Home కరీంనగర్ అక్రమ కలప రవాణాకు కేరాఫ్ పెద్దపల్లి

అక్రమ కలప రవాణాకు కేరాఫ్ పెద్దపల్లి

woodఅటవీ శాఖ అధికారులే సూత్రదారులు
లక్షలు దండుకుంటున్న వ్యాపారులు

పెద్దపల్లి: పెద్దపల్లి ప్రధాన కేంద్రంగా వివిధ రాష్ట్రాల నుంచి కలప తెప్పిస్తూ అక్రమ రవాణా దందాను నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్రతోపాటు ఆదిలాబాద్ జిల్లా బెజ్జూరు, వేమనపల్లి, తిర్యాని, జిల్లాలోని మహదేవపూర్, కాటారం, ముత్తారం తదితర అటవీ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున కలపను పెద్దపల్లికి తరలించి ఇక్కడ సైజులుగా కటింగ్ చేయించి హైదరాబాద్, గుంటూరు తదితర పట్టణాలకు తరలిస్తూ తమ అక్రమ వ్యాపారాన్ని మూడు కర్రలు, ఆరు సైజులుగా కొనసాగిస్తూ లక్షలాది రూపాయలను దండుకుంటున్నారు. అక్రమ కలప మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా నుంచి, బెజ్జూరు మండలంలోని గూడెం, మొట్లగూడెం, ఖర్జీ, దిగుడ గ్రామాల నుంచి దహెగం మండలం మీదుగా మంచిర్యాల శివారులోని ఇందారం చెక్‌పోస్టు దాటి పెద్దపల్లికి చేరుకుంటోంది. అర్ధరాత్రి దాటిన తర్వాత పెద్దపల్లిలో తెచ్చిన కలపను సైజులుగా తయారు చేసుకొని రాత్రికి రాత్రే ఆర్డరు ఇచ్చిన వారికి సరఫరా చేస్తున్నట్లు సమాచారం. మహదేవపూర్ నుంచి పెద్దపల్లికి కలపను తెప్పించి రైలుమార్గం ద్వారా హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. గతంలో రైల్వేస్టేషన్లలో ఫారెస్టు అధికారులు నిఘా పెట్టినప్పటికి మరికొంతకాలానికి మిన్నకుండి పోవడంతో వ్యాపారుల అక్రమార్జనకు అడ్డుకట్ట లేకుండా పోతోంది. ఈ అక్రమ దందాలో మొదట్లో చిన్న చిన్నగా కలపను తెప్పించి విక్రయించిన వారు ప్రస్తుతం లారీల ద్వారా, రైళ్ల ద్వారా కలపను తరలిస్తూ పూర్తి స్థాయిలో ఇదే వ్యాపారంలో తలమునకలై లక్షలాదిగా సంపాదించుకుంటున్నారు. ఇటీవల పెద్దపల్లికి చెందిన ఓ కలప వ్యాపారి కర్రలు తెచ్చేందుకు తిర్యాని మండలానికి వెళ్లగా వ్యాన్ బోల్తా పడిన సంఘటనలో మృతిచెందిన విషయం తెలిసిందే. దీంతో కొంతకాలం వ్యాపారులో స్థబ్ధత వాతావరణ నెలకొన్నప్పటికి తిరిగి కలప అక్రమ వ్యాపారం యధావిధిగా కొనసాగుతోంది.
హరితహారంతోనైనా నరికివేత ఆగేనా..?
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంతోనైనా అడవులు, చెట్ల నరికివేతకు అడ్డుకట్ట పడుతుందా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం పెద్ద ఎత్తున మొక్కలు నాటేందుకు శ్రీకారంచుట్టడంతోపాటు చెట్లు నరికిన వారిపై క్రిమినల్ కేసులు పెడతామని సీఎం కేసీఆర్ చట్టం తేవడంతో ఈ నిర్ణయంతోనైనా చెట్ల నరికివేత ఆగుతుందో లేదో చూడాలి. గతంలో చెట్ల నరికివేతనియంత్రణ కోసం ప్రభుత్వం వాల్టా చట్టాన్ని ప్రయోగించినా పెద్దగా ఫలితంలేకుండా పోయింది. ప్రభుత్వం నిర్ణయంతో అటవీ శాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకుని పెద్దపల్లిలో జరుగుతున్న అక్రమ కలప వ్యాపారుల దందాకు అడ్డుకట్ట వేయాలని పలువురు కోరుతున్నారు.