Home లైఫ్ స్టైల్ ఆధునిక పోకడలకు కేరాఫ్ ఇంటీరియర్ డిజైన్

ఆధునిక పోకడలకు కేరాఫ్ ఇంటీరియర్ డిజైన్

 ఇంటీరియర్ డిజైన్…! ఇప్పుడు నగరంలో బహుళ ప్రాచూర్యంలో ఉన్న పదం ఇది. భవన నిర్మాణ రంగంలో ఈ పదం అత్యంత కీలక పాత్ర పోషిస్తోంది. ప్రస్తుతం ఈ ఇంటీరియర్ డిజైన్‌కు నగరం, శివారులో ఎనలేని ప్రాధా న్యత సంతరించుకుంది. ఆధునిక జీవన విధానానికి, ప్రాశ్చాత్య సంస్కతికి పెద్దపీట వేస్తున్న నగరవాసులు తమ నూతన గృహాలు, ఫ్లాట్ లేదా తాముంటున్న భవనగదుల్లో అలంకరణకు, కళాసౌందర్యానికి, నవీన పద్ధ్దతికి, కొత్త వాతావర ణానికి, ప్రశాంతతకు అత్యంత ప్రాముఖ్యతనిస్తున్నారు. కొందరైతే తమతమ నివాసాల్లో ఇంటీరియర్ డిజైన్ చేయిం చుకోవడాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ఇందుకోసం భారీగానే డబ్బును ఖర్చుచేస్తున్నారు. మరికొందరైతే ఇతర రాష్ట్రాల నుండి ఈ రంగంలోని నిపుణులను, పేరున్న సంస్థలను కూడా రప్పించి మరీ తమ విల్లాలను తీర్చిదిద్దుకుంటు న్నారు. నేడు నగరం, ముఖ్యంగా శివారులోని గేటెడ్ కమ్యూనిటీ భవన నిర్మాణం ఒక ఎత్తైతే… ఇంటీరియర్ డిజైన్ మరో ఎత్తు. సాధారణ ఉద్యోగుల నుండి  సంపన్న వర్గాల వారి వరకు ఈ నివాసాల లోపలి ప్రాంతాలను తమ అభి రుచికి తగ్గట్టుగా తీర్చిదిద్దడానికి అత్యంతగా ఇష్టపడుతున్నారు. ఇంతకీ ఈ ఇంటీరియర్ డిజైన్ అంటే ఏమిటో..? దాని పాత్ర భవనంలో ఎలా ఉంటుందో తెలుసుకుందాం..

LF

భవనం లోపల విస్తరించిన ప్రాంతాన్ని, అంతర్భాగాన్ని కళాత్మకంగా, శాస్త్రీయంగా రూపకల్పన చేయడం లేదా తీర్చిదిద్దడమే ఇంటీరియర్ డిజైన్. ఆ నివాసంలో లేదా భవంతిలో నివసిస్తున్న వారి అభిరుచి మేరకు, ఇష్టానుసారంగా అలంకరించడం. స్థలాన్ని, నివాసాన్ని వినియోగిస్తున్న, ఉపయోగించుకుంటున్న వారికి ఆరోగ్యకరమైన, మరింత సుందరమైన, ప్రశాంత వాతవరణాన్ని ఈ అలంకరణ అందిస్తుంది. ఆనందమయంగా గడపడానికి, నిశ్చింతగా ఉండటానికి ఉపకరిస్తుంది. చూపరులకు చూడముచ్చటగొలిపేట్టుగా ఆకట్టుకునేలా ఇంటీరియర్ డిజైన్ ఉంటుంది. అందుకే ఆధునిక జీవన విధానంలోని వారు ఈ పద్ధతికి ఎనలేని ప్రాధాన్యతనిస్తున్నారు. ఈ రంగంలోని నిపుణులు నివాసాల ఆకృతి, నమూనాల ప్రకారం, అందులోనివారి అభీష్టం మేరకు ఇంటీరియర్ డిజైనర్లు ప్రత్యేకంగా ప్రణాళికలను రూపొందిస్తున్నారు. స్థల పరిమాణం మేరకు ఇంటీరియర్ డిజైన్‌ను సిద్ధం చేస్తారు. ఇందులోనూ నగర వాసుల జీవన విధానం, సంప్రదాయాలను, ఆచారవ్యవహారాలను, శాస్త్రీయ పద్ధ్దతులను, ఆధునిక పోకడలను పరిగణలోకి తీసుకుంటున్నారు. ఫలితంగా భవన నిర్మాణ రంగంలో ఇదొక అంతర్భాగంగా మారింది. నివాసాలు, ఫ్లాట్స్ విక్రయాల్లో అత్యంత కీలకపాత్ర పోషిస్తోంది. భవనంలోపలి ప్రాంతంలో అత్యంత ప్రాధాన్యతగా ఉండే ప్రదేశాలైన లివింగ్ రూమ్ , వంటగది, పడకగది, కారిడార్, స్నానాల గది, తలుపులు, కిటికీలు, పరదాలు ఇలా అన్నింటినీ ఒక ప్రణాళికా పరిధిలోనే కళాత్మకంగా తీర్చిదిద్దుతారు.

