Home బిజినెస్ 2030 నాటికి జిడిపిలో అమెరికాను అధిగమిస్తాయి

2030 నాటికి జిడిపిలో అమెరికాను అధిగమిస్తాయి

By 2030, the GDP will overtake the United States

దూసుకెళ్తున్న భారత్ సహా 10 ఆసియా ఆర్థిక వ్యవస్థల వృద్ధి
వాణిజ్య సమస్యలు, యువత ఉపాధిపై దృష్టి పెట్టాలి: డిబిఎస్ నివేదిక వెల్లడి

ముంబై : ఆసియాలో భారత్ సహా 10 ప్రధాన ఆర్థిక వ్యవస్థలు వేగంగా వృద్ధిని సాధించనున్నాయని, 2030 సంవత్సరం నాటికి వీటి జిడిపి(స్థూల దేశీయోత్పత్తి) 28 ట్రిలియన్ డాలర్లతో అమెరికాను అధిగమించనుందని డిబిఎస్ నివేదిక వెల్లడించింది. అంతర్జాతీయ ఆర్థిక సేవల సంస్థ డిబిఎస్ ప్రకారం, ఆసియా10 ఆర్థిక వ్యవస్థల్లో చైనా, హాంకాంగ్, భారత్, ఇండోనేషియా, మలేసియా, పిలిప్పీన్స్, సింగపూర్, దక్షిణ కొరియా, తైవాన్, థాయ్‌లాండ్ వంటి దేశాలు ఉన్నాయి. ఆసియా ఆర్థిక భవిష్యత్ ప్రకాశవంతంగా ఉంది. 2030 సంవత్సరం నాటికి ఈ 10 ఆర్థిక వ్యవస్థలు అత్యంత వేగంగా వృద్ధిని సాధిస్తాయి. మొత్తంగా కలిపి వీటి వాస్తవ జిడిపి 28.35 ట్రిలియన్  డాలర్లకు చేరనుందని, అంటే యునైటెడ్ స్టేట్స్ జిడిపి 22.33 ట్రిలియన్లను దాటనుందని డిబిఎస్ అంచనా వేస్తోంది. అన్ని ఆసియా దేశాలు సాధారణంగా పర్యావరణ మార్పు సమస్యలను ఎదుర్కొంటున్నాయి. అలాగే అసమానతలు పెరగడం, వాణిజ్యానికి ప్రతికూల వాతావరణ పరిస్థితులు, సాంకేతికంగా అంతరాయం వంటివి ఈ దేశాల వృద్ధికి విఘాతం కల్గిస్తున్నాయని నివేదిక పేర్కొంది. ఆసియా ఆర్థిక వ్యవస్థల వృద్ధి ఇటీవల కాలంలో బలహీనపడిందని, అంతర్జాతీయ పర్యావరణంలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయని రీసెర్చ్ నోట్‌లో డిబిఎల్ పేర్కొంది. యువతకు ఉపాధి అవకాశాలను కల్పించడంలో సవాళ్లు ఎదురవుతున్నాయని, దీంతో నిరుద్యోగం గరిష్ఠ స్థాయికి చేరనుందని, వీటి పర్యవసానంగా ఆర్థికంగా, సామాజిక/ రాజకీయ సమస్యలు తలెత్తే అవకాశముందని నివేదిక వివరించింది. భారత్, ఫిలిప్పీన్స్ వంటి దేశాలు యువతకు ఉపాధి అవకాశాలను సృష్టించేందుకు తీవ్రంగా శ్రమించాలి. అలాగే వృద్ధులు ఎక్కువగా ఉన్న సింగపూర్, జపాన్, చైనా వంటి దేశాలు కొత్త టెక్నాలజీని వినియోగించడం ద్వారా జనాభా పరమైన సమస్యలను అధిగమించవచ్చని నివేదిక తెలిపింది. ప్రపంచ దేశాలు రక్షణాత్మక విధానాలను అవలంభించడం పెరుగుతోందని, ఇది ఆసియాలోకి పెట్టుబడుల ప్రవాహానికి ముప్పుగా మారనుందని డిబిఎస్ పేర్కొంది.