Home జాతీయ వార్తలు మోడీల్ తో ఆదా

మోడీల్ తో ఆదా

CAG report on purchase of French Rafale fighter planes

 

కాంగ్రెస్ ఆరోపణలు అబద్ధమని రుజువైంది -అరుణ్ జైట్లీ

యుపిఎ ఒప్పందంతో పోలిస్తే మెరుగైనది

ఫ్రెంచ్ రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుపై కాగ్ నివేదిక
బ్యాంక్ గ్యారంటీ షరతు
తొలగించారని ఎత్తిచూపిన ఆడిటర్

న్యూఢిల్లీ: ప్రధాని మోడీ సారథ్యంలోని ఎన్‌డిఎ ప్ర భుత్వం ఫ్రెంచ్ కంపెనీ దసోతో కుదుర్చుకున్న రాఫెల్ యుద్ధ విమానాలు కొనుగోలు ఒప్పందం వల్ల ప్రభుత్వానికి డబు ఆదా అయ్యిందని అవిధంగా ఇది యుపిఎ హయాంనాటి డీల్ కంటే మెరుగైందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) నివేదిక అభిప్రాయపడింది. ఈ యుద్ధ విమానాలకు గత ఒప్పందంతో పోలిస్తే ఇప్పుడు తక్కువ రేటు కుదిరిందని నివేదికలో తెలిపారు. మన్మోహన్ సింగ్ నాయకత్వపు యుపిఎ ప్రభుత్వ హయాం లో కుదిరిన ఒప్పందంతో ప్రస్తుత మోడీ ఆధ్వర్యపు ఎన్‌డిఎ ప్రభుత్వ హయాంలో కుదిరిన ఒప్పందంలో తక్కువ ధరను ఖరారు చేశారని పేర్కొన్నారు. అంతకు ముందటి ధరలతో పోలిస్తే ఇప్పుడు 2.86 శాతం తక్కువ రేటు పడిందని నివేదికలో విశ్లేషించారు. తక్కువ స్థాయి రేట్ల అంశం వల్ల రక్షణ మంత్రిత్వశాఖకు ఆదా అయిందని తెలిపారు. ఇక మొత్తం 126 విమానాల సేకరణ డీల్‌తో పోల్చుకుంటే ఇప్పటి 36 యుద్ధ విమానాల కొనుగోళ్లలో మొత్తం 17.08 శాతం ఆదా అయిందని తెలిపారు. అంతేకాకుండా భారత అవసరాలకు తగ్గట్లుగా మార్పులు చేసిన యుద్ధ విమానాలను రూపొందించినట్లు తెలిపారు.

పాత డీల్‌తో పోలిస్తే కొత్త డీల్‌తో మొదటి 18 విమానాలు 5 నెలలకు ముందే అందాయని తెలిపారు. ప్రభుత్వ లెక్కలు, వ్యయ వివరాలపై కీలక గణాంకాల సంస్థ అయిన కాగ్‌కు ప్రస్తుతం రాజీవ్ మెహర్షీ నాయకత్వం వహిస్తున్నారు. ఆయన రాఫెల్ డీల్ ఖరారు ప్రక్రియలో ఉన్న వ్యక్తి అని కాంగ్రెస్ పార్టీ స్పందించింది. అందుకే కొన్ని అంశాలను డీల్‌కు అనుకూలంగా పొందుపర్చారని విమర్శించింది. రాఫెల్ డీల్ కుదిరినప్పుడు మెహర్షీ ఆర్థిక శాఖ కార్యదర్శిగా  ఉన్నారని కాంగ్రెస్ తెలిపింది. బ్యాంక్ గ్యారంటీ, ఫ్రాన్స్ ప్రభుత్వ అధికారిక హామీల అంశాలు లేకుండా రాఫెల్ డీల్ కుదిరిందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదికలో తెలిపారు. అత్యంత వివాదాస్పదంగా మారిన రాఫెల్ డీల్‌పై కాగ్ బుధవారం తమ నివేదికను పార్లమెంట్‌కు సమర్పించింది. ఇందులో పలు కీలక అంశాలను ప్రస్తావించారు. ఫ్రాన్స్ ప్రభుత్వంతో కుదిరిన ఈ విమానాల ఒప్పందంలో తప్పులూ ఉన్నాయి. ఒప్పులూ ఉన్నాయని నివేదిక నిగ్గు తేల్చింది.

