Home ఎడిటోరియల్ వాల్‌మార్ట్ వల్ల మనకు నష్టమా?

వాల్‌మార్ట్ వల్ల మనకు నష్టమా?

edit

వాల్‌మార్ట్ ఇటీవల ఫ్లిప్‌కార్ట్‌ను 1.42 లక్షల కోట్ల పెట్టుబడితో కొనుగోలు చేసింది. ఈ ప్రకటన వెలువడిన తర్వాతి నుంచి ఈ వ్యాపారం లావాదేవీని అనేకమంది తీవ్రంగా విమర్శించడం ప్రారంభమైంది. విచిత్రమేమంటే, వామపక్షాల నుంచి మాత్రమేకాదు, కుడిపక్షాల నుంచి కూడా ఇదే విధమైన వాదన వినిపించింది. ఈస్ట్ ఇండియా కంపెనీ మళ్లీ వచ్చేసిందని, భారతదేశాన్ని మరోసారి వలసరాజ్యంగా మార్చడానికి ఈ కామర్స్ మార్కెట్లు తయారవుతున్నాయని బలంగా వాదించడం ప్రారంభించారు. వాల్‌మార్ట్ వంటి సంస్థ అడుగుపెట్టిన తర్వాత సంప్రదాయికంగా భారతదేశంలో నడిచే కిరాణాకొట్లు ఇక కనబడవని కొందరు జోస్యం చెప్పారు.
వాల్‌మార్ట్ ప్రపంచంలో అతిపెద్ద కంపెనీ. ఏటా 34 లక్షల కోట్ల రెవెన్యూ ఉన్న కంపెనీ. ఇది రిలయన్స్ కన్నా ఎనిమిది రెట్లు పెద్దది. ఒడాఫోన్, ఐడియా మెర్జర్ తర్వాత ఫ్లిప్‌కార్టును వాల్‌మార్ట్ సొంతం చేసుకోవడం ఒక మంచి పరిణామం. ఫ్లిప్‌కార్టు విలువ 21 బిలియన్ డాలర్లుగా వాల్‌మార్ట్ లెక్కకట్టింది. చైనాకు చెందిన రెండు కంపెనీలు అలీబాబా, టెంసెంట్ ఒక్కోటి దాదాపు 34 లక్షల కోట్ల రూపాయల కంపెనీలు. ఆపిల్ కంపెనీ విలువ 64 లక్షల కోట్ల రూపాయలు. అమెజాన్ విలువ 47 లక్షల కోట్ల రూపాయలు. వాల్‌మార్ట్ట్ మార్కెట్ విస్తరణ, సామర్థ్యం లభిస్తే త్వరితంగా మార్కెటులో వ్యాపించే ఫోన్‌పే, మింత్రవంటి డివిజన్లు ఫ్లిప్‌కార్టులో ఉన్నాయి. అమెరికాకు చెందిన వాల్‌మార్ట్ట్ మరో 20 వేల కోట్ల రూపాయల పెట్టుబడి ఫ్లిప్‌కార్టులో పెడతానని ప్రకటించింది. ఫ్లిప్ కార్ట్ వ్యవస్థాపకులు బిన్ని బంసాల్, కల్యాణ్ కృష్ణమూర్తి ఇప్పుడు కూడా ఫ్లిప్‌కార్టును నిర్వహించడంలో కొనసాగుతుంటారు.
ఫ్లిప్‌కార్టును సొంతం చేసుకోడానికి వాల్‌మార్ట్ చెల్లించిన సొమ్ము విదేశీ షేర్ హోల్డర్లకు చేరుతుందని కొందరు విమర్శకులు అంటున్నారు. కాని వాల్‌మార్ట్ట్ ఈ కొనుగోలు చేయడం వల్ల అనేక ఇతర లాభాలు కూడా ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్టు ఉన్న ఒక అమెరికన్ కంపెనీ భారత ఆర్థిక వ్యవస్థపట్ల చూపించే నమ్మకానికి ఇది నిదర్శనం. ఈ వార్త ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో వివిధ కంపెనీల బోర్డు రూముల్లో ప్రతిధ్వనిస్తుంది. భారతదేశానికి పెట్టుబడులు రావడానికి ఉపయోగపడే వాతావరణ ఏర్పడుతుంది. అందరూ భయపడుతున్నట్లు వాల్‌మార్ట్ రావడం వల్ల భారతదేశంలో చిన్నచితక వ్యాపారాలు మూతపడతాయా అన్నది ఆలోచించవలసిన విషయం.
