Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

ఈ సారైనా ఇంగ్లాండ్ ముచ్చట తీరేనా!

England-Team

మన తెలంగాణ క్రీడా విభాగం : సొంతగడ్డపై జరుగుతున్న ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లాండ్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. కలిసి వచ్చే సొంత మైదానాలకు తోడు ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేయగలిగే ఆల్‌రౌండర్లు ఇంగ్లాండ్‌కు అందుబాటులో ఉన్నారు. గతంలో రెండు సార్లు ఫైనల్లో ఓటమి పాలైన ఇంగ్లాండ్ ఈసారి ఎలాగైన కప్పును గెలవాలనే పట్టుదలతో ఉంది. 2013 ఫైనల్లో భారత్ చేతిలో కేవలం ఐదు పరుగుల తేడాతో ఇంగ్లాండ్ ఓటమి పాలైన విషయం తెలింసిందే. అంతేగాక, 2004 ఫైనల్లో వెస్టిండీస్ చేతిలో రెండు వికెట్ల తేడాతో పరాజయం చవిచూసింది. రెండు సార్లు కూడా కప్పు అందినట్టే అంది చేజారింది. ఈసారి మాత్రం ఎటువంటి పొరపాట్లకు తావివ్వకుండా ట్రోఫీని అందుకోవాలని ఇంగ్లాండ్ తహతహలాడుతోంది. సొంత అభిమానుల మధ్య జరిగే ఈ ఛాంపియన్‌షిప్‌లో మెరుగైన ఆటతో విజేతగా నిలువాలనే పట్టుదలతో ఉంది. బెన్ స్టోక్స్, క్రిస్ వోక్స్, మోయిన్ ఖాన్ వంటి అగ్రశ్రేణి ఆల్‌రౌండర్లు జట్టుకు అందుబాటులో ఉన్నారు. ఇటీవల ముగిసిన ఐపిఎల్‌లో బెన్ స్టోక్స్ అసాధారణ ఆల్‌రౌండ్ నైపుణ్యంతో పుణెను ముందుకు నడిపించాడు. లీగ్ మ్యాచుల్లో పుణె విజయాల్లో స్టోక్స్ పాత్ర చాలా కీలకమైంది. ఇటు బ్యాట్‌తో అటు బంతితో స్టోక్స్ చెలరేగి పోయాడు. ఛాంపియన్స్ ట్రోఫీలోనూ జట్టు అతనిపై భారీ ఆశలు పెట్టుకుంది. వోక్స్ కూడా మెరుగైన ఆల్‌రౌండర్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఎటువంటి బ్యాటింగ్ లైనప్‌నైన కట్టడి చేసే సత్తా అతనికుంది. ఇక, మోయిన్ ఖాన్ కూడా ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. వన్డేల్లో మంచి ఓపెనర్‌గా మోయిన్ పేరు తెచ్చుకున్నాడు. ఈ మెగా టోర్నమెంట్‌లో కూడా చెలరేగాలనే పట్టుదలతో ఉన్నాడు.
బ్యాటింగ్‌లోనూ…
ఇక, బ్యాటింగ్‌లో కూడా ఇంగ్లాండ్ చాలా పటిష్టంగా ఉంది. జోస్ బట్లర్, అలెక్స్ హేల్స్, బైర్‌స్టో, కెప్టెన్ మోర్గాన్, జోయ్ రూట్, జాసన్ రాయ్‌లతో కూడిన బలమైన బ్యాటింగ్ లైనప్ జట్టుకు అందుబాటులో ఉంది. అంతర్జాతీయ క్రికెట్‌లో జోస్ బట్లర్ విధ్వంసక బ్యాట్స్‌మన్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఇప్పటికే నాలుగు సెంచరీలు సాధించిన బట్లర్ వేగంగా ఆడడంలో దిట్ట. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా అతని సొంతం. ఓపెనర్ హేల్స్‌కే కూడా వన్డేల్లో మెరుగైన రికార్డు ఉంది. ఎటువంటి బౌలింగ్ లైనప్‌నైన సమర్థంగా ఎదుర్కొనే సత్తా అతనికుంది. రూట్‌ను కూడా తక్కువ అంచన వేయలేం. క్లిష్ట సమయాల్లో అద్భుత బ్యాటింగ్‌తో జట్టును ఆదుకోవడంలో ముందుంటాడు. కెప్టెన్ మోర్గాన్ కూడా ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కలవాడే. అతను కుదురు కుంటే భారీ స్కోరు సాధించడం జట్టుకు కష్టమేమి కాదు. శామ్ బిల్లింగ్స్, జాసన్ రాయ్, బైర్‌స్టోలు కూడా మంచి ఇన్నింగ్స్‌లు ఆడేందుకు సిద్ధంగా ఉన్నారు. ఆదిల్ రషీద్ కూడా ఇటు బ్యాట్‌తో అటు బంతితో సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో మెరుగ్గా ఉన్న ఇంగ్లాండ్‌కు సొంత గడ్డపై ఆడనుండడం అదనపు బలాన్ని ఇస్తోంది. దీంతో ప్రతిష్టాత్మకమైన ఛాంపియన్స్ ట్రోఫీలోని ఫేవరెట్ జట్లలో ఒకటిగా దీన్ని విశ్లేషకులు అంచన వేస్తున్నారు.

Comments

comments