ఇదే మోడీ హయాంలో కుదిరిన ఈ ఒప్పందంలోని లొసుగులను నివేదిక ప్రముఖంగా ప్రస్తావించింది. అయితే మునుపటి ఒప్పందం రేట్లతో పోలిస్తే ఇప్పుడు తక్కువ ధరలు పలికాయని తెలిపారు. ఇప్పటి ఒప్పందంలో రాఫెల్ ఉత్పత్తి సంస్థ దసో బ్యాంకు గ్యారంటీ చెల్లించాల్సిన అవసరం లేకుండా చేశారని, 2007 యుపిఎ హయాంలో ఈ బ్యాంకు గ్యారంటీ షరతు ఉందని వెల్లడించారు. గ్యారంటీ హామీ ఎత్తివేయడంతో సదరు కంపెనీకి ప్రయోజనం దక్కింది. అంతేకాకుండా ఒప్పందానికి సంబంధించి అక్కడి ప్రాన్స్ ప్రభుత్వం నుంచి రావల్సిన సాధికారిక హామీ (సొవరిన్ గ్యారంటీ)ని తీసుకోలేదు. దీనికి బదులుగా విమాన ఉత్పత్తి సంస్థ నుంచి హామీ లెటర్ ఆఫ్ కంఫర్ట్‌తో సరిపెట్టారని నివేదికలో తెలిపారు. 2007 యుపిఎ హయాం డీల్‌లో అడ్వాన్స్ చెల్లింపులకు బదులుగా 15 శాతం బ్యాంక్ గ్యారంటీ నిబంధనను నిర్ధేశించారు. దీనిని తాజా ఒప్పందంలో పొందుపర్చలేదని నివేదికలో తెలిపారు. ఇది ఆందోళనకరమైన పరిణామమేనని కాగె నివేదికలో తెలిపారు.

విమాన ఉత్పత్తి సంస్థ ఒప్పంద ఉల్లంఘనలకు దిగినట్లు అయితే భారతదేశం తొలుత నేరుగా ఈ విషయంపై మధ్యవర్తిత్వం ద్వారా సమస్యను పరిష్కరించుకోవల్సి ఉంటుంది, మధ్యవర్తిత్వ తీర్పు ఇండియాకు అనుకూలంగా వచ్చినట్లు అయితే విమాన నిర్మాణ సంస్థ అర్బిట్రేషన్ తీర్పునకు కట్టుబడకపోతే చిక్కులు ఏర్పడుతాయి. అప్పుడు భారత ప్రభుత్వం ఒప్పందం అమలుకు అందుబాటులో ఉన్న చట్ట న్యాయపరమైన మార్గాలను ఆశ్రయించాల్సి ఉంటుంది. దీని తరువాతనే దసో ఏవియేషన్ తరఫున ప్రాన్స్ ప్రభుత్వం చెల్లింపులకు దిగేందుకు వీలేర్పడుతుంది.36 రాఫెల్ యుద్ధ విమానాల సేకరణకు సబంధించి భారతదేశం తొలిసారిగా ఫ్రాన్స్‌తో ప్రభుత్వాల మధ్య ఒప్పందం (ఐజిఎ) కుదుర్చుకుంది. అంతకు ముందు భారతదేశం ఇటువంటి ఐజిఎలను అమెరికా, బ్రిటన్, రష్యాలతో ఖరారు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి.

ఈ కీలకమైన ఐజిఎలో సంక్లిష్టమైన లొసుగులు ఉన్నాయని కాగ్ తెలిపింది. 36 రాఫెల్స్‌కు సంబంధించి ఎం/ఎస్ డిఎ (డసో ఏవియేషన్)తో 2007లో కుదిరిన ఒప్పందంలో అడ్వా న్స్ పేమెంట్స్‌కు సంబంధించి 15శాతంబ్యాంకు గ్యారం టీ నిబంధనను నిర్ధేశించారు. అంతేకాకుండా 5 శాతం మేర సామర్థగ్యారంటీ, వారంటీని కూడా జతచేశారు. అప్పటి ఐజిఎలోని ఈ అంశాలతో విమాన విక్రయదార్లు ఒప్పంద ఉల్లంఘనలకు దిగినట్లు అయితే బ్యాంక్ గ్యా రంటీని నేరుగా స్వతహసిద్థంగా రాబట్టుకునేందుకు వీలేర్పడింది. అయితే ప్రస్తుత ప్రభుత్వంతో అక్కడి విమానయాన సంస్థ 2015లో చేసిన ప్రతిపాదనలలో ఎటువంటి ఆర్థిక, లేదా సమర్థతకు సంబంధించిన బ్యాంక్ గ్యారంటీని పొందుపర్చలేదని కాగ్ నివేదిక తెలిపింది.