అలా జరిగే అవకాశాలు లేవు. ఉదారీకరణ తర్వాత విదేశీ పెట్టుబడులు వచ్చాయి. వాటివల్ల స్థానిక వ్యాపారాలకు ప్రయోజనమే కలిగింది కాని నష్టం కలగలేదు. మెక్ డోనాల్డ్ ఇరవై ఏళ్ళ క్రితం వచ్చనప్పుడు దానివల్ల భారతదేశంలో చిన్నచిన్న హోటళ్ళు నాశనమైపోతాయనుకున్నారు. మెక్ డోనాల్డ్ భారతదేశానికి తగిన విధంగా మారవలసివచ్చింది. వెజిటేరియన్ బర్గర్లు ప్రవేశపెట్టింది. మరోవైపు చిన్నచిన్న భారతీయ హోటళ్ళు కూడా అభివృద్ధి చెందాయి. కోకాకోలా పార్లే సాఫ్ట్ డ్రింకులను కొనేసినప్పుడు కూడా చాలా మంది భయపడ్డారు. కాని కోకాకోలాకు భారతీయ సాఫ్ట్ డ్రింకులు గట్టి పోటీ ఇస్తున్నాయి.
ఒక అంచనా ప్రకారం 2025 నాటికి భారతదేశంలో బిలియన్ అంటే 100 కోట్ల ఇంటర్నెట్ కనెక్షన్లు ఉంటాయి. దీనివల్ల ఫ్లిప్ కార్ట్, పేటిఎం వంటి కంపెనీలకు చాలా లాభం కలుగుతుంది. పేటిఎంలో ఎక్కువ పెట్టుబడులు పెట్టిన అలీబాబా, దాని భాగస్వామి యాంట్ ఫైనాన్షియల్ కలిసి పేటిఎంలో 50 శాతం వాటా కలిగి ఉన్నాయి. మరో 38 శాతం వాటాలు జపాను తదితర దేశాల పెట్టుబడిదారులవి. అంటే పేటిఎం నిజానికి విదేశీ యాజమాన్యంలో ఉందనే చెప్పాలి. దానివల్ల సమస్య ఏమైనా ఉందా? ఏమీ లేదు.
నిజం చెప్పాలంటే భారతదేశంలో ఎడ్వర్టయిజింగ్ పరిశ్రమ మొత్తం విదేశీ యాజమాన్యంలో ఉంది. ఈ రంగంలో 100 శాతం విదేశీ పెట్టుబడులు అనుమతించిన తర్వాతి నుంచి ఇదే పరిస్థితి. ఐపియల్ ప్రసారం చేసే స్టార్ స్పోర్ట్ యజమాని రూపోర్ట్ ముర్డోక్. ఆయన తన ఫాక్స్ న్యూస్ డిస్నీకి అమ్మాలనే ఆలోచనలో ఉన్నాడు. డిస్నీ భారతదేశంలో అనేక ఎంటర్‌టైన్‌మెంట్, సినిమా చానళ్ళు నడుపుతోంది. క్లుప్తంగా చెప్పాలంటే భారతదేశంలో కంపెనీలకు విదేశీయాజమాన్యం ఉండడం చాలా మామూలు విషయం. ఒడాఫోన్ నుంచి హిందూస్తాన్ యూనిలివర్ వరకు విదేశీ యాజమాన్యం ఉన్నవే. ఈ కంపెనీలు భారతీయులకు ఉద్యోగాలిచ్చాయి. చిన్న వ్యాపారులు, సరఫరాదారులకు అవసరమైన వాతావరణాన్ని సృష్టించాయి. వినియోగదారులకు నాణ్యమైన వస్తువులు అందుబాటులోకి తెచ్చాయి. నాణ్యమైన సేవలందించాయి.
