Home స్కోర్ చరిత్ర సృష్టించిన తెలుగుతేజం

చరిత్ర సృష్టించిన తెలుగుతేజం

aruna

 ప్రపంచకప్  జిమ్నాస్టిక్స్‌లో అరుణకు కాంస్యం

మెల్‌బోర్న్: ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో జరుగుతున్న వరల్డ్ కప్ జిమ్నాస్టిక్ పోటీల్లో భారత జిమ్నాస్ట్, తెలుగుతేజం అరుణా రెడ్డి కాంస్య పతకం గెలిచి చరిత్ర సృష్టించింది. వరల్డ్‌కప్ జిమ్నాస్టిక్స్‌లో భారత్‌కు ఇదే తొలి పతకం కావడం విశేషం. శనివారం జరిగిన ఫైనల్లో అరుణ అసాధారణ ప్రతిభను కనబరుస్తూ తన ఖాతాలో కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ఈ క్రమంలో జిమ్నాస్టిక్ వరల్డ్‌కప్‌లో పతకం సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. అంతర్జాతీయ స్థాయి జిమ్నాస్టిక్స్‌లో భారత్‌కు ఇది మూడో పతకం కావడం విశేషం. గతంలో అశిష్ కుమార్, దీపా కర్మాకర్‌లు అంతర్జాతీయ స్థాయి జిమ్నాస్టిక్స్‌లో భారత్‌కు పతకాలు సాధించి పెట్టారు. ఇద్దరు కూడా కామన్‌వెల్త్ పోటీల్లోనే పతకాలు సాధించడం గమనార్హం. కాగా, హైదరాబాద్‌కు చెందిన 22 ఏళ్ల అరుణ వరల్డ్‌కప్ జిమ్నాస్టిక్స్‌లో చారిత్రక ప్రదర్శనతో ఆకట్టుకుంది. హేమాహేమీ జిమ్నాస్ట్‌లు పాల్గొన్న ఈ మెగా చాంపియన్‌షిప్‌లో అరుణ 13,649 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. స్లోవేనియాకు చెందిన టిజాసా కిస్లెఫ్ 13,800 పాయింట్లతో స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. మరోవైపు ఆతిథ్య ఆస్ట్రేలియాకు చెందిన జిమ్నాస్ట్ ఎమిలి వైట్‌హెడ్ 13,699 పాయింట్లతో రజత పతకాన్ని దక్కించుకుంది. కాగా, భారత్‌కు చెందిన మరో జిమ్నాస్ట్ ప్రణతి నాయక్ 13,416 పాయింట్లతో ఆరో స్థానంలో నిలిచింది. కాగా, భారత్‌కు చెందిన స్టార్ జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ రియో ఒలింపిక్స్‌లో నాలుగో స్థానంలో నిలిచి తృటిలో పతకం గెలుచుకునే అవకాశాన్ని చేజార్చుకున్న విషయం తెలిసిందే. అయితే ప్రపంచకప్‌లో అరుణ అసాధారణ ఆటతో పతకం గెలిచి భారత ఖ్యాతని నలుమూలలా చాటింది. కాగా, వరల్డ్‌కప్‌లో పతకం గెలవడంపై అరుణ ఆనందం వ్యక్తం చేసింది. ఈ పోటీల కోసం కఠోర సాధన చేశానని, శ్రమ ఫలించి పతకం దక్కడం ఎంతో గర్వంగా భావిస్తున్నట్టు తెలిపింది. భవిష్యత్తుల్లో జరిగే ఒలింపిక్స్‌లో పతకం సాధించడమే తన ముందున్న ఏకైక లక్షమని అరుణ స్పష్టం చేసింది. ఇదిలావుండగా తెలుగుతేజం అరుణా రెడ్డి ఇప్పటికే పలు జిమ్నాస్టిక్స్ పాల్గొని భారత్‌కు పతకాల పంట పండించింది. తాజాగా ప్రపంచకప్‌లో కాంస్యం నెగ్గడం ద్వారా తెలుగు రాష్ట్ర ఖ్యాతిని ఇనుమడింప చేసింది. విపరీత పోటీ ఉండే ప్రపంచకప్‌లో పతకం సాధించడం అంత తేలికకాదు. అయితే కఠోర సాధన, అంకితభావంతో కూడిన ప్రతిభతో అరుణారెడ్డి పతకాన్ని సొంతం చేసుకుని భారత క్రీడా చరిత్రలో కొత్త మైలురాయిని చేర్చింది.