Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

స్కూల్ టీచర్‌కు కారు కానుక

Car gift for school teacher

విద్యార్థులకు మంచి ర్యాంకులు రావాలంటే కేవలం ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యం వల్లే అవుతుందని చాలామంది అనుకుంటారు. తల్లి రుణాన్ని ఏమిచ్చినా తీర్చుకోలేం. తల్లిలాంటి గురువుల రుణం కూడా అంతే. విద్యాబుద్ధులు నేర్పి, జీవితానికి చక్కని బాట వేసే టీచర్ల రుణం ఏమిచ్చినా తీరదు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివించడానికి చాలా మంది తల్లిదండ్రులు పెద్దగా ఇష్టం చూపటంలేదు. కానీ, ఆ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్చడం కోసం అక్కడి తల్లిదండ్రులు పోటీపడతారు. ఎందుకంటే అక్కడ ఉండే లలితా ధుమాల్ అనే టీచరమ్మ పిల్లల అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తున్నారు కాబట్టి. తమ పిల్లలకు వెలుగు చూపిన ఆ టీచరమ్మకు గ్రామస్తులంతా కలసి ఒక చక్కని కానుక అందించారు.

మహారాష్ట్రలోని పుణే జిల్లా శిరూర్ తాలూకాలోని పింపుల్ ఖాల్సా గ్రామంలోని జిల్లా పరిషత్ స్కూల్లో లలితా ధుమాల్ అనే ఉపాధ్యాయురాలికి పిల్లలపై శ్రద్ధ ఎక్కువ. వారు బాగా చదవాలని, పై స్థాయికి ఎదగాలని కోరిక. అక్కడి పాఠశాలలో 5వ తరగతిలో 19 మంది పిల్లలు ఉన్నారు. లలిత వారందరికీ ప్రభుత్వ స్కాలర్‌షిప్‌లు రావడానికి ప్రత్యేక క్లాసులు నిర్వహించింది. పుస్తకాలు కొని, వారితో ప్రతిరోజు చదివించింది. పండగ రోజుల్లో సైతం చదువు చెప్పింది. ఆ పిల్లలు కూడా తన పిల్లలే అనుకుంది. ఆమె కల నిజమైంది. స్కాలర్ షిప్ పరీక్షలో ఆ 19 మంది విద్యార్థులూ పాసయ్యారు. దీంతో వారి తల్లిదండ్రుల సంబరానికి అడ్డులేకుండా పోయింది. టీచరమ్మ రుణాన్ని తీర్చుకోవడానికి అందరూ చందాలు వేసుకుని కారును కొని కానుకగా అందించారు. ‘పిల్లలు బాగా కష్టపడి చదివారు.

నిజానికి ఈ స్కూల్లో గతంలో పనిచేసిన టీచర్లు కూడా పిల్లలను బాగా చదివించారు. మంచి మార్కులతో పాస్ చేయించారు. నేనూ అదే పనిచేశాను. అయితే గ్రామస్తులు ఇదివరకు టీచర్లకు ఫ్రిజ్, టూవీలర్లను గిఫ్ట్‌గా ఇచ్చేవారు. నాకు మాత్రం కారును ఇచ్చారు. నేను కోచింగ్ ఇవ్వడం వల్లే తమ పిల్లలు స్కాలర్‌షిప్ సాధించారని అంటున్నారు. గత ఏడాది కూడా 21 మంది స్కాలర్‌షిప్ సాధించారు. ఇది అందరి శ్రమ ఫలితం..’ అని ఆమె అంటోంది. ప్రస్తుతం ఆ స్కూల్లో 350 మంది విద్యార్థులు ఉన్నారు. ఆ గ్రామస్థులమంతా కలిసి పాఠశాలను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో రెండు కోట్లు చందాలు వసూలు చేయాలి అనుకుని ఇప్పటికే కోటి రూపాయలు ఖర్చుచేసి, మూడంతస్తుల భవనాన్ని కట్టారు. ఇంకా రెండు అంతస్తులను త్వరలోనే కడతాం’ అంటున్నారు అక్కడి గ్రామస్తులు, పాఠశాల సిబ్బంది.

Comments

comments