Search
Friday 21 September 2018
  • :
  • :

ప్రభుత్వ కార్యాలయాల్లో బ్రోకర్ల వ్యవస్థకు ఎసిబి చెక్

ph0

లంచం కేసుల్లో ప్రైవేటు వ్యక్తులపై కూడా కేసులు

మన తెలంగాణ/హైదరాబాద్: చిన్నా చితక పనిమీద ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే ప్రజలకు ముందుగా అక్కడి కార్యాలయం ముందు బైఠాయించిన బ్రోకర్ (ప్రైవేటు వ్యక్తి) దర్శనమిస్తాడు. ఈ బ్రోకర్లు చెప్పిందే వేదం.. వీరు చెప్పందే అధికారి సదరు ఫైల్‌పై సంతకం కూడా చేయరు. వీరు సైగ చేస్తేనే.. ఎంతటి పనైనా ఫైల్‌పై అధికారి సంతకం చేయాల్సిందే. బాధితులు తమ పనిపై నేరుగా వెళ్లి అధికారులను కలిసినా ముందు బ్రోకర్‌ను కలవండి అని సదరు అధికారి బాధితులకు ఉచిత సలహాలు ఇస్తుంటారు. మొత్తం మీద ప్రభుత్వ కార్యాలయాలలో బ్రోకర్ల వ్యవస్థ లేకుండా పనులు జరగవు అనేది తేట తెల్లమైంది. అధికారులు తమకు నమ్మకస్తులైన కొంత మంది బ్రోకర్లను పరోక్షంగా నియమించుకుంటున్నారు.బాధితుల నుంచి తాము స్వయంగా లంచం డిమాండ్ చేస్తే తమ పరువు పోవడమే కాకుండా ఎసిబి కేసుల్లో ఇరుకుంటామని భావించడమే ఇందుకు కారణం. ఇలాంటి బ్రోకర్ల వ్యవస్థకు చెక్ పెట్టేందుకు ఎసిబి అధికారులు నడుం భిగించారు. ఆయా కేసులలో లంచం తీసుకుంటు పట్టుబడిన ప్రభుత్వ అధికారులతో పాటు బ్రోకర్లను కూడా అరెస్టు చేసి జైలుకు పంపిస్తున్నారు. రెండు నెలల వ్యవధిలో ఎసిబి అధికారులు పలు కేసుల్లో లంచం తీసుకుంటూ పట్టుబడిన ప్రభుత్వ అధికారితో పాటు ప్రైవేటు వ్యక్తులపై కూడా కేసు నమోదు చేశారు. అధికారులు నేరుగా లంచం డిమాండ్ చేయకుండా పరోక్షంగా బ్రోకర్లను ఉసిగొల్పుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాలలో బ్రోక ర్లు ఉండకూడదనే లక్షంగా ఎసిబి అధికారులు అడుగులు వేస్తున్నారు. లంచం కేసుల్లో ప్రైవేటు వ్యక్తులపై కూడా కేసులు నమోదు చేయడం వల్ల బ్రోకర్ల వ్యవస్థకు చెక్ పెట్టవచ్చని ఎసిబి అధికారులు అభిప్రాయం. ప్రభు త్వ శాఖల్లో ఆయా విభాగాల్లో విధులు నిర్వహిస్తు న్న అవినీతి అధికారులు లంచం తీసుకునే తీరును మార్చుకున్నారు. ఎసిబి అధికారులకు నేరుగా చిక్కకుండా లంచం డబ్బులు దండుకునేందుకు సరికొత్త ఎత్తుగడలకు శ్రీకారం చుట్టారు. ఇందుకు కింది స్థాయి ఉద్యోగులు,ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు, ప్రైవేటు వ్యక్తులను రంగంలోకి దింపారు. వీరి ఎత్తుగడలను పసిగట్టిన ఎసిబి అధికారులు బాధితుడు ఇచ్చే ఫిర్యాదులో బ్రోకర్ల పేర్లను కూడా చేర్చే విధంగా ఫిర్యాదు తీసుకుంటున్నారు. దీంతో ప్రైవేటు వ్యక్తుల మెడకు ఉచ్చు భిగిస్తున్నారు. ఇప్పటికైనా బ్రోకర్లు అవినీతి అధికారులతో చేతులు కలపకుంటే మంచిది లేదంటే వారితో పాటు శిక్ష అనుభవించాల్సిందే తస్మత్ జాగ్రత్త.
ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్‌తో పాటు బ్రోకర్ అరెస్టు…
ఆస్తి పన్ను రికార్డులో పేరు మార్పు కోసం బాధితుడు జిహెచ్‌ఎంసి ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్ కట్టజయకృష్ణను ఆశ్రయించాడు. సదరు అధికారి తమ కార్యాల యం బయట ఉన్న ప్రైవేటు వ్యక్తి జి.శివశంకర్‌ను ఆశ్రయిస్తే పని అయిపోతుందని ఉచిత సలహా ఇచ్చాడు. అధికారి చెప్పినట్లు బాధితుడు శివశంకర్‌ను ఆశ్రయించాడు. పని కావాలం టే అధికారికి రూ.4000 లంచం ఇవ్వాల్సి వస్తుందని చెప్పడంతో అవాకైన బాధితులు ఎసిబి అధికారులకు ఫిర్యాదు చేసి నెల క్రితం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టించాడు. ఈ కేసులో ఎసిబి అదికారులు ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్ జయకృష్ణతో పాటు ప్రైవేటు వ్యక్తి శివశంకర్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
మరో కేసులో ప్రైవేటు వ్యక్తి రిమాండ్…
తనకు ఫుడ్‌లైసెన్స్ కావాలని క్యాటరింగ్ నిర్వాహకుడు అబ్దుల్ అహ్మద్ 15 రోజుల క్రితం క్యాంటరింగ్ నిర్వాహకుడు జిహెచ్‌ఎంసి హెల్త్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎన్.వెంకటరమణను ఆశ్రయించాడు. లైసెన్స్ కావాలంటే ముందుగా రిపోర్టర్ జి.రామక్రిష్ణ (ప్రైవేటు వ్యక్తి)ని కలవాలని సలహా ఇచ్చాడు.
మెడికల్ అధికారి చెప్పిన ప్రకారం బాధితుడు రామక్రిష్ణను ఆశ్రయించడంతో అతను రూ.15 వేలు లంచం డిమాండ్ చేశాడు. ఈ డబ్బులు మెడికల్ అధికారికి ముట్టితెనే ఫుడ్‌లైసెన్స్ మంజూరు అవుతుందని చెప్పడంతో ఎసిబికి ఫిర్యాదు చేసిన బాధితుడు మూడు రోజుల క్రితం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టించారు. ఈ కేసులో ప్రభుత్వ అధికారి వెంకటరమణతో పాటు ప్రైవేటు వ్యక్తి రామక్రిష్ణను అరెస్టు చేసి జైలుకు పంపించారు.

Comments

comments