Search
Friday 21 September 2018
  • :
  • :

తగ్గిన బిఎస్‌ఎన్‌ఎల్ నష్టాలు

bsnlన్యూఢిల్లీ: ప్రభుత్వరంగ టెలికామ్ సంస్థ బిఎస్‌ఎన్‌ఎల్ నష్టాల నుంచి కోలుకుంటోంది. గత ఏడాది ఏప్రిల్ నుంచి డిసెంబర్ 31 వరకు తొమ్మిది నెలల కాలంలో సంస్థ రూ.4,890 కోట్ల నష్టాలను నమోదు చేసింది. గతేడాది ఇదే సమయంలో సంస్థ నష్టం రూ.6,121 కోట్లుగా ఉంది. 9 నెలల సంస్థ ఫలితాలను ఆదివారం సంస్థ వెల్లడించింది. సేవల ద్వారా సంస్థ రెవెన్యూ 5.8 శాతం పెరిగిందని, మొత్తం ఆదాయం 7 శాతానికి చేరిందని బిఎస్‌ఎన్‌ఎల్ ఛైర్మన్, ఎండి అనుపమ్ శ్రీవాత్సవ తెలిపారు. అదే సమయంలో బిఎస్‌ఎన్‌ఎల్ సేవల నుంచి వచ్చే ఆదాయం రూ.18,314.9కోట్ల నుంచి రూ.19,379.6 కోట్లతో వృద్ధిని కనబరిచింది. వచ్చే నాలుగో త్రైమాసికంలో నష్టాలు మరింత తగ్గే అవకాశం ఉందని సంస్థ విశ్వాసం వ్యక్తం చేసింది.

ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి నష్టాలు ఇంకా కొంత మేర తగ్గే అవకాశం ఉందని, ఇందుకు నాలుగో త్రైమాసికం ఉపకరిస్తుందని ఆయన తెలిపారు. 2015-16 ఆర్థిక సంవత్సరంలో ఇదే జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఇతరాల ద్వారా వచ్చే ఆదాయం 42శాతం పెరగడం ద్వారా డిసెంబర్ 2016 చివరి నాటికి నాటికి మొత్తం ఆదాయం రూ.20,290.5కోట్లకు చేరిందని వివరించారు. కొత్త ల్యాండ్ లైన్ కనెక్షన్లు తీసుకునే బిఎస్‌ఎన్‌ఎల్ వినియోగ దారులకు ఇటీవల కొత్త ఆఫర్లను ప్రకటించింది. టెలికామ్ రంగంలోకి రిలయన్స్ జియో ప్రవేశించి, ఉచిత ఆఫర్లతో దూసుకుపోతున్న నేపథ్యంలో ప్రత్యర్థి కంపెనీలు కూడా ఆఫర్లను ప్రకటిస్తూ వస్తున్నాయి. ఇదే సమయంలో బిఎస్‌ఎన్‌ఎల్ కూడా ఇతర సంస్థలకు ధీటుగా ఆఫర్లను ప్రకటిస్తూ వినియోగదారులను ఆకర్షించే ప్రయత్నం చేసింది.

Comments

comments