Home ఆఫ్ బీట్ క్యాన్సర్ కారకాలకు దూరంగా…!

క్యాన్సర్ కారకాలకు దూరంగా…!

Cancer Causes, Types, Treatment, Symptoms
ఆరోగ్యమే మహా భాగ్యం అన్నారు పెద్దలు. ఎంత సంపద ఉన్నా ఆరోగ్యం తర్వాతే .. అందుకే సరైన జీవన విధానం, పోషకాహారం తీసుకుంటూ వ్యాయామం చేస్తూ ఉంటే ఆరోగ్యానికి వచ్చిన ఢోకా ఏమీ ఉండదు. సమస్య వచ్చాక ఎదుర్కోవడం కంటే రాకుండా నివారించడమే ఉత్తమం. చిన్న చిన్న అనారోగ్యాలకే కాదు క్యాన్సర్ వంటి మహమ్మారికీ ఇదే సూత్రం వర్తిస్తుంది. వందశాతం అని కాకపోయినా, పూర్తి నివారణ అని చెప్పకపోయినా జీవనశైలిలో మార్పులు తప్పనిసరి అంటున్నారు వైద్య నిపుణులు. ఆరోగ్యంగా ఉండటం అనేది మన చేతుల్లోనే ఉంది.

రోజురోజుకీ చాపకింద నీరులా వ్యాపిస్తోంది క్యాన్సర్ మహమ్మారి. ఒక్కసారి దాని ప్రభావానికి గురైతే శారీరకంగా, మానసికంగా కుంగిపోతారు. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతారు. అందుకే ఈ సమస్య ఎదురయ్యాక కాకుండా.. రాక ముందే జాగ్రత్తలు తీసుకోవాలి. అపోహలు దూరం చేసుకుంటూ ఆరోగ్యకరమైన జీవనశైలి దిశగా అడుగులు వేయాలి.

