Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

గంభీర్‌కు పిలుపు?

జయంత్ యాదవ్‌కు కూడా

gambirన్యూఢిల్లీ : ఢిల్లీ బ్యాట్స్‌మన్ గౌతం గంభీర్ రెండేళ్ల తరువాత టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు. కాన్పూర్‌లో జరిగిన చరిత్రాత్మక 500వ టెస్టులో వికెట్ల మధ్య పరిగెడుతూ గాయపడ్డ ఓపెనర్ కెఎల్ రాహుల్ స్థానంలో గంభీర్‌కు బిసిసిఐ చోటు కల్పించింది. మంగళవారం గంభీర్ బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో నిర్వహించిన ఫిట్‌నెస్ పరీక్షలో పాస్ అయిన తరువాతే బిసిసిఐ ఈ నిర్ణయం తీసుకుంది. 2014 ఆగస్టులో ఇంగ్లండ్‌పై తన చివరి అంతర్జాతీయ టెస్టు మ్యాచ్ ఆడిన గంభీర్.. ఇటీవలకాలంలో అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. ఐపిఎల్‌లో పరుగుల వరద పారించిన అతను తొలిసారి డే/నైట్ టోర్నమెంట్‌గా నిర్వహించిన దులీప్‌ట్రోఫీలో 71.20 సగటుతో మొత్తం 356 పరుగులు చేశాడు. వీటిలో నాలుగు అర్ధశతకాలు ఉన్నాయి. గంభీర్‌ను టీమిండియాకు ఎంపిక చేయడం సరైందే. అతను అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. సొంతగడ్డపై 13 టెస్టు మ్యాచ్‌లు ఆడుతున్న నేపథ్యంలో జట్టుకు అనుభవాజ్ఞుల సేవలు అవసరం ఉందని జట్టు మేనేజ్‌మెంట్ కోరిందని బిసిసిఐ అధికారొకరు వెల్లడించారు. కాగా దులీప్‌ట్రోఫీ సందర్భంగా గంభీర్‌తో ప్రత్యేకంగా చర్చించిన కోచ్ కుంబ్లే.. గాయపడ్డ రాహుల్ స్థానంలో గంభీర్‌ను ఎంపిక చేయాలని బిసిసిఐని కోరినట్టు సమాచారం. 2008-12 మధ్య టీమిండియాకు రెగ్యులర్ ఓపెనర్‌గా సేవలు అందించిన గంభీర్ ఇప్పటి వరకు 56 టెస్టుల్లో 4046 పరుగులు చేశాడు. 2010లో టీమిండియా తొలిసారి టెస్టుల్లో అగ్రస్థానాన్ని సొంతం చేసుకోవడంలో ఓపెనర్‌గా గంభీర్ కీలకపాత్ర పోషించాడు. అయితే గంభీర్ ఈడెన్‌గార్డెన్ టెస్టుకు ఎంపికైనా తుది జట్టులో చోటు దక్కించుకునేది అనుమానమే. ఇప్పటికే రిజర్వ్ ఓపెనర్‌గా జట్టుతో పాటు ఉన్న శిఖర్ ధావన్ అతనికి పోటీ నిలవనున్నాడు. అయితే ఈడెన్‌గార్డెన్ పిచ్‌పై మంచి అవగాహన ఉన్న గంభీర్ వైపే జట్టు మేనేజ్‌మెంట్ మొగ్గుచూపవచ్చు. ఇక చికెన్‌గున్యాతో తొలిటెస్టు ఆడలేకపోయిన పేసర్ ఇశాంత్‌శర్మ రెండోటెస్టుకు కూడా దూరమయ్యాడు. అతని స్థానంలో హర్యానా ఆఫ్‌స్పిన్నర్ జయంత్‌యాదవ్‌కు బిసిసిఐ చోటు కల్పించింది. ఆస్ట్రేలియా పర్యటనలో భారత్-ఎ తరుపున ఉత్తమ ప్రదర్శన చేసిన 26 ఏళ్ల జయంత్ జాతీయ జట్టుకు ఎంపిక కావడం ఇదే తొలిసారి. కాగా యువరాజ్ సింగ్‌ను న్యూజిలాండ్‌తో జరిగే వన్డే సిరీస్‌కు ఎంపిక చేసే ఆలోచనలో బిసిసిఐ ఉన్నట్టు తెలుస్తోంది. గంభీర్‌తో పాటు వన్డే జట్టులో చోటు ఆశిస్తున్న యువరాజ్, బుమ్రా, బరిందర్‌స్రాన్ మంగవారం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడెమీ(ఎన్‌సిఎ)లో నిర్వహించిన ఫిట్‌నెస్ పరీక్షకు హాజరయ్యారు.

Comments

comments