Home రాష్ట్ర వార్తలు కూలబడిలో నేల చదువు

కూలబడిలో నేల చదువు

50 ఏళ్లనాటి భవనంలో విద్యార్థుల వెతలు
బడి ఇలా ఉంటే చదువెలా అంటూ ఆందోళనలో తల్లిదండ్రులు
నిజామాబాద్ జిల్లా మద్నూర్ మండలం సుల్తాన్‌పేట పాఠశాల దౌర్భాగ్య స్థితి

Schools

కామారెడ్డి/మద్నూర్: శిథిలమైన భవనాల్లోనే బోధన కొనసాగుతోంది. అనుక్షణం పిల్లలు భయాందోళనకు లోనవుతున్నారు. తమ పిల్లలకు ఏం జరుగుతుందోనని తల్లిదండ్రులు కలవరపడుతున్నారు. 50ఏళ్లు నిండిన పాఠశాల భవనాన్ని మరమ్మత్తులు చేయలేక కూలిపోయే దశకు చేరుకుంది. ఆ స్థలంలో మరో కొత్త భవనాన్ని నిర్మించాలనేది పాలకులకు లేకుండా పోయింది. నేటికి కూ లేందుకు సిద్ధంగా ఉన్న బడిలోనే పిల్లలు పాఠ్యాంశాలు నేర్చుకుంటున్నారు. మద్నూర్ మండలంలోని సుల్తాన్ పేట్ పాఠశాల పరిస్థితిని చూస్తే బడి ఇలా ఉంటే చదువులెలా సాగుతాయన్న అనుమానం రాకమానదు. మద్నూర్ మండలంలోని సుల్తాన్‌పేట్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాల పైకప్పు కూలేందుకు సిద్ధంగా ఉంది. గోడలు పగుళ్లు వచ్చి కిందపడేలా ఉన్నాయి. గోడలు కూలితే మట్టి పెడ్డలు పిల్లలపై పడేలా ఉన్నాయి. పాకురు పట్టి రూంల గోడలు కాంతి లేకుండా మారాయి. కిటికీలు, తలుపులు పూర్తిగా శిథిలమయ్యాయి. విద్యుత్ బోర్డులు పిల్లల చేతికి తగిలేలా ఉన్నాయి. రూంలలో బండలు లేక నేల సదువులు సాగుతున్నాయి. బడి బయట అపరిశుభ్రత అలముకుంది. కిటికీలు, తలుపులు లేకపోవడంతో తరగతి గదులు అపరిశుభ్రంగా మారాయి. చిన్న పిల్లలను ప్రమాదకర గదుల్లో కూర్చోబెట్టి పాఠాలు చెబుతున్నారు. ఇన్నేళ్లైనా ఈ పాఠశాల వైపు కన్నెత్తి చూసిన వారే లేకుండా పోయారు.
పాఠశాలకు యాభై ఏళ్లు…
సుల్తాన్‌పేట్ ప్రాథమిక పాఠశాలను యాభై సంవత్సరాల క్రితం ఏర్పాటు చేశారు. నాటి నుండి నేటి వర కు ఎంతో మంది ఓనమాలు నేర్చుకునేందుకు ఆశ్రయమిచ్చిన పాఠశాల ఇది. ప్రభుత్వ పాఠశాలగా పిలువబడుతున్న ఈ బడి  విద్యాశాఖ జాబితాలో ఉందా లేదా అన్నదే ఈ గ్రామ ప్రజల్లో తలెత్తుతున్న ప్రశ్న. ఎందుకంటే ఈ బడికి వచ్చేవారు లేరు…పోయే వారు లేరు…ఉన్నదల్లా పర్మినెంట్ టీచర్, మరో ఇద్దరు విద్యావలంటీర్లు. వీరికి తోడు 82 మంది విద్యార్థులు మాత్రమే ఈ బడికి వచ్చిపోతుంటారు. ఎప్పుడో కట్టిన బడిలో ఇప్పటి వరకు పాఠశాల కొనసాగుతూనే ఉంది. ఐదు తరగతి గదులలో ఒకటి నుండి ఐదవ తరగతి వరకు బోధన నడుస్తోంది. ఫర్నిచర్ లేక, సదుపాయాలు సమకూరక ఉపాధ్యాయులు సైతం ఇబ్బందులు పడుతున్నారు. విద్యుత్ సరఫరా ఉన్నా ఎప్పుడుంటుందో ఎప్పుడుపోతుందో కూడా ఎవరికి తెలియదు. పాఠశాలకు సంబంధించిన మీటర్ బాక్స్‌ను కిందికి పిల్లలకు అందేలా బిగించారు. స్వీపర్ లేకపోవడంతో బడిని ఊడ్చేవారు లేరు. చెత్తాచెదారంలోనే పలకాబలపం పట్టుకొంటున్నారు.
బడి బాగు కోరాం: సర్పంచ్ రాములు
బడిని బాగు చేయమని ఎన్నోసార్లు పైనసార్లను అడిగాం ఎమ్మెల్యేకు కూడా చెప్పాం…కాని ఏం చేయాలా..నిధుల రాలే.. బడి మారలేదంటూ గ్రామ సర్పంచ్ సంగోళ్ల రాములు తెలిపాడు.
కొత్త బిల్డింగ్ కోసం అడుగుతాం..
విద్యాకమిటీ చైర్మన్ మారుతి
ప్రాథమిక పాఠశాల నూతన భవన ఏర్పాటు కోసం ఎమ్మెల్యేను కోరతామని, బడి పూర్తిగా దెబ్బతిన్న మాట వాస్తవమని పాఠశాల విద్యాకమిటీ చైర్మన్ మారుతి అన్నారు. వానా కాలం వచ్చిందంటే ఎప్పుడు కూల్తదోనని అనుకుంటం. పిల్లలను పంపీయం. ఎండలు కొట్టేటపుడే పిల్లలొస్తరు. గోడలు బాగా లేవ్ కదా. ఎవరికైనా భయమే. సర్కార్ మరి బిల్డింగ్‌కు పైసల్ సాంక్షన్ చేయాలా..అంటూ మారుతీ కోరాడు.