లివింగ్ రూం…
ప్రస్తుత జీవన విధానంలో ఓ భవనంలో అందరూ ఒకేచోట కలిసే ప్రదేశమే హాలు లేదా లివింగ్ రూం. ఈ ప్రదేశం చాలా ముఖ్యమైనది. ఇక్కడే ఆ ఇంటివారంతా సమావేశమవుతారు. చర్చించుకుంటారు. ముచ్చటిస్తారు. టీవీలను వీక్షిస్తారు. సంగీతం వింటారు. ఇక్కడ ఇంటీరియర్ డిజైన్ చేసేముందు ప్రధానంగా అక్కడ అందుబాటులో ఉన్న స్థల విస్తీర్ణం, ఆ ప్రాంతంలోని గోడలకు వేసే రంగులు, వినియోగించే ఫర్నిచర్ ఉపకరణాలు, అలంకరించే వస్తువులను పరిగణలోకి తీసుకోవాలి. అందంగా, కళాత్మకంగా, ఆహ్లాదకరంగా, సౌకర్యంగా ఉండేట్టుగా రూపకల్పన చేసుకోవాలి. ఫ్లోరింగ్, కిటికీలు, పరదాలు అక్కడికి చేరుకునేవారికి ఆహా అన్నట్టుగా డిజైన్‌కు ప్రాధాన్యతనివ్వాలి. ఇది ఎంత కళాత్మకంగా, ఆకర్షణీయంగా ఏర్పాటుచేసుకుం అంతగా సత్ఫలితాలు ఉంటాయనేది ఇంటీరియర్ డిజైనర్ల అభిప్రాయం. చిన్నచిన్న నివాసాల్లో అధిక ప్రదేశాన్ని వినియోగించే పరిస్థితి ఉంటుంది. అప్పుడు అందులోనివారు తేలిగ్గా తిరగడానికి వీలుగా ఆధునికతకు, అక్కడి అనువైన స్థలానికి అనుగుణంగా డిజైన్ చేసుకోవాలి.

వంటగది..
ఇంటి ఆహార కేంద్రం, నివాసానికి గుండెలాంటిది వంటగది. ఈ గది ప్రభావం ఆ ఇంటివారందరిపై ఉంటుంది. అందుకే వంటగదికి అధిక ప్రాధాన్యతనివ్వాల్సి ఉంది. మహిళలు సౌలభ్యంగా తిరిగేట్టుగా వంటలకు కావాల్సిన అన్నిరకాల పదార్థాలు, పాత్రలు, వస్తువులు అందుబాటులో ఉండాలి. ప్రస్తుతం ఆధునిక ఆహారపుటలవాట్లు వచ్చిన నేపథ్యంలో వంటగదికి అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. దీనిని మీరు ఎంత ఖర్చుతో చేయాలనుకుంటున్నారో ముందే అంచనావేసుకుని అందుకు అనుగుణంగా ప్రణాళికలను సిద్ధంచేసుకోవాలి. ప్రధానంగా ఫ్లోరింగ్, గది కప్‌బోర్డు, క్యాబినేట్స్, రంగులు వంటివి ఎంపిక చేసుకుని డిజైనర్‌కు తెలియపరచాలి. ఫ్లోరింగ్ ముఖ్యంగా శుభ్రపరిచేందుకు అనుకూలంగా ఉండాలి. గది కాస్త వేడిగా కనిపించాలంటే ఎరుపు, కాషాయం, పసుపు రంగులను, చల్లగా ప్రశాంతంగా ఉండాలంటే పచ్చని, నీలి, వంకాయ రంగులు, శక్తివంతంగా, హుషారుగా, శుభ్రంగా ఉండాలంటే తెలుపు రంగును వాడాలి. వంటగదిలో రిఫ్రిజిరేట్ అధికస్థలాన్ని తీసుకుంటుంది. ఆహార పదార్థాలను వండే పాత్రలు, తినుబండారాలను నిలువచేసేందుకు, సరుకులు భద్రపరిచేందుకు ప్రత్యేక ఏర్పాట్లు అవసరం. రంగుల ఎంపిక కూడా ముఖ్యం. ప్రస్తుతం అధికశాతం మంది మోడర్న్ కిచెన్‌ను ఏర్పాటు చేసుకుంటున్నారు.

