Home ఎడిటోరియల్ సంపాదకీయం : అమిత్ షా మాంత్రికుడా?

సంపాదకీయం : అమిత్ షా మాంత్రికుడా?

Sampadakeeyam-Logo

బిజెపి అధ్యక్షుడు అమిత్‌షా దేశయాత్రలో భాగంగా సోమవారం తెలంగాణ రాష్ట్రానికి వచ్చారు. మూడురోజుల పర్యటనలో రెండ్రోజులు పైగా నల్గొండ జిల్లాలో పార్టీ కార్యక్రమాలకు కేటాయించారు. 25వ తేదీ ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వెళతారు. బిజెపి యేతర రాష్ట్రాల్లో పార్టీని పటిష్టం చేయటం, 2019 ఎన్నికలకు పార్టీ యంత్రాంగాన్ని బూత్‌స్థాయి వరకు నిర్మించటం ధ్యేయంగా ఆయన పశ్చిమబెంగాల్‌నుంచి దేశ పర్యటన ప్రారంభించారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బిజెపిని తిరిగి అధికారంలోకి తేవటం, కాంగ్రెస్ ముక్త్ భారత్‌ను సాధించటం, ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలను వీలైతే గెలుచుకోవటం లేదా ఆ పార్టీలను లొంగదీసుకోవటం బిజెపి లక్షం. అయితే బలమైన ప్రాంతీయ పార్టీలు బిజెపి ఎదుగుదలను నిరోధిస్తున్న వాస్తవం విస్మరించ రానిది. ఆ పార్టీలు అనుసరిస్తున్న కేంద్రంతో దోస్తీ, రాష్ట్రాల్లో కుస్తీ కూడా బిజెపిని నిరోధిస్తున్నది.
అగ్రవర్ణాల పార్టీగా ముద్ర ఉన్న బిజెపి తన పునాదిని విస్తరించుకునేందుకు ఒబిసిలను, ముఖ్యంగా వారిలో అత్యంతవెనుకబడిన కులాలను, దళితులను ఆకర్షించటం అనే వ్యూహాన్ని అనుసరిస్తున్నది. అది ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో అనూహ్య మైన ఫలితమిచ్చినందున దాన్ని దేశమంతటికీ విస్తరించే ప్రయత్నం చేస్తున్నారు. అమిత్‌షా కార్యక్రమాల్లో దళితులతో సహపంక్తి భోజనం ఆ వ్యూహంలో భాగమే. పశ్చిమబెంగాల్‌లో పార్టీ నాయకులు అలా భోజన ఏర్పాట్లు చేయించిన దళిత కుటుంబం ఆ మరునాడు తృణమూల్ కాంగ్రెస్‌లోచేరి, బిజెపివారు తమ చేత బలవంతంగా భోజన ఏర్పాట్లు చేయించారని ఆరోపించారు. ఇటువంటి నాటకీయ తలు ఈ దేశంలో కొత్తేమీ కాదు. సహపంక్తి భోజనానికి బదులు షా గారు దళితులను దేవాలయ ప్రవేశం చేయిస్తే వారు సంతోషిస్తారు, ఆత్మగౌరవం పెరుగుతుంది, పార్టీపట్ల విశ్వాసం పాదుకొంటుంది. గోరక్షణ పేరుతో దళితులపై, మైనారిటీలపై బిజెపి పాలిత రాష్ట్రాల్లో దాడులు జరుగుతుండగా ఇక్కడ సహపంక్తి భోజనం చేస్తే దళితులు మోసపోతారా? అమిత్‌షా పశ్చిమబెంగాల్ పర్యటన తరువాతనే డార్జిలింగ్ తదితర మున్సిపల్ ఎన్నికల్లో బిజెపి లేదా అది బలపరిచిన స్థానిక పార్టీ చిత్తయినాయి. ఒకట్రెండు పర్యటనలతో బిజెపిని పటిష్టం చేయటానికి అమిత్‌షా మాంత్రికుడు కాదు, ఆయన వద్ద అల్లా ఉద్దీన్ అద్భుతం దీపం లేదు.
దక్షిణాది రాష్ట్రాల పరిస్థితి మరీ ప్రత్యేకం. కర్నాటకలో కాంగ్రెస్ పార్టీ, కేరళలో వామపక్ష ప్రజాతంత్ర సంఘటన, తమిళనాడులో ఎఐఎడిఎంకె, తెలంగాణలో టిఆర్‌ఎస్, ఆంధ్రప్రదేశ్‌లో టిడిపి అధికారంలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు కేంద్రప్రభుత్వంతో సఖ్యతకొరకు బిజెపితో పొత్తు నెరపుతున్నారు. ఈ పొత్తు బిజెపి విస్తరణకు ప్రతిబంధకమవుతున్నది. తెలంగాణ రాష్ట్రంలో బిజెపిది అయోమయ స్థితి. టిఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం తామేనని, వచ్చే ఎన్నికల్లో అధికారం తమదేనని రాష్ట్ర బిజెపి నాయకులు గంభీర ప్రకటనలు చేస్తున్నారు. అయితే టిఆర్‌ఎస్ ప్రభుత్వం నరేంద్రమోడీ ప్రభుత్వంతో సఖ్యతతో ఉండటంవల్ల వారుపరిపూర్ణ ప్రతిపక్షంగా పనిచేయలేక పోతున్నారు. తమిళనాడులో ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఆ పార్టీ రెండు గ్రూపులపై పట్టుకొరకు బిజెపి పావులు కదుపుతోంది. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు కీలకపాత్ర పోషిస్తున్నారు. వచ్చే సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలున్న కర్నాటకలో ఒకసారి చేతికి వచ్చి చేజారిన అధికారాన్ని తిరిగిపొందేందుకు బిజెపి వ్యూహరచన చేస్తోంది. అక్కడ కాంగ్రెస్ వలె బిజెపి కూడా ముఠా రాజకీయాలతో సతమతమవుతున్నది.
దక్షిణాది, తూర్పు రాష్ట్రాల్లో బిజెపి వ్యూహాలు ఫలించేందుకు ప్రాతిపదికలు లేవు. అయితే అమిత్‌షా నిర్మాణ దక్షణతను తక్కువ అంచనా వేయరాదు. మత విభజన రాజకీయాలతో పాటు నియోజకవర్గాలవారీ కుల ఓట్ల గణనతో తమకు అనుకూల మైన పొందికలను సాధించటంలో దిట్ట. ఏమైనా, అధ్యక్షుని పర్యటన రాష్ట్ర బిజెపిలో కొత్త ఉత్సాహం తెస్తుందనటంలో సందేహం లేదు.