జనగామ: బావను సొంత బావమరిదే అతి కిరాతకంగా నరికి చంపిన దారుణ సంఘటన జనగామ మండలం చీటకోడూరు గ్రామంలో చోటు చేసుకుంది. ఆదివారం అర్ధరాత్రి సమయంలో పవన్ (25) అనే యువకుడిపై అతని బావమరిది కత్తితో విచక్షణరహితంగా దాడి చేశాడు. దీంతో తీవ్రంగా గాయపడిన పవన్ అక్కడికక్కడే చనిపోయాడు. పవన్ చనిపోయాడని నిర్ధారించుకున్న అనంతరం నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే, సొంత బావను బావమరిది ఇంత దారుణంగా హత్య చేయడానికి గల కారణం ఏమిటనేది తెలియాల్సి ఉంది.