Home అంతర్జాతీయ వార్తలు సింగపూర్ చర్చలు రద్దు

సింగపూర్ చర్చలు రద్దు

trump

 అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన నిర్ణయం
 ఉ.కొరియా అణు పరీక్షా కేంద్రాన్ని ధ్వంసం చేసిన కొద్ది గంటలకే ప్రకటన

వాషింగ్టన్: అమెరికా,-ఉత్తర కొరియాల మధ్య వచ్చే నెల 12న సింగపూర్‌లో జరగాల్సిన సమావేశం రద్దయింది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమావేశంపై గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాల కారణంగా నీలినీడలు కమ్ముకున్నాయి. కాగా ఈ సమావేశాన్ని రద్దు చేసుకున్నట్లుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తేల్చి చెప్పారు. ఈమేరకు గురువారం శ్వేతసౌధం(వైట్‌హౌస్) ఒక ప్రకటన విడుదల చేసింది. ఉత్తర కొరియా తన అణు పరీక్షా కేంద్రాన్ని ధ్వంసం చేసినట్లుగా ప్రకటించిన కొద్ది గంటలకే ట్రంప్ ఉత్తర కొరియా నేత కిమ్‌తో జరగాల్సిన సమావేశాన్ని రద్దు చేసుకున్నట్లు ప్రకటించడం గమనార్హం.‘ మీతో సమావేశం కావాలని నేను ఎంతో అతురతతో ఎదురు చూశాను. అయితే, దురదృష్టవశాత్తు ఇటీవల మీరు చేసిన ప్రకటనల్లో అమెరికా పట్ల విపరీతమైన ద్వేషభావం, బహిరంగంగా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో దీర్ఘకాలంగా ఎదురు చూస్త్తున్న ఈ భేటీ అనవసరమనిపించింది’ అని కిమ్‌నుద్దేశించి ట్రంప్ అన్నారు.
అణుపరీక్షలతో ప్రపంచాన్ని హడలెత్తిస్తున్న ఉత్తర కొరియాను దారికి తెచ్చేందుకు అమెరికా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. దీనిలో భాగంగానే ఆ దేశంతో చర్చలను తేరమీదికి తీసుకొచ్చింది. ఈ వ్యూహంలో భాగంగా మెదట ఉభయ కొరియాల నేతలు సమావేశమైనారు. అనంతరం ట్రంప్‌తో భేటీ కావాలని నిర్ణయించారు. అయితే ఉత్తర కొరియాతో భేటీకి అమెరికా కొన్ని షరతులు విధించింది. ఉత్తరకొరియా అణు కార్యక్రమాలను నిలిపివేయకపోతే సమావేశం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉందడని స్పష్టం చేసింది. అయితే అణ్వాయుధాలను వదిలివేయాలని మరింత ఒత్తిడి తెస్తే తాము చర్చలనుంచి వైదొలగుతామని ఉత్తర కొరియా హెచ్చరించింది. దీంతో ఇప్పట్లో చర్చలు జరక్క పోవచ్చన్న అనుమానాలను ట్రంప్ సైతం వ్యక్తం చేశారు. అంతే కాదు చైనా కారణంగానే ఉత్తర కొరియా వైఖరిలో మార్పు వచ్చిందని కూడా ఆరోపించారు.
+అయితే గురువారం వివిధ దేశాల విలేఖరుల సమక్షంలో ఉత్తరకొరియా తన అణ్వస్త్ర పరీక్షల కేంద్రాన్ని ధ్వంసం చేసింది. ఆది జరిగిన కొద్దిగంటలకే చర్చలను రద్దు చేసుకొంటున్నట్లు ట్రంప్ ప్రకటించడం గమనార్హం. అయితే భవిష్యత్తులో చర్చలు జరపాలని అనుకుంటే తనకు తెలియజేయాలని కూడా ఆయన ఆ ప్రకటనలో సూచించడం ద్వారా చర్చలకు తలుపులు పూర్తిగా మూపుకు పోలేదని తెలపడం విశేషం. అదే సమయంతో మీరు మీ అణ్వస్త్రా్తల గురించి చాలా మాట్లాడారని, అయితే తమ వద్ద ఉన్న అణ్వస్త్రాలు చాలా శక్తివంతమైనవని ట్రంప్ అంటూ, వాటిని ఎప్పటికీ ఉపయోగించాల్సిన అవసరం రాకూడదని దేవుడ్ని ప్రార్థిస్తూ ఉంటానని పరోక్షంగా కిమ్‌ను హెచ్చరించారు.