న్యాయ మంత్రిత్వశాఖ అభ్యంతరం చెప్పినా…..
ఒప్పందం మేరకు ఫ్రెంచ్ విక్రయదార్లకు భారత ప్రభుత్వం తరఫున 60 శాతం అడ్వాన్స్ పేమెంట్లు చెల్లించాల్సి ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి భారత న్యాయ , చట్ట మంత్రిత్వశాఖ వారు ప్రభుత్వ పరంగా సొవరిన్ గ్యారంటీ అవసరం అనే విషయం గురించి సలహా ఇచ్చారు. విమానాల ప్రతిపాదిత సేకరణల విలువను బట్టి ఈ అధికారిక గ్యారంటీకి పట్టుబట్టాలని సూచించారు. అయితే ఫ్రాన్స్ ప్రభుత్వం కానీ, డసో ఏవియేషన్ సంస్థ వారు కానీ ఈ బ్యాంక్ గ్యారంటీని లేదా ప్రభుత్వ పరంగా ఉండాల్సిన హామీని కానీ పొందుపర్చలేదు. ఈ విషయాలను ప్రస్తావించలేదని కాగ్ నివేదికలో తెలిపారు. ప్రభుత్వపరంగా హామీ బదులుగా బ్యాంకు గ్యారంటీకి మారుగా కేవలం ఫ్రెంచ్ ప్రధాని తరఫున అధికారిక హామీకి తక్కువ స్థాయిలో ఉండే లెటర్ ఆఫ్ కంఫర్టును వెలువరించారు. లెటర్ ఆఫ్ కంఫర్టు సొవరిన్ గ్యారంటీల విషయాన్ని పరిశీలన కోసం 2016 సెప్టెంబర్‌లో భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ(సిసిఎస్)కి పంపించారు. దీనిపై 16 నెలల సమయం తీసుకున్న తరువాత సిసిఎస్ దీనిని ఆమోదించింది.

డీల్‌లోని ఇతర సంబంధిత అంశాలు అంటే చెల్లింపులకు బదులుగా పొందుపర్చాల్సిన బ్యాంకు గ్యారంటీలకు మినహాయింపుగా నిర్ధేశించిన అంశాలను సిసిఎస్ ఆమోదించిందని కాగ్ తెలిపింది. ఫ్రాన్స్ రక్షణ పరిశ్రమ సంస్థకు చెల్లింపుల సరైన వినియోగం ఉండేలా చేసేందుకు సంబంధిత నిర్ధేశిత ఖాతా ఉంటుందని దీనికి సంబంధించి ఫ్రాన్స్ ప్రభుత్వం నుంచి తగు హామీ లభిస్తుందని ఎప్పటికప్పుడు రక్షణ మంత్రిత్వశాఖ అక్కడి ప్రభుత్వంతో సంప్రదించేందకు వీలుంటుందని భారతప్రభుత్వం సిసిఎస్‌కు సమర్పించిన పత్రంలో తెలిపింది. దీనిని ఆధారంగా చేసుకుని సిసిఎస్ దీనికి ఆమోదం తెలిపిందని కాగ్ తెలిపింది. అయితే ఇందులో ప్రస్తావించిన ప్రత్యేక ఖాతా అంశానికి ఫ్రాన్స్ ప్రభుత్వం అంగీకరించలేదని, పైగా ప్రధాని తరఫున ఇస్తున్న గ్యారంటీ అత్యంత కీలకం అని, అసాధారణం అని తెలిపిందని కాగ్ నివేదికలో పేర్కొన్నారు. ఒప్పంద ఉల్లంఘనలకు కంపెనీ దిగినట్లు అయితే భారత పక్షం అంటే రక్షణ మంత్రిత్వశాఖ ఈ వ్యవహారాన్ని మధ్యవర్తిత్వం ద్వారా ఫ్రాన్స్‌కు చెందిన విక్రేతలతో తేల్చుకోవల్సి ఉంటుంది.

