Home తాజా వార్తలు తొలిసారి వేతనాల చెల్లింపులో బిఎస్‌ఎన్‌ఎల్ విఫలం

తొలిసారి వేతనాల చెల్లింపులో బిఎస్‌ఎన్‌ఎల్ విఫలం

BSNL 1.76 లక్షల మంది ఉద్యోగులపై ప్రభావం

ముంబై: ప్రభుత్వరంగ టెలికామ్ సంస్థ బిఎస్‌ఎన్‌ఎల్ (భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్) 1.76 లక్షల మంది ఉద్యోగులకు ఫిబ్రవరి వేతనాలను చెల్లించడంలో విఫలమైంది. నెలవారి వేతనాలను చెల్లించని పరిస్థితి రావడం సంస్థ చర్రితలోనే ఇది తొలిసారి. రిలయన్స్ జియో వంటి ప్రైవేటు టెలికాం సంస్థ నుంచి తీవ్రస్థాయిలో పోటీ ఎదురవుతుండడం వల్ల సంస్థకు నగదు కొరత సమస్య తలెత్తింది. ఫిబ్రవరి నెల జీతాల పది రోజులు ఆలస్యంగా చెల్లించినట్టు తెలుస్తోంది. ఎప్పుడైనా నెలలో ఆఖరి పని రోజున జీతాల చెల్లింపు ఉంటుంది. ఈసారి ఆలస్యం కావడం వల్ల 1.76 లక్షల మంది ఉద్యోగులు ప్రభావితమయ్యారు.

కేరళ, ఒడిషా, జమ్ము కశ్మీర్ ఉద్యోగులకు వేతనాలను బట్వాడా ను ప్రారంభించామని సంస్థ అధికారి ఒకరు వెల్లడించారు. మార్చి నెల జీతాలు కూడా కొన్ని రోజులు ఆలస్యం అయ్యే అవకాశం ఉందని అన్నారు. రిలయన్స్ జియో టెలికామ్ రంగంలోకి ప్రవేశించిన తర్వాత రేట్లు అత్యంతగా పడిపోయి తీవ్రమైన పోటీ నెలకొంది. అదే సమయంలో ప్రత్యర్థి సంస్థలతో పోలిస్తే బిఎస్‌ఎన్‌ఎల్ పెద్ద సంఖ్యలో ఉద్యోగులతో సంస్థను నడిపిస్తూ వస్తోంది. టైమ్స్‌ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం, మహారాష్ట్ర సర్కిల్ రూ.60 కోట్లకు పైగా వేతనాలు చెల్లించాల్సి ఉంది. దేశవ్యాప్తంగా మొత్తం 20 సర్కిళ్లు ఉండగా, బిఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగుల వేతనాల అంచనా రూ.1200 కోట్లు. సంస్థ ఆదాయంలో 55 శాతం వేతనాలకే పోతుంది.

అలాగే సంవత్సరానికి వేతన బిల్లు 8 శాతం పెరుగుతుంది. అయితే ఈ మేరకు సంస్థ ఆదాయం పుంజుకోకపోవడంతో సంక్షోభంలో పడుతోంది. ఈ నేపథ్యంలో నిధులను విడుదల చేయాల్సిందిగా కోరుతూ బిఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగ సంఘాలు కేంద్ర టెలికాం మంత్రి మనోజ్ సిన్హాకు ఇటీవల ఒక లేఖ కూడా రాశాయి. ఆర్థిక సంక్షోభాన్ని ఇతర ఆపరేటర్లు కూడా ఎదుర్కొంటున్నప్పటికీ వారు భారీ మొత్తంలో సమకూర్చుకోవడం వల్ల గట్టెక్కుతున్నాయని ఆ లేఖలో పేర్కొడం గమనార్హం. కేరళ, జమ్మూకాశ్మీర్, ఒడిషా, కార్పొరేట్ ఆఫీసుల్లో ఉద్యోగులకు ఫిబ్రవరి వేతనాలను చెల్లించడం ప్రారంభించినట్టు బిఎస్‌ఎన్‌ఎల్ అధికారి ఒకరు మీడియాతో తెలిపారు.

BSNL Fails to Pay Salaries