సింగపూరుకు చెందిన బ్రాడ్ కాం కంపెనీ అమెరికాకు చెందిన క్వాల్ కామ్ కొనాలనుకున్నప్పుడు డోనాల్డ్ ట్రంప్ అడ్డుపడ్డాడని కొందరు ఉదహరిస్తున్నారు. క్వాల్ కాం అనేది చైనా కంపెనీ హువాయికి వైరి సంస్థ. కొత్తతరం వైర్‌లెస్ టెక్నాలజీకి చెందిన సంస్థ. క్వాల్ కాం వంటి కంపెనీ బ్రాడ్ కాం చేతుల్లో పడితే అమెరికా టెక్నాలజీ చైనా చేతుల్లోకి వెళ్ళిపోతుందని ట్రంప్ భయపడ్డాడు. ఇది ఒక ప్రత్యేకమైన పరిస్థితి. హై సెక్యూరిటీ రంగాలను వదిలేస్తే ప్రపంచంలో అమెరికా అత్యంత ఓపెన్ ఎకానమీల్లో ఒకటి.
సిలికాన్ వ్యాలీ ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడులకు స్వాగతం పలుకుతుంది. విదేశీ కంపెనీలు ఇన్‌ఫ్రాస్టక్చర్ కట్టిస్తే, బ్రిడ్జిలు, హైవేలు, ఫ్యాక్టరీలు, నివాస గృహాలు, మెట్రోలు, సీ లింకులు అవన్నీ భారతదేశంలోనే ఉండిపోతాయి. భారతదేశాన్ని బ్రిటీషువారు పాలించినప్పుడు భారతీయుల పన్నులను, శ్రమశక్తిని వారు దోచుకున్నారు. ఇప్పడు భారతదేశంలో విదేశీ పెట్టుబడి ప్రపంచ నిధులను ఇక్కడికి తరలిస్తుంది. ఇవి భారతదేశానికి ప్రయోజనకరం. ఉద్యోగస్తులు, కస్టమర్లు, సరఫరాదారులు, చిరువ్యాపారులు ఇలా అనేకమందికి ప్రయోజనాలుంటాయి.
భారతదేశంలో విదేశీ పెట్టుబడులపై వామపక్షాలు ఎంత తీవ్రం గా విమర్శలు సంధిస్తున్నాయో, ఇతర పక్షాలుకూడా అంతే తీవ్రంగా విమర్శిస్తున్నాయి. చైనా, రష్యా దేశాలు ఓపెన్ మార్కెట్లకు స్వాగతం పలుకుతున్నప్పటికీ ఇక్కడ కమ్యూనిస్టులు ఓపెన్ మార్కెట్లను వ్యతిరేకిస్తున్నారు. ఆర్‌ఎస్‌ఎస్ వంటి సంస్థలు విదేశీ పెట్టుబడులను వ్యతిరేకిస్తున్నాయి. దీనివల్ల భారత ఆర్థికవ్యవస్థ దెబ్బతింటుందన్న అపోహలో ఉన్నాయి. భారత ఆర్థికవ్యవస్థ పివి నరసింహరావు, మన్మోహన్ సింగ్‌ల ఉదారీకరణ చర్యల తర్వాతి నుంచి చాలా మార్పులకు గురైంది. ఇప్పుడు అంతర్జాతీయ కంపెనీలు హోండా, టయోటా, ఒడాఫోన్, ఐబిఎం వంటివి ఇక్కడి మార్కెట్టులో ప్రవేశించాయి. ఒకప్పుడు అంబాసిడర్ మాత్రమే కనిపించే రోడ్లపై ఇప్పుడు పోటీ పెరిగింది. కేవలం ల్యాండ్ లైన్లు ఫోనులు మాత్రమే ఉపయోగించే కాలం నుంచి ఒక్కసారిగా మొబైల్ అయిపోయింది. 1991లో కేవలం 6లక్షల కోట్ల రూపాయల జిడిపి నుంచి నేడు 180 లక్షల కోట్ల రూపాయల జిడిపి అయ్యింది. విదేశీపెట్టుబడుల వల్ల భారత కంపెనీలు, వ్యాపారాలు దెబ్బతింటాయని భావించడం పొరబాటు. ఈస్ట్ ఇండియా కంపెనీ కాలం నాటి వలసపాలన భయాలను వదులుకోవాలి. ఇప్పుడు భారత మార్కెట్టు నిజానికి ప్రపంచాన్ని రివర్స్ కాలనైజేషన్ చేస్తోంది. ఇది గమనించవలసిన మార్పు.