Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

కెసిఆర్ బిజినెస్ రిఫార్మర్

kcr

మన తెలంగాణ / హైదరాబాద్ : ప్రముఖ మీడియా సంస్థ ఎకనమిక్ టైమ్స్ ముఖ్యమంత్రి కెసిఆర్‌ను ఈ ఏడాది ప్రతిష్టాత్మకమైన ఎకనమిక్ టైమ్స్ ‘బిజినెస్ రిఫార్మర్’ అవార్డుకు ఎంపిక చేసింది. ఈ విషయాన్ని టైమ్స్ గ్రూపు ఎండి వినీత్ జైన్ ‘ఇ మెయిల్’ ద్వారా ముఖ్యమంత్రికి తెలియజేశారు. ముంబ యిలో అక్టోబర్ 27న జరిగే అవార్డుల ప్రదానోత్సవం లో పాల్గొనాలని ముఖ్యమంత్రిని ఆహ్వానించారు. తనను ఈ అవార్డుకు ఎంపిక చేసినందుకు టైమ్స్ గ్రూపు ఎండికి సిఎం ధన్యవాదాలు తెలిపారు. అవార్డుల ప్రదానోత్సవానికి హాజరు కావడానికి ముఖ్యమంత్రి సమ్మతిని తెలియజేశారు. ఈ అవార్డు తనకు వ్యక్తిగతంగా వచ్చినట్లు భావించడం లేదని, తెలంగాణ రాష్ట్రానికి లభించిన గుర్తింపుగా స్వీకరిస్తున్నానని సిఎం ఈ సందర్భంగా టైమ్స్ గ్రూపుకు ‘ఇ మెయిల్’ ద్వారా బదులిచ్చారు. తెలంగాణ రాష్ట్రం గడిచిన నాలుగేళ్లుగా సగటున ఏడాదికి 17.17 శాతం చొప్పున, ఈ ఏడాది మొదటి ఐదు నెలల్లో 21.96 శాతం ఆదాయాభివృద్ది సాధిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా సిఎం గుర్తు చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిన ‘టిఎస్‌ఐపాస్’ సింగిల్ విండో పారిశ్రామిక అనుమతుల విధానం మంచి ఫలితం ఇచ్చిందని, దీని ద్వారా ఇప్పటికే 7000 పరిశ్రమలు అనుమతులు పొందాయని సిఎం ఆ మెయిల్‌లో వివరించారు. దీనివల్ల చాలా మందికి ఉద్యోగ అవకాశాలు, పెద్దమొత్తంలో పెట్టుబడులు వచ్చాయని వివరించారు.
ఎలాంటి అవినీతికి అవకాశం లేకుండా, ఎవరూ ఏమాత్రం ఇబ్బంది పడకుండా పరిశ్రమల అనుమతులు వస్తున్నాయన్నారు. అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో తెలంగాణ రాష్ట్రం సాధిస్తున్న అభివృద్ది ఇలాంటి అవార్డులు రావడానికి కారణం అవుతున్నాయని పత్రికలకు విడుదల చేసిన ఒక ప్రకటనలో ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. భారతదేశంలో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పారిశ్రామిక వేత్తలు తెలంగాణ పారిశ్రామిక విధానాన్ని ప్రశంసించిన విషయాన్ని కూడా సిఎం ప్రస్తావించారు. ‘ఈజ్ ఆప్ డూయింగ్ బిజినెస్’లో కూడా తెలంగాణ అగ్రస్థానంలో ఉన్నదని చెప్పారు. తెలంగాణ రాష్ట్రానికి తరలివచ్చిన ఐటి పరిశ్రమలు కూడా రాష్ట్రాభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషించాయన్నారు.

Comments

comments