తీర్పు భారత్‌కు అనుకూలంగా వచ్చినా కంపెనీ వారు తగు చెల్లింపులకు దిగకపోతే అప్పుడు భారతదేశం చట్టపరమైన చర్యలకు దిగేందుకు వీలుండేలా ఒప్పందం కుదిరిందని తెలిపారు. ఇందులో సరైన విధంగా తమ చెల్లింపులకు ప్రతిఫలం దక్కకపోతే అప్పుడు భారత ప్రభుత్వం ఫ్రెంచ్ ప్రభుత్వాన్ని సంప్రదించేందుకు మార్గం ఏర్పడుతుంది. ఆ దశలోనే అక్కడి ప్రభుత్వం ఫ్రాన్స్ విక్రేతల నుంచి చెల్లింపులకు మార్గం సుగమం చేసేందుకు వీలేర్పడుతుందని కాగ్ నివేదికలో తెలిపారు. సరైన గ్యారంటీలు, సరైన అధికారిక పత్రాలు లేకుండానే రాఫెల్ ఒప్పందం కుదిరిందని ప్రత్యేకంగా కాంగ్రెస్ నుంచి ప్రభుత్వంపై తీవ్ర స్థాయి విమర్శల దాడి జరుగుతున్న తరుణంలోనే రాఫెల్‌పై ఇప్పుడు కాగ్ నివేదిక వెలువడింది.

కాంగ్రెస్ అసత్య ప్రచారం స్పష్టమైంది : జైట్లీ
కాంగ్రెస్, మహాకూటమిలు రాఫెల్‌పై చేస్తున్న దుష్ప్రచారం ఇప్పటి కాగ్ నివేదికతో వెల్లడైందని బిజెపి సీనియర్ మంత్రి అరుణ్ జైట్లీ స్పందించారు. 2007, 2015లలో కుదిరిన ఒప్పందాలను కాగ్ సరిపోల్చిందని, దీనితో పలు వాస్తవాలు వెలుగులోకి వచ్చాయని జైట్లీ తెలిపారు. ఇప్పటికే 18 విమానాలు గగనతలంలోకి వెళ్లే స్థాయిలో అందుబాటులోకి వచ్చాయని మాజీ ఆర్థిక మంత్రి చెప్పారు. అంతేకాకుండా గతంతో పోలిస్తే తక్కువ ధరకు ఒప్పందం కుదిరిందని విశ్లేషించారు.

అసమ్మతి నోట్ పొందుపర్చలేదు :కాగ్‌పై రాహుల్ విమర్శ
సంప్రదింపుల పక్షాల వారు వెలువరించిన అసమ్మతి నోట్ గురించి కాగ్ నివేదికలో పొందుపర్చలేదని రాహుల్ గాంధీ విమర్శించారు. వివిధ దశలలో వెలువడ్డ అభ్యంతరాలు ఇతరత్రా అంశాలను కాగ్ నివేదిక సరిగ్గా ప్రస్తావించలేదని అభిప్రాయపడ్డారు. పార్లమెంట్‌లో రాఫెల్‌పై కాగ్ నివేదిక వెలువడిన తరువాత విడిగా రాహుల్ స్పందించారు. రాఫెల్ విమానాలు త్వరితగతిన వచ్చాయనే ప్రభుత్వ వాదన కానీ, ధరలపై ప్రభుత్వ సమర్థన కానీ సరిగ్గా లేదనే విషయం కూడా ఇప్పుడు స్పష్టం అయిందన్నారు. ప్రస్తుత ఒప్పందానికి కారణం ఒక్కటే అని, కేవలం అనిల్ అంబానీకి రూ 30000 కోట్లు కట్టబెట్టేందుకే దీనిని కుదర్చుకున్నట్లుగా స్పష్టం అయిందన్నారు. రాఫెల్ డీల్ చాలా బాగా ఉందనే ప్రధాని వాదన ఇప్పుడు నిరూపితం కాలేదని రాహుల్ చెప్పారు. స్కామ్ లేదని చెపుతున్న ప్రధాని జెపిసి దర్యాప్తునకు ఎందుకు అంగీకరించడం లేదని ప్రశ్నించారు. ఇప్పటికీ తాము జెపిసి కోసం డిమాండ్ చేస్తున్నామని అన్నారు.

CAG report on purchase of French Rafale fighter planes