Home తాజా వార్తలు రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో ఫలితం ఇవ్వని షిఫ్ట్ పద్ధతి…

రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో ఫలితం ఇవ్వని షిఫ్ట్ పద్ధతి…

Registrar-Officesతగ్గిన దస్తావేజుల నమోదు

మందుబాబులతో ఇబ్బందులు పడుతున్న ఉద్యోగులు
రద్దు చేయాలని ప్రభుత్వానికి ఆ శాఖ కమిషనర్ సిఫారసు
అనుమతి రాగానే సాధారణ వేళల్లో విధులు

హైదరాబాద్ : సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌ల్లో షిఫ్ట్ పద్ధతి రద్దు చేయాలని ఉన్నతాధికారులు యోచిస్తున్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభతరం చేయాలన్న ఉద్ధేశంతో బోయిన్‌పల్లి, మారేడ్‌పల్లి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో ప్రయోగాత్మకంగా ప్రభుత్వం అమలు చేసిన షిప్ట్ పద్ధతి వలన పెద్దగా ప్రయోజనం లేదని స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు గుర్తించారు. మళ్లీ సాధారణ వేళల్లో కార్యాలయాలు పనిచేసే విధానాన్ని తీసుకురావాలని అక్కడి సబ్ రిజిస్ట్రార్‌లు పేర్కొనడంతో ఉన్నతాధికారులు దానిని రద్దు చేసే దిశగా చర్యలు ప్రారంభించారు. ఐదేళ్ల క్రితం ప్రభుత్వం ఎనీవేర్ రిజిస్ట్రేషన్ విధానం అమలు చేసిన సమయంలో రాష్ట్రంలోనే ప్రయోగాత్మకంగా నగరంలోని రెండు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులను ఎంపిక చేసి షిఫ్ట్ పద్ధతికి శ్రీకారం చుట్టింది.

మొదటి షిఫ్ట్‌లో బోయిన్‌పల్లి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం 2:30గంటల వరకు, రెండో షిఫ్ట్‌లో మారేడ్‌పల్లి కార్యాలయం మధ్యాహ్నం 2:30గంటల నుంచి రాత్రి 9గంటల వరకు పని చేస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఈ షిఫ్ట్ విధానాన్ని విస్తరించాలని భావించినప్పటికీ అది పూర్తి స్థాయిలో అమలుకు నోచుకోలేదు. సాయంత్రం సమయంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని, మద్యంబాబులు సబ్ రిజిస్ట్రార్లకు ఇబ్బందులు సృష్టిస్తున్నారని ఆ శాఖ అధికారులకు అందిన నివేదికలో పొందుపరిచారు. దీంతోపాటు దస్తావేజుల నమోదు కూడా నామమాత్రంగా మారడంతో షిఫ్ట్ విధానాన్ని రద్దు చేయాలని రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్‌ల శాఖ కమిషనర్ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినట్టు తెలిసింది. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే షిఫ్ట్ విధానాన్ని రద్దు చేసి, సాధారణ వేళల్లో కార్యకలాపాలు కొనసాగించనున్నట్టు సమాచారం.

రెండో షిఫ్ట్ ఉద్యోగులకు కొంత ఊరట

ఈ విధానం వలన రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం పెరగకపోయినా దస్తావేజుదారులకు మాత్రం కలిసొచ్చింది. రెండు షిఫ్టుల్లో సాధారణ పనివేళల మాదిరిగానే దస్తావేజుల నమోదు కొనసాగుతోంది. ముఖ్యంగా రెండో షిఫ్ట్ ఉద్యోగులకు దీనివలన కొంత ఊరట కలిగింది. ఉదయం సమయంలో కేవలం మంచిరోజుల్లో తప్పితే సాధారణ రోజుల్లో దస్తావేజుదారులు రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి పెద్దగా ముందుకు రావడం లేదని ఆ శాఖ అధికారులు గుర్తించారు. దీంతో సిబ్బంది తొలి రెండు గంటలు ఖాళీగా ఉంటున్నారు. వాస్తవంగా సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల షిఫ్ట్ పద్ధతితో క్రయ, విక్రయదారులకు సమయం కలిసొచ్చినా, డాక్యుమెంటేషన్ పూర్తి చేసే సరికి ఆలస్యమవుతోంది. దీంతో రిజిస్ట్రేషన్‌ను మరో రోజుకు వాయిదా వేసుకోవాల్సి వస్తోంది.

అయితే ఎనీవేర్ రిజిస్ట్రేషన్లతో షిఫ్ట్ పద్ధతి అమలు కావడంతో దరఖాస్తుదారులకు మరింత కలిసొ చ్చింది. ఒకే రోజు రిజిస్ట్రేషన్లు పూర్తి చేసుకునే వెసులుబాటు ఉండేది. ఉదయం వేళలో పనిచేసే బోయిన్‌పల్లి కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌లు కొంత తగ్గినా మధ్యాహ్నం వేళలో పనిచేసే మారేడ్‌పల్లిలో రిజిస్ట్రేషన్లు పెరిగాయి. మొత్తం మీద ఉద్యోగులు సెలవు పెట్టకుండానే ఉదయం, రాత్రి వేళల్లో రిజిస్ట్రేషన్ చేయించుకునే వెసులుబాటు ఉండేది. ఎనీవేర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ లేని కారణంగా కొన్ని రోజులుగా షిఫ్ట్ విధానంలో దస్తావేజుల నమోదు తగ్గుముఖం పట్టిందని, దీంతో షిఫ్ట్ విధానాన్ని రద్దు చేయాలని రిజిస్ట్రేషన్ల శాఖ నిర్ణయం తీసుకున్నట్టు ఆ శాఖ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు.

Cancel Shift method in Sub Registrar Offices