Home దునియా పది పాసయితేనే!

పది పాసయితేనే!

Tenth-Pass

“అయ్య! పేపరొచ్చింది” అంటూ వేసి వెళ్లాడు చంద్రుడు. సర్పంచ్ బంగారయ్య ఇంటికి ఒక్కటే పేపర్ వస్తుంది. బంగారయ్య చదివాకనే, ఊర్లో అందరు చదవాలి. చంద్రుడు మూడు కిలోమీటర్ల టౌన్‌కు వెళ్లి పేపర్ తెచ్చి ఇవ్వడం రోజూ ఆనవాయితి. బంగారయ్య నిమ్మళంగా వచ్చి కుర్చీలో కూలబడి, సిగరేట్ అంటించుకుని,పేపర్‌ను టేపర్‌ను నుంచి తీసుకుని హెడ్డింగ్ చూసి అలాగే అవాక్కయ్యాడు. బంగారయ్య సిగరెట్ ముందుర వెలగడం లేదు, నోట్లో నుంచి పొగరావడంలేదు.

బంగారయ్య దబ్బున లేచాడు. నోట్ల సిగిరెట్‌ను విసిరిపారేశాడు. చేతిలోని పేపర్‌ను ఇంట్లో బీరువాలో భద్రంగా దాచాడు. మళ్లీ బయటకు వచ్చి నిన్నటి పేపర్‌ను తిరగెయ్యసాగాడు. గేటుముందర యువకులు అయ్యా! పేపర్ చదివారా! ఓ సారి ఇస్తారా అని అడుగుతున్నారు.
ఈ రోజు పేపర్ తేలేదురా! నిన్నటి పేపర్ తిరగేస్తున్నాను. మీరు చదువుతారా నిన్నటిది అన్నాడు బంగారయ్య. పేపర్ లేదనే సరికి ఆస్తి అంతా కోల్పోయినట్లుగా బిక్కమొఖాలతో పొలంగట్లపైకి నడువసాగారు యువకులు. బంగారయ్యకు ఏం చెయ్యాలో తోచడం లేదు. పేపర్‌లోని హెడ్డింగ్ ఒక్కటే కళ్ళలో దగదగమెరుస్తుంది. అంతలోనే శ్రీమతి కమలమ్మ “ఏమండి! కాఫీ తెమ్మంటారా” అంటూ చిరునవ్వు నవ్వింది. బంగారయ్య కోపంగా కమలమ్మవైపు చూసి “నువ్వు పది పాస్ అయ్యావా” అన్నాడు.

“అయ్యో! పది పాస్ కావడమా”, నన్ను ఏడు లోనే ఆపి, నీకు ఇచ్చి పెండ్లి చేశారు. నువ్వు నన్ను చదువనిచ్చావా” అంది కమలమ్మ. ఊ,ఊ అంటూ రుసరుసలాడాడు బంగారయ్య. ‘ఏమండి మరి మీరు పది పాస్ అయ్యారా’ అంది కమలమ్మ. నేను ఎక్కడ పాస్ అయ్యాను ..“తొమ్మిదిలో నిన్ను పెండ్లి చేసుకోగానే, నా చదువు అటకెక్కింది. చచ్చిన నా అయ్య పది పాస్ కానియ్యలేదు” అంటూ కోపంతో కన్నెర్ర చేయడంతో బంగారమ్మ కళ్ళలో కన్నీళ్లు తిరుగుతున్నాయి.

కమలమ్మకు ఆశ్చర్యం వేసింది. బంగారయ్య సర్పంచ్‌గా పాతికేళ్ళనుండి ఊరిని పాలిసున్నాడు.మరి ఏమిటిలా, మహిళా రిజర్వేషన్ వచ్చినా కమలమ్మను సర్పంచ్ చేసి బంగారయ్య పెత్తనం చెలాయించాడు. ఎందుకిలా బంగారయ్య చిందులు తొక్కుతున్నాడో అర్థం కాలేదు కమలమ్మకు.
బంగారయ్యతో కమలమ్మ ఏదో చెప్పబోయింది. బంగారయ్య, కమలమ్మ చెయ్యి పట్టుకుని బీరువా దగ్గరకు తీసుకెళ్ళాడు. బీరువాలోంచి పేపర్ తీసి మెయిన్ హెడింగ్ చదివాడు.‘పది పాసయితేనే సర్పంచ్’ త్వరలోనే జీవో జారి అంటూ ఉంది. కమలమ్మ కూడా అవాక్కయింది. ‘ఏవండి త్వరలోనే వుందిగా అంతలో పది పాస్ కావొచ్చులే’ అంది కమలమ్మ.

