Home తాజా వార్తలు తెర పడింది

తెర పడింది

LS Pollsబహిరంగ ప్రచారం ముగిసింది
14 సభల్లో ప్రసంగించిన కెసిఆర్
రోడ్‌షోలతో హోరెత్తించిన కెటిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికల సమరంలో కీలకమైన ప్రచార ఘట్టం ముగిసింది. తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా తొలి విడత ఎన్నికలకు ప్రచార గడువు మంగళవారం సాయంత్రం ముగిసింది. కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం పోలింగ్ ముగిసే 48 గంటల ముందే ప్రచారాన్ని ముగించాలి. దీని ప్రకారం 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకు, నిజామాబాద్‌లో సాయం త్రం 6 గంటలకు ముగియగా, రాష్ట్రంలోని మిగతా అన్ని చోట్ల 5 గంటలకే ప్రచారం ముగిసింది. గత కొన్ని రోజులుగా హోరెత్తించిన మైకులన్నీ మూగబోయాయి. సభలు, సమావేశాలు, ర్యాలీలకు ఫుల్‌స్టాప్ పడింది. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రచారాన్ని నోటిఫికేషన్ వచ్చిన నాటి నుంచి హోరెత్తించారు. గల్లీ, గల్లీకి తిరుగుతూ ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నించారు.

మార్చి 18వ తేదీ నోటిఫికేషన్ విడుదల కాగా ఏప్రిల్ 9 సాయంత్రం 5 వరకు దాదాపు 23 రోజుల పాటు ప్రచారం కొనసాగింది. టిఆర్‌ఎస్ తరపున ఆ పార్టీ అధినేత, సిఎం కెసిఆర్ ఒక్కరే అసెంబ్లీ ఎన్నికల మాదిరి అన్నీ తానై వ్యవహరించారు. పార్టీ ప్రచార బాధ్యతలు తనపైనే వేసుకుని రాష్ట్రమంతా సుడిగాలిలా చుట్టేశారు. ఏకంగా 14 బహిరంగ సభల్లో పాల్గొని ప్రసంగించారు. ఆయనకు టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తోడ్పాటునందించారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఎంఎల్‌ఎలందరూ ప్రచారం చేశారు. అందరికీ సిఎం కెసిఆర్ మెజార్టీ టార్గెట్ పెట్టడంతో ఆ దిశగా ప్రచారం కొనసాగించారు. బిజెపి తరపున ప్రధాన మంత్రి నరేంద్ర మోడి రెండు ప్రచార సభల్లో పాల్గొన్నారు. ఆ పార్టీ అధ్యక్షులు అమిత్ షా కూడా రెండు రోజులు సుడిగాలి పర్యటన చేసివెళ్లారు. కేంద్ర మంత్రలు రాజ్‌నాథ్ సింగ్, సుష్మాస్వరాజ్, పురుషోత్తం రూపాలా ముఖ్యమంత్రులు యోగి అధిత్యానాథ్ వంటి హేమాహేమీలు కూడా వచ్చి ప్రచారం చేశారు.

ముఖ్యంగా మహబూబ్‌నగర్, నిజామాబాద్, సికింద్రాబాద్ ప్రాంతాల్లో బిజెపి అగ్రనేతల ప్రచారం కొనసాగింది. ఇక కాంగ్రెస్ తరపున ఎఐసిసి అధ్యక్షులు రాహుల్ గాంధీ ఒక్క రోజు జహీరాబాద్,నాగర్‌కర్నూల్, హుజుర్‌నగర్ ప్రచార సభలో మాత్రమే పాల్గొన్నారు. ఆ పార్టీ రాష్ట్ర ముఖ్య నేతలందరూ ఎవరికి వారు యమునా తీరే అన్నట్లు వ్యవహరించారు. ముఖ్యులే పోటీలో ఉండటంతో వారి నియోజకవర్గాల్లో ప్రచారానికి పరిమితమయ్యారు.

జాతీయ పార్టీలపై తుపాకీ ఎక్కుపెట్టిన కెసిఆర్

అసెంబ్లీ ఎన్నికలకు పూర్తి భిన్నంగా పార్లమెంట్ ఎన్నికల్లో కెసిఆర్ తన ప్రచారాన్ని కొనసాగించారు. ఈసారి జాతీయ పార్టీలపై మాటల తూటా లు పేల్చారు. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి దేశాన్ని పాలించిన కాం గ్రెస్, బిజెపిలు ఏం ఒరగబెట్టాయంటూ ప్రశ్నిస్తూ ప్రచారాన్ని హోరెత్తించారు. అభివృద్ధి చెందిన దేశాల గురించి ప్రస్తావిస్తూ, భారత్ ఇంకా వెనకబడిపోవడానికి గల కారణాలను ఓటర్ల మధ్యనే విశ్లేషించి, ఆకట్టుకునే ప్రయత్నంచేశారు. ఇద్దరు ఎంపిలతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించామని, 16 స్థానాల్లో గెలిపిస్తే కేంద్రాన్ని శాసిస్తామంటూ ప్రజల్లోకి చొచ్చుకుపోవడంతో విజయవంతమయ్యారు.

అదే సమయంలో రాష్ట్రం లో ఎన్నికల కోడ్ ముగిసిన తరువాత కఠిన నిర్ణయాలుంటాయని రైతుల పక్షాల నిలబడాతనని, కొత్త రెవిన్యూ చట్టం తీసుకువస్తానంటూ చెప్పడంతో అన్నదాతలంతా టిఆర్‌ఎస్‌వైపు మొగ్గుచూపుతున్నారు. ఈ ప్రచార సభల్లో బిజెపిని సిఎం కెసిఆర్ ఏకిపారేశారు. ఇక టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ గ్రేటర్ హైదరాబాద్‌లో విస్తృతంగా పర్యటించి ప్రచారం చేశారు. మంత్రులు తమకు అప్పగించిన పార్లమెంట్ స్థానాల్లో ప్రచారం చేశారు.

Campaigning Ends for 1st Phase of LS Polls