Home జాతీయ వార్తలు బిజెపి రథయాత్రకు అనుమతి నిరాకరణ

బిజెపి రథయాత్రకు అనుమతి నిరాకరణ

 

కోల్‌కతా: బిజెపి అధ్యక్షుడు అమిత్ షా శుక్రవారం కూచ్ బిహార్‌లో ప్రారంభించవలసి ఉన్న రథ యాత్రకు కలకత్తా హైకోర్టు అనుమతి నిరాకరించింది. రథ యాత్ర ప్రయాణించే 24 జిల్లాల నుంచి నివేదికలు వచ్చిన తర్వాత అనుమతించే విషయాన్ని పరిశీలిస్తామని చెబుతూ కేసు తదుపరి విచారణను జనవరి 9వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. బిజెపి చేపట్టదలచిన రథ యాత్రకు అనుమతి ఇవ్వలేదని పశ్చిమ బెంగాల్‌లోని మమతా బెనర్జీ ప్రభుత్వం హైకోర్టుకు తెలియచేసింది. ఈ నిర్ణయాన్ని రాష్ట్ర అడ్వకేట్ జనరల్ కోర్టుకు గురువారం ఉదయం తెలియచేశారు.

కాగా, ప్రజాస్వామ్య వ్యవస్థలో అన్ని రాజకీయ పార్టీలకు తమ కార్యక్రమాలను నిర్వహించుకునే స్వేచ్ఛ ఉంటుందని, వాటిని ఆపే హక్కు ప్రభుత్వానికి లేదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్ వాదించారు. మూడు ఎసి బస్సులతో కూడిన రథాలను కూచ్ బిహార్‌లోని మదన్ మోహన్ ఆలయం నుంచి శుక్రవారం, డిసెంబర్ 9న హూగ్లి నది-బంగాళా ఖాతం సంగమ ప్రదేశమైన గంగాసాగర్ వద్ద, డిసెంబర్ 14న తారాపీఠ్ పట్టణంలో ప్రారంభించాలని బిజెపి నిర్ణయించింది. యాత్ర కొనసాగే దుర్గాపూర్, మాల్డా, శ్రీరాంపూర్, కృష్ణగర్ పట్టణాలలో బహిరంగ సభలలో ప్రధాని మోడి ప్రసంగించవలసి ఉంది.

Calcutta HC Rejects BJPs Rath Yatra