ఇప్పుడా! ఇప్పుడు చదవడమా! అసాధ్యం అంటూ చిర్రుబుర్రులాడుతున్నాడు. అంతలోనే ఇంట్లో పనికి శాంతవ్వ కూతురు ముత్యాలు వచ్చింది. ఏమే ముత్యాలు ఏం చదివినావు అన్నది కమలమ్మ. అమ్మ నేను ఊర్లో పది పాసైనా, ఇపుడు డిగ్రీ చదువుతున్నాను అంది ముత్యాలు. “ఎప్పుడు ఇక్కడే వుంటావు! అట్లెట్లా చదువుతావు’ అంది కమలమ్మ. “అమ్మా! ఇంటికాడేవుండి చదువొచ్చు” డిగ్రీలు పొంది ఉద్యోగాలు పొందొచ్చు అంటూ ముత్యాలు వెళ్లిపోయింది.

కమలమ్మ బంగారయ్య వైపు చూడలేకపోయింది. పనిమనిషి కూతురు కూడా డిగ్రీలు చదువుతుంది. మరి, మరి అంటూ ఇస్త్రీ బట్టలతో ముస్తాబై కాఫీ, టిఫిన్‌లు మాని, కాళ్ళకు చెప్పులు, చేతిలో కర్రను మర్చిపోయి పదేండ్ల బాలుడోలే గబగబ బడివైపు పరుగులు పెడుతున్నాడు బంగారయ్య.
ఎప్పుడు పిలువనిది, రాని, సర్పంచ్ బంగారయ్య, వేగంగా బడిలోకి రావడంతో మాస్టర్‌లు గాబరా పడసాగారు. విద్యార్థుల చదువుల గూర్చి ఆరా తీస్తారా, సమయపాలనపై కోపగిస్తడా అనుకుంటూ తరగతి గదులలో బోధన చేస్తూ, ఒక చెవిని ఆఫీసు వైపు పంపించారు మాస్టార్. ప్రధానోపాధ్యాయుడు రండి సర్పంచ్‌గారు అంటూ స్వాగతం పలుకుతున్నారు.

వచ్చిరాని నవ్వులతో చిరునవ్వులతో చిరునవ్వులు చిందిస్తూ ఆఫీసు గదిలోకి ప్రవేశించాడు బంగారయ్య. ఆశ్చర్యం ఆఫీసు గదినిండా గ్రామస్థులే. సర్పంచ్ రాగానే లేచి నిల్చొని దండాలు పెట్టారు. బంగారయ్య గుండె దడదడలాడుతుంది. వీళ్ళంతా పది పాస్ కోసమేనే అనుకున్నాడు. అందరిని పలుకరించాడు. “మళ్ళీ వస్తాం మాస్టర్‌” అంటూ ఒక్కొక్కరుగా నెమ్మదిగా జారుకున్నారు. సర్పంచ్‌గారు మీరాక సంతోషం, చెప్పండి విశేషాలు అన్నాడు ప్రధానోపాధ్యాయులు. బడిలో పిల్లలు బాగా చదువుతున్నారా! ఏమైనా అవసరాలు ఉన్నాయా అంటూ ఆరా తీయసాగాడు బంగారయ్య. ప్రధానోపాధ్యాయులు సమాధానాలు చెప్పుతూ నవ్వుతున్నారు. తోటి ఉపాధ్యాయులు ఒక్కొక్కరుగా వస్తూ బంగారయ్యకు నమస్కరిస్తూ, మంచినీళ్ళు తాగుతున్నట్లుగా పోతూ ఉన్నారు.

బంగారయ్యకు మనసులో మాట ఎలా పెగిలించాలో తెల్వడం లేదు. చివరకు వెళ్లి వస్తాను అన్నాడు బంగారయ్య. ప్రధానోపాధ్యాలకు కూడా బంగారయ్య ఎందుకు వచ్చాడో తెలుసు. తానే చొరవ తీసుకుని ‘సర్పంచ్‌గారు ఈ రోజు పేపర్ చూశారా’ అన్నాడు. లేదు చూడలేదు ఏముంది అన్నాడు బంగారయ్య. కాస్త ఊపిరి తీశాడు. మనసు కుదుట పడుతుంది.

‘పది పాసయితేనే సర్పంచ్’ అంటూ జీవో రాబోతుంది అంటూ పేపర్ చూపించాడు ప్రధానోపాధ్యాయులు. బంగారయ్య పేపర్ తీసుకున్నాడు. “అవునా, ఈ విషయం నాదాకా రాలేదు” ఐనా పాతికేళ్ళు సర్పంచ్‌గా చేశాను, ఇంకా ఈ పదవులు, ప్రజాసేవ ఏమిటో అంటూ పేపర్ మూశాడు. అయ్యో! మీకు తెలువకపోవడం ఏమిటి? ఇందాక వచ్చిన గ్రామస్థులంతా సర్పంచ్ పోటీకి పది ఎలా పాస్ కావాలని అడిగాడు అన్నాడు ప్రధానోపాధ్యాయులు.