పడక గది..

నివాసంలో కచ్చితమైన విశ్రాంతి, నూతనొత్సాహానిచ్చేది పడకగది. అలసిన శరీరానికి సేదతీరనిచ్చేది. కంటినిండా నిద్రపోయేది ఇక్కడే అయినందున కుటుంబాలు దీని ఇంటీరియర్ డిజైన్ చేసుకోవడంలో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. నేడు ఈ గదిలో ఇంటీరియర్ డిజైన్ చేసే ముందు ప్రత్యేక నమూనా, శైలి, ఆధునికత్వం ఉట్టిపడేలా చూసుకుంటున్నారు. ఇందుకు ఖర్చుకు వెనుకాడటంలేదు. మృదువైన అలంకరణలు, అల్లికలు, గోడల రంగులు, ఫ్లోరింగ్, ఉపకరణాలు వంటివి అధికంగా నవీన పోకడలతో, ప్రాశ్చాత్య సంస్కృతితో ఏర్పాటు చేసుకునేందుకు మొగ్గుచూపుతున్నారు. పడక గది ఇంటీరియర్ డిజైన్‌లో ఎన్నో కలలు కంటున్నారు. ఊహించుకుంటున్నారు. గోడలకు వాల్‌పేపర్, వార్డ్‌బోర్డు, ఉపకరణాలు, విద్యుత్‌దీపాలు, పరదాలు విషయాల్లో అన్నిటికి మోడర్న్ ఉట్టిపడేలా చూస్తున్నారు దంపతులు. ఇలా ఆధునిక నివాసాల్లో ప్రత్యేకంగా పూజగది, డ్రెస్సింగ్, డైనింగ్, రీడింగ్ గదులు, కారిడార్, తలుపులు, కిటికీలు, జిమ్, ఇంటిముందు ప్రాంగణం వంటివి ఆధునిక పద్ధ్దతిలో రూపకల్పన చేస్తున్నారు.

ఇంటీరియర్ డిజైన్ వ్యయం ఇలా…
ఒక చిన్న ఇంటికి ఇంటీరియర్ డిజైన్ చేసేందుకు కనీసం రూ. 5 లక్షలు అవుతుంది. సింగల్ బెడ్‌రూం హాల్ కిచెన్(1బిహెచ్‌కె)కు రూ. 1.65లక్షల నుండి 2.65 లక్షల వరకు వ్యయమవుతోంది. నాణ్యతను పరిగణలోకి తీసుకుని వ్యయాన్ని నిర్ణయించడం జరుగుతుంది. 2బిహెచ్‌కె రూ. 2.10 లక్షలు నుండి రూ. 3.40 లక్షలు, 3బిహెచ్‌కె రూ. 2.55 లక్షల నుండి రూ. 4.10లక్షలుగా ఉన్నాయి. కొన్ని సంస్థలు మాస్టర్ బెడ్‌రూంకు రూ. 1.55 లక్షలు, సాధారణ బెడ్ రూం రూ. 94 వేలుగా తీసుకుంటున్నాయి. కిచెన్ గదికి రూ. 1.08 లక్షలు నుండి రూ. 5 లక్షల వరకు ఉన్నది. లివింగ్ రూం రూ. 1.24 లక్షలు. డైనింగ్ రూం రూ. 30 వేలు. నగరం, శివారు ప్రాంతాలలో ధరలు మారుతూ ఉన్నాయి. గది విస్తీర్ణం, అందులో ప్రత్యేకతలను, నాణ్యతను పరిగణలోకి తీసుకుని ఇంటీరియల్ డిజైన్ వ్యయాన్ని ఖరారు చేస్తున్నాయి.

మంచె మహేశ్వర్
మన తెలంగాణ/ సిటీ బ్యూరో