మనం తీసుకునే ఆహారంలో మాంసకృత్తులూ, పీచు, యాంటీఆక్సిడెంట్లు అధికంగా లభించే పోషకాహారానికి ప్రాధాన్యమివ్వాలి. వాటిల్లో పాలూ, గుడ్లూ, పప్పూ, చికెన్, మటన్, రాజ్మా, బీన్స్, మష్రూమ్‌ల నుంచి మాంసకృత్తులు లభిస్తాయి. చిక్కుడు, బీన్స్, చిరుధాన్యాలు, కొబ్బరితో పాటు కాయగూరల్లో పీచు ఎక్కువగా దొరుకుతుంది. పీచు సరిపడా శరీరానికి సరిగా అందడం వల్ల జీర్ణవ్యవస్థ చురుగ్గా పనిచేస్తుంది. ఎందుకంటే పీచు అరగడానికి ఎక్కువ సమయం పడుతుంది. శరీరానికి వ్యాయామం ఎలానో.. జీర్ణవ్యవస్థకు పీచు అలా సాయపడుతుంది. ఇక యాంటీఆక్సిడెంట్ల విషయా నికొస్తే..ఇవి క్యాన్సర్ కారకాలను దూరం చేయడంలో ఉపయోగపడతాయి. అలా కానప్పుడు జీర్ణాశయ క్యాన్సర్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. పేగుల్లోనూ సమస్యలు రావచ్చు. వీటితో పాటు కొవ్వులూ, కార్బోహైడ్రేట్లు కూడా కలిగి ఉండే సమతులాహారం ఎంచుకోవాలి.
జంక్‌ఫుడ్‌తో ప్రమాదం..
రసాయనాలు ఉన్న ఆహారానికి దూరంగా ఉండాలి. అంటే శీతలపానీయాలు, ప్రిజర్వేటివ్‌లు కలిపిన టిన్ ఫుడ్, బేకరీ ఆహారం, నిల్వ ఉంచిన చీజ్, కృత్రిమ రంగులు కలిసిన పదార్థాలూ, నూనె, మసాలా ఆహారం, ఎక్కువసార్లు వాడిన నూనెతో చేసినవి. వీటిల్లో కార్సినోజిన్స్ (క్యాన్సర్ కారకాలు) ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి ఆహారానికి వీలైనంత దూరంగా ఉంటే మంచిది. ఇంటి ఆహారానికి ప్రాధాన్యమివ్వాలి. ధూమపానం, మద్యపానం వల్ల అన్ని రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశాలు ఎక్కువే. ధూమపానం వల్ల రక్తనాళాల్లో చేరిన పొగ గడ్డలుగా పేరుకుపోతుంది. పాన్, గుట్కా నమలడం వల్ల పళ్లూ, నోరూ, దవడ క్యాన్సర్‌లు వచ్చే అవకాశం ఉంది. ఈ రోజుల్లో చిన్నవయసు వారూ క్యాన్సర్ బారిన పడుతున్నారు. అధ్యయనాల ప్రకారం పదిమందిలో ఎనిమిది మంది ఈ అలవాట్లు ఉన్నవారే. నికోటిన్ కూడా ఈ సమస్యకు ప్రధాన కారణంగా చెబుతున్నారు నిపుణులు.
ఎవరెవరికి వచ్చే అవకాశం ఉందంటే….
* చిన్న వయసులో వివాహమైన వారికీ, ఎక్కువ మంది పిల్లల్ని కన్నవారికీ, సంతానంలేని వారికీ, పాలు ఇవ్వనివారికీ గర్భాశయ ముఖద్వార, ఎండోమెట్రియం, రొమ్ము క్యాన్సర్‌లు రావొచ్చు.
* ప్లాస్టిక్‌కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. నీళ్ల సీసాలను ఎక్కువ రోజులు ఉపయోగించకూడదు. ఎందుకంటే ఇవి ఎండా, వేడి ప్రభావానికి లోనై ఉంటాయి. దానివల్ల నిదానంగా వాటి నుంచి హానికారకాలు విడుదలవుతాయి. అలానే వేడి పదార్థాలు ఉంచిన డబ్బాలూ, గిన్నెల్లో కూడా ఇలానే జరుగుతుంది. పాలిథిన్, ప్లాస్టిక్ సంచులు డీగ్రేడ్ అయినప్పుడూ వాటి నుంచీ క్యాన్సర్ కారకాలు వెలువడి మన మీద ప్రభావం చూపుతాయి. అందుకే వాటన్నింటికీ దూరంగా ఉండాలి.
పరీక్షలు తప్పనిసరి..
నలభై ఏళ్లు పైబడిన వారు తప్పనిసరిగా క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలి. ఒకవేళ కుటుంబంలో ఎవరికైనా ఉంటే మాత్రం 30 ఏళ్ల నుంచే పరీక్షలు అవసరం. అలా ఏడాదికోసారి చేయిస్తూనే ఉండాలి. మన దేశంలో సర్వైకల్, బ్రెస్ట్, నోటి క్యాన్సర్ల బారిన ఎక్కువగా పడుతున్నారు. సర్వైకల్ క్యాన్సర్‌కి పాప్‌స్మియర్, వీఐఏ(విజువల్ ఇన్‌సెప్షన్ విత్ ఎసిటిక్ యాసిడ్) టెస్ట్‌లు ఉంటాయి. ఇందుకోసం మ్యూకస్ తీసుకుంటే సరిపోతుంది. రొమ్ముక్యాన్సర్ కోసం అవసరం అయితే మామోగ్రఫీ, సొనో మామోగ్రఫీ చేస్తారు. ఈ పరీక్షల వల్ల తొలి దశలోనే సమస్యను గుర్తించడం సాధ్యమవుతుంది. దానివల్ల నయమయ్యేలా చికిత్స తీసుకోవచ్చు. అలానే ఆడపిల్లలకు పెళ్లికి ముందు హెచ్‌పీవీ వ్యాక్సిన్లు ఆరునెలల వ్యవధిలో రెండు డోసులు ఇప్పించాలి. దీనివల్ల సర్వైకల్ క్యాన్సర్ 75 శాతం వచ్చే అవకాశం ఉండదు.
వ్యాయామం తప్పనిసరి సంతోషకరమైన జీవనశైలి ఉండేలా చూసుకోవాలి. ఎక్కువ సమయం కూర్చోకపోవడం మంచిది. ఒకవేళ అలాంటి ఉద్యోగాలు చేయాల్సి వస్తే ప్రతి అరగంటకోసారి లేచి బ్రిస్క్ వాక్ చేయాలి. ఇది హార్మోన్ల వ్యవస్థ మీద సానుకూల ప్రభావం చూపుతుంది. బ్రీతింగ్ వ్యాయామాలూ, యోగా, ధ్యానం చేయాలి. ఒత్తిడి లేకుండా చూసుకోవాలి.
క్యాన్సర్‌లో హార్మోన్ల పాత్ర మహిళ ఆరోగ్యం విషయంలో హార్మోన్ల పాత్ర చాలా కీలకం. గర్భనిరోధకాలు ఎక్కువ కాలం వాడినప్పుడు, వయసు పైబడే కొద్దీ, మెనోపాజ్ సమయంలో దీర్ఘ కాలం హార్మోన్లు రీప్లేస్‌మెంట్ చేయించుకున్నప్పుడు క్యాన్సర్ రావొచ్చు. అదీ ఎక్కువగా రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. ఈస్ట్రోజెన్ వల్ల సమస్యలు లేకపోవచ్చు గానీ దాని స్థాయిని బట్టి చికిత్సలు నిర్ణయిస్తారు వైద్యులు.
అపోహలు వద్దు
ఆరోగ్యపరంగా ఏ చిన్న ఇబ్బంది కలిగినా కొందరు అది క్యాన్సరేనని అపోహపడుతున్నారు. రాత్రీపగలు అవే ఆలోచనలతో కొత్త సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. –
*ఒత్తిడి ప్రత్యక్షంగా క్యాన్సర్ కారకం కాదు. ఇది శరీరంలో రోగనిరోధకశక్తిని తగ్గించి పరోక్షంగా కారణమవుతుంది.
* కుటుంబ సభ్యులకు క్యాన్సర్ ఉంటే రావాలని లేదు. కేవలం పదిశాతం మాత్రమే అందుకు ఆస్కారం ఉంటుంది. తొంభై శాతం ఎవరికైనా రావచ్చు.
* క్యాన్సర్‌ను శాశ్వతంగా నిర్మూలించొచ్చు. పైగా ఆత్మవిశ్వాసం ఉంటే సమస్యను త్వరగా పూర్తిస్థాయిలో జయించవచ్చు.
* రేడియేషన్ సమయంలో చర్మం కాలిపోతుందని అనుకుంటారు చాలామంది. ఇది కేవలం అపోహ. ఇప్పుడు చాలా ఆధునిక ఉపకరణాలు అందుబాటులోకి వచ్చాయి. సాంకేతికత కూడా తోడు కావడంతో ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండా చికిత్సలు తీసుకోవచ్చు.
* ఫోన్లు వాడితే క్యాన్సర్ వస్తుందని ఏ అధ్యయనాలూ రుజువు చేయలేదు. ఫోన్లు ఎలక్ట్రో మ్యాగ్నటిక్ రేస్‌ని ప్రసరింపచేస్తాయి తప్ప దాని వల్ల కణాల్లో తేడాలు రావు.

Cancer Causes, Types, Treatment, Symptoms

Telangana News