు కంటి పరీక్షలు నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను వైద్య ఆరోగ్య శాఖ సిద్దం చేసి ఉంచింది. ఇందుకు అసవరమైన వైద్య బృందాలను ఇప్పటికే గుర్తించగా, వైద్య బృందాల్లో సేవలు అందించాల్సిన ఆశావర్కర్లు, ఎఎన్‌యంలు, వైద్యులు, ఇతరులకు కంటిపరీక్షల నిర్వహణపై శిక్షణ తరగతులు నిర్వహించారు. కంటివెలుగు కార్యక్రమ అమలుపై రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్, వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖల కమీషనర్ వాకాటి కరుణ స్థానిక కలెక్టరేట్‌లో ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో శనివారం సమీక్ష జరిపిన విషయం విదితమే.

కంటిపరీక్షల శిబిరాలను నిర్వహించే పాఠశాలలు, పంచాయతీ భవనాలను అధికారులు గుర్తించి సిద్దం చేసి ఉంచారు. గ్రామీణ ప్రాంతాల్లో 250 మంది వరకు, పట్టణ ప్రాంతాల్లో 300 మంది వరకు ఒకరోజు కంటిపరీక్షలు నిర్వహించడానికి అవకాశం ఉందని భావిస్తున్న అధికారులు అందుకు అనుగుణమైన ఏర్పాట్లు చేస్తున్నారు. పరీక్షలకు వచ్చే ప్రజలు శిబిరాల వద్ద నిరీక్షించకుండా ముందుగానే వారికి పరీక్షలు నిర్వహించే సమయాన్ని తెలియజేయనున్నారు. గ్రామీణ ప్రాంతాలు, పట్టణాల్లోని వార్డుల్లో జరిగే ఈ శిబిరాల్లో సాధారణ దృష్టిలోపం ఉన్న వ్యక్తులకు అక్కడికక్కడే మందులు, అద్దాలు అందజేయనున్నారు. తీవ్ర దృష్టి లోపం ఉన్న వ్యక్తులకు వారు ఉపయోగించాల్సిన అద్దాలను తయారుచేసి ఇవ్వాల్సి ఉన్నందున తదుపరి శిబిరంలో వాటిని పంపిణీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సాధారణ కంటి చూపుకు సంబంధించి పంపిణీ చేయడానికి ఉద్దేశించిన నలభై లక్షల కళ్లజోళ్ళు అధికారులకు అందుబాటులోకి వచ్చాయి. కరీంనగర్ జిల్లాలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కలిపి 10,18,119 లక్షల జనాభా ఉండగా వీరి కోసం 204 గ్రామాలు, 90 వార్డులలో వైద్యశిబిరాలు నిర్వహించనున్నారు. ఇందుకోసం గ్రామీణ ప్రాంతాలకు 17 బృందాలను, పట్టణ ప్రాంతాలకు 5 బృందాలను కలిపి మొత్తం 22 బృందాలను కేటాయించారు.

జగిత్యాల జిల్లాలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కలిపి 9,85,417 లక్షల మంది జనాభా ఉండగా వీరి కోసం 282 గ్రామాలు 78 వార్డులు కలిపి మొత్తం 360 శిబిరాలను నిర్వహించనున్నారు. ఇందుకోసం గ్రామీణ ప్రాంతాలకు 18, పట్టణాలకు 5 కలిపి 23 బృందాలను కేటాయించారు. పెద్దపల్లి జిల్లాలో 7,95,332 లక్షల మంది జనాభాకు గాను 193 గ్రామాలు, 61 వార్డులు కలిపి 254 శిబిరాలు నిర్వహించనున్నారు. ఈ జిల్లాలో గ్రామీణ ప్రాంతాలకు 12, పట్టణాలకు 5 కలిపి 17 వైద్య బృందాలను ఏర్పాటు చేశారు. రాజన్నసిరిసిల్ల జిల్లాలో 5,52,037 లక్షల జనాభాకు గాను 166 గ్రామాలు, 54 వార్డులు కలిపి 220 శిబిరాలు నిర్వహించనున్నారు. ఈ జిల్లాలో గ్రామీణ ప్రాంతాలకు 15, పట్టణాలకు రెండు కలిపి 13 వైద్య బృందాలను ఏర్పాటు చేశారు. ఈనెల 15న ప్రారంభమయ్యే ఈ పథకం జనవరి 26 వరకు కొనసాగనున్నందున గ్రామీణ ప్రాంతాలు, పట్టణాల్లోని వార్డుల్లో నిర్వహించే శిబిరాల్లో పరీక్షలకు మిగిలిన ప్రజలెవ్వరైనా ఉంటే వారిని గుర్తించి తదుపరి శిబిరాలకు తరలించాల్సిందిగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు అదేశాలు జారీ అయ్యాయి.

ఈ శిబిరాల్లో శస్త్ర చికిత్సలు చేయించాల్సి వచ్చిన వారిని ఎంపికచేసిన ఆసుపత్రులకు తీసుకువెళ్ళడానికి అవసరమైన వాహన సదుపాయాన్ని, శస్త్ర చికిత్సల సందర్భంగా వారి బాగోగులు చూసేందుకు అవసరమైన ఏర్పాట్లను కూడా వైద్య ఆరోగ్య శాఖ చేస్తున్నది. కంటి వెలుగు కార్యక్రమ నేపథ్యంలో కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన వైద్యశాలతో పాటు పెద్దపల్లి, రాజన్నసిరిసిల్ల, జగిత్యాల జిల్లా కేంద్రాల్లోని ఏరియా ఆసుపత్రుల్లో అప్తలమిక్ విభాగాలను ప్రభుత్వం పరిపుష్టం చేసింది. ఆయా వైద్యశాలల్లో సంబంధిత విభాగంలో ఉన్న ఖాళీలను ఇటీవలే భర్తీ చేసింది. ఇదేకాకుండా కంటి వెలుగు నిర్వహణ కోసం అవసరమైతే ఖర్చు చేసేందుకు వీలుగా జిల్లా కలెక్టర్ల వద్ద నిధులను అందుబాటులో ఉంచింది.

Comments

comments