Home తాజా వార్తలు ప్రధాని మోడీ దిష్టి బొమ్మ దగ్దం..

ప్రధాని మోడీ దిష్టి బొమ్మ దగ్దం..

Narendra-modi-Effigy-brunt

హైదరాబాద్: దేశం కోసం ప్రాణత్యాగం చేసిన జాతీయ నాయకులను అవమానించేలా కేంద్రంలోని మోడీ సర్కార్ వ్యవహరిస్తుందని రాజ్యసభ సభ్యులు వి.హన్మంతరావు ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం దివంగత ప్రధాన మంత్రులు ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీల చిత్రపటాలతో కూడిన స్టాంపులను తొలగించడాన్ని నిరసిస్తూ గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సోమవారం అబిడ్స్ చౌరస్తాలో ప్రధాని నరేంద్రమోడీ దిష్టిబొమ్మను దగ్దం చేశారు. ఈ సందర్భంగా వారు మోడీ డౌన్…డౌన్…ఇందిర, రాజీవ్ చిత్రపటాల స్టాంపులను కొనసాగించాలంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి అబిడ్స్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు వి.హన్మంతరావు మాట్లాడుతూ నరేంద్రమోడీ సర్కార్ దురుద్దేశ్యంతోనే కాంగ్రెస్ పార్టీకి చెందిన దివంగత ప్రధాన మంత్రులైన ఇందిర, రాజీవ్‌గాంధీల స్టాంపులను తొలగించిందని ఆరోపించారు. తన పదవీకాలంలో సగభాగం విదేశీ పర్యటనకే పరిమితమైన ప్రధాని మోడీ ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో ఆదరణ పెరుగుతుండటంతో ఓర్వలేక ఇలాంటి చవకబారు చర్యలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డి, మాజీ డిప్యూటీ మేయర్ రాజ్‌కుమార్, కాంగ్రెస్ నాయకులు జి.నరేందర్‌యాదవ్ తో పాటు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.