Home ఆఫ్ బీట్ పెంపుడు జంతువులను పట్టించుకోండి

పెంపుడు జంతువులను పట్టించుకోండి

Dog

దీపావళి రోజు పెంపుడు జంతువులపై ఎక్కువ శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. అవి శబ్దకాలుష్యాన్ని అస్సలు భరించలేవు. పెద్ద శబ్దాలు వచ్చే బాణసంచా కాల్చడం వల్ల అవి బెదురుతుంటాయి. కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే వాటికి ఎటువంటి ఇబ్బంది కలుగదు.
ముఖ్యంగా పెంపుడు కుక్కల చెవులు, ముక్కు చాలా సున్నితంగా ఉంటాయి. బాణసంచా శబ్దానికి అవి అధిక ఒత్తిడిని ఎదుర్కొంటాయి. అందుకే వాటిని ఇంటి లోపలే శబ్దం రానిచోట ఉంచాలి. వాటి చెవుల మీద మందపాటి దుప్పటిని కప్పాలి. పశువైద్యుని సలహాతో యాంటీ యాంగ్జయిటీ పిల్‌ను ఇవ్వొచ్చు.
పెంపుడు జంతువులను ఇలాంటి సమయంలోనే ఎక్కువగా పట్టించుకోవాలి. వాటిని ప్రేమతో దగ్గర తీయాలి. కొంతసేపు వాటితో గడపాలి.
లోపల ఉంచేటపుడు వాటిని అద్దాల కిటికీల దగ్గర ఉంచకూడదు. అవి మరీ సున్నితం కావడం వల్ల బాణసంచా కాల్చే తీరు చూసి భయపడుతుంటాయి.అవి ఉన్న గదిలో చిన్న శబ్దంతో సంగీతాన్ని పెట్టొచ్చు.
బాణసంచా కాల్చాక కూడా వాటిని గదిలో పెట్టకుండా, మీతో పాటు దాన్ని కూడా తిరగనివ్వాలి.
అత్యుత్సాహంతో రంగులను వాటిపై చల్లకూడదు. ఎందుకంటే టాక్సిస్ రంగులు జంతువులకు ప్రమాదకరమైనవి. వాటికి చర్మానికి సంబంధించిన అలర్జీ వస్తుంది.
దీపావళి అంటేనే గాలి కలుషితం కావడం. పెట్స్ ఉండే గదిలో ఎయిర్ ప్యూరిఫైయర్‌ని వాడొచ్చు.
ఇంట్లో చేసే రకరకాల స్వీట్లు, వంటకాలను పెంపుడు జంతువులకు పెట్టకూడదు. రోజువారీ వాటికి ఏదైతే ఆహారాన్ని ఇస్తామో అదే ఇవ్వాలి. లేదంటే వాటి ఆరోగ్యం పాడవడం ఖాయం.