బంగారయ్య బగబగ మండుతున్నాడు అరికాళ్ళనుంచి మొఖందాకా ఎరుపెక్కింది. పేపర్ దాచినా చెప్పినా నా కొడుకు ఎవ్వడని రుసరుస లాడుతున్నట్లుగా కూర్చుని, ఆ మళ్ళీ బడికెళ్ళు తారంటనా వెదవలు, సర్పంచ్‌లు అవుతారంటనా, నాకు చదువువద్దు ఏమి వద్దు, చాలు సర్పంచ్ పదవి అన్నాడు బంగారయ్య.

సర్పంచ్ గారు ‘మీ సేవలు గ్రామానికి అవసరం, మేముచూస్తున్నం, మీ మాట, పనితీరు బాగుంది’ అని ప్రధానోపాధ్యాయులు అన్నాడు. సర్పంచ్ బంగారయ్య గర్వంతో ఉప్పొంగి పోయాడు. జేబులోంచి పాతకవేలు తీసి, ప్రధానోపాధ్యాయులకి ఇస్తూ, మీరు ఇంతలా అన్నందుకు అదేదో పది పాస్ చేయండి అన్నాడు బంగారయ్య. ప్రధానోపాధ్యాయులు ఖంగుతిన్నాడు.

అయ్యో! అన్ని డబ్బులు అక్కరలేదండి, ఫీజు ఇవ్వండి అని తీసుకుని, బంగారయ్య, కమలమ్మల ఫోటోలతో ఫారం నింపాడు. పుస్తకాలు ఇంటికి పంపుతానని చెప్పగానే బంగారయ్య మనస్సులోని భారమంతా బయటపెట్టి ఇంటికి వెళ్ళాడు.
ఎప్పుడు బయట కనిపించే బంగారయ్య, ఇంట్లోంచి బయటకు రావడం లేదు. బంగారయ్య కనిపిస్తే కళ్ళు చింతనిప్పుల్లా ఎర్రగయినాయి. కమలమ్మ కంటికునుకు తీయడము లేదు. పుస్తకాల పురుగుల్లా చదువుల్లో నిమగ్నమైనారు. పది పాస్ కావాలని యజ్ఞములో మునిగారు. పరీక్షల సమయం రానేవచ్చింది. ప్రధానోపాధ్యాయులు హాల్‌టిక్కెట్లు ఇవ్వగానే పట్నం వెళ్ళారు పరీక్షలు రాయడానికి.

బంగారయ్య దిక్కులన్ని తిరిగి దండం పెట్టాడు పాసు పదిలో కావాలని, ఇష్టదైవాన్ని కొలిచాడు. నాతోపాటు భార్యకమలమ్మ పాస్ అవ్వాలని మహిళా రిజర్వు అయితే సర్పంచ్ అయితే సర్పంచ్ గిరి మాకే కావాలని, పరీక్ష హాల్లో కాలుపెట్టాడు బంగారయ్య. ఆశ్చర్యపోయాడు. ఇరుగు పొరుగు గ్రామాల సర్పంచ్‌లు, మండల పరిషత్ సభ్యులు, అధ్యక్షులు, కొందరు మాజీ శాసనసభ్యులు సైతం పరీక్ష ప్యాడ్‌లతో బెంచీలపై వున్నారు. ఒకరిని చూసి ఒకరు నవ్వుకున్నారు. ఓపెన్ పదవ తరగతి పరీక్షలు రెండో రోజు ముగియగానే అంతాఓపెన్‌గా ఓపెన్ పదవ పరీక్షలంటూ పతాక శీర్షికలతో పేపర్లలో వార్తలు. కదిలిన అధికార యంత్రాంగం, పరీక్ష కేంద్రాల తనిఖీ, అధికారులు తనిఖీ చేసింది. పరీక్ష విధానంను కాను, పరీక్షరాస్తున్న ప్రతినిధులను తనిఖీ చేసి, తాము ఇన్నాళ్ళు నమస్కారాలు చేసిన వారికి మరో సారి నమస్కరించారు. బంగారయ్య మాత్రం ఈ చదువు ఏదో చిన్నప్పుడు సక్కగా చదివితే కలెక్టర్‌ను అయ్యేవాడినంటూ ఆలోచనా సాగరంలో మునిగి ఈద సాగాడు.

ఉండ్రాల రాజేశం
9966946084