Home ఎడిటోరియల్ గుజరాత్‌లో కులమే బలం!

గుజరాత్‌లో కులమే బలం!

editగుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ‘కులం’ ఈ సారి కూడా కీలక భూమిక పోషించనున్నది. ఎన్నడూ లేని రీతిలో కులం ప్రాతిపదికన ఈ సారి అక్కడ ఉద్యమాలు ఉవ్వెత్తున ఎగిసాయి. వాటికి ప్రజల అపూర్వమైన మద్దతు కనిపించడంతో ఆయా రాజకీయ పార్టీలు గెలుపు గుర్రాలవేటలో ముందుగానే జాగ్రత్త పడ్డాయి. బిజెపి, కాంగ్రెస్ పార్టీలు అభ్యర్థులకు టిక్కెట్లు పంచే ముందు కుల సమీకరణలను పక్కాగా మదిలో పెట్టుకున్నాయి. పటీదార్లు, ఇతర వెనుకబడిన తరగతుల వారిని సంతృప్తి పరిచేందుకు పోటీపడ్డాయని చెప్పవచ్చు. పటీదార్లకు బిజెపి 50టిక్కెట్లు కట్టబెడితే కాంగ్రెస్ అదే వర్గానికి చెందిన 41మందిని నిలబెట్టింది. పాలకపక్షం బిజెపి 58మంది ఒబిసిలను, కాంగ్రెస్ 62మందిని ఎన్నికల బరిలో నిలిపింది. ఇక దళితుల విషయానికి వస్తే ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ 14, బిజెపి 13మందిని బరిలోకి దింపాయి. ఈ సారి ఎన్నికల్లో ‘నాలుగు నుంచి ఐదుశాతం అదనపు ఓటు షేరింగ్’ కోసమే ప్రధాన పోరు సాగుతుందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. దీన్ని తమవైపు మలుచుకోవడం కాంగ్రెస్‌కు పెను సవాలే అయినప్పటికీ తనను తాను నిరూపించుకోవడానికి దానికి ఇదే సరైన సమయమని రాజకీయ పండితుడు అచ్యుత్ యజ్ఞిక్ అన్నారు. ఈ సారి కాంగ్రెస్ పార్టీకి కొన్ని అదనపు సీట్లు దక్కేందుకు ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు సహకరించువచ్చునన్నారు. అలాగని కొత్తగా తెరపైకి వచ్చిన యువ నేతలు హార్దిక్ పటేల్, జిగ్నేష్ మేవానీ, అల్పేష్ ఠాకూర్‌ల మద్దతుతో అధికారాన్ని కైవసం చేసుకుంటుందని భావించడం అతిగా ఊహించుకోవడమే అవుతుందన్నారు. 2002, 2007, 2012 ఈ మూడు దఫాల ఎన్నికలను పరిశీలించినట్లయితే కాంగ్రెస్ 40శాతం ఓట్లను దక్కించుకోగా, బిజెపి ప్రతీసారి 49శాతం ఓట్లను ఖాతాలో వేసుకుంటూ అధికారాన్ని చేజిక్కించుకుంటూ వచ్చింది. ఈ సారి అక్కడక్కడ ఉన్న ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు ఇరు పార్టీల నడుమ దోబూచులాడుతున్న 4 నుంచి 5శాతం ఓట్లు కాంగ్రెస్‌కు కలిసివచ్చేలా చేస్తుందేమోనన్న భావన అక్కడ ఉంది. ఏది ఏమైనా సీట్ల పంపిణీలో కులం అనేది కీలకపాత్ర పోషించిందనడంలో ఎలాంటి సందేహం లేదు. గత రెండు దశాబ్దాలుగా మెజారిటీ పటీదార్లు ఇస్తున్న తిరుగులేని మద్దతుతో బిజెపి ఇటు గ్రామాల్లో, అటు పట్టణాల్లోనూ నల్లేరు మీద నడకలా విజయాలను ఖాతాల్లో వేసుకుంటూ వస్తోంది. ఎప్పుడైతే పటీదార్లకు కోటా డిమాండ్‌తో హార్ధిక్ పటేల్ ఉద్యమాన్ని మొదలు పెట్టారో అప్పటి నుంచి గుజరాత్ రాజకీయ సమీకరణాల్లో స్పష్టమైన మార్పు వచ్చింది. దానికి ఒబిసి లీడర్ అల్ఫేష్ ఠాకూర్ ప్రతి ఉద్యమం రావడం అధికార పార్టీని ఆలోచనలో పడేసింది. ఇరువురినీ ప్రసన్నం చేసుకోవడానికి కమలనాథులు బిజీ అవుతుండగానే ‘ఉనా’ ఘటనకు వ్యతిరేకంగా జిగ్నేష్ మేవానీ నాయకత్వంలో దళిత ఉద్యమం దూసుకొచ్చింది. ముగ్గురిలో ఠాకూర్ ఇప్పటికే కాంగ్రెస్‌లో చేరగా, పటేల్, మేవాని ఇద్దరూ హస్తం పార్టీకి అండగా ఉంటామని హామీనిచ్చారు. బిజెపికి ఈ సారి ఓటువేయవద్దని వారివారి వర్గాలకు
పిలుపును కూడా ఇచ్చేశారు.
ఆరుకోట్ల మంది గుజరాతీలలో 11 నుంచి 12శాతం వరకు పటీదార్లు ఉంటారని ఓ అంచనా. ఇక ఉత్తరాన ఠాకూర్లు, ఒబిసి లు ఉన్నారు. మధ్య గుజరాత్, సౌరాష్ట్రలో ‘కోలి’లు ఇలా మొత్తం కలిపి 40శాతం వరకు ఉన్నారు. బిజెపి మొత్తం అసెంబ్లీ స్థానాల(182)కు పోటీలో ఉండగా కాంగ్రెస్ ఆరు స్థానాలను మాత్రం మిత్రులకు వదిలేసింది. వారిలో ఒకరు జిగ్నేష్. రాజకీయ విశ్లేషకులు ఘనశ్యామ్ షా మాట్లాడుతూ ఇప్పటి వరకైతే కాస్త కాంగ్రెస్‌దే పైచేయిగా ఉందన్నారు. అయితే పటీదార్లు లేదా ఒబిసిలు ఎంత మేరకు ఆ పార్టీకి అండగా నిలుస్తారన్నది ప్రశ్నేనని అభిప్రాయపడ్డారు. 2012 ఎన్నికలతో పోల్చితే కాంగ్రెస్ పరిస్థితి మాత్రం కచ్చితంగా మెరుగైందన్నారు. వాద్గామ్(ఎస్‌సి) నుంచి బరిలో ఉన్న మేవానీకి వ్యతిరేకంగా అభ్యర్థిని నిలపకుండా కాంగ్రెస్ మంచి వ్యూహాన్ని అనుసరించింది. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఏడు శాతం మంది దళితులను ఆకర్షించవచ్చన్నది వారి ఆలోచన. మరో రాజకీయ విశ్లేషకులు హరి దేశాయ్ కూడా బిజెపికి ఈ సారి కాంగ్రెస్ నుంచి గట్టి సవాల్ ఎదురుకానుందన్నారు. ఇన్నాళ్లు ఓటుబ్యాంకుగా ఉన్న పటీదార్లను జారిపోనివ్వకుండా చూసుకోవ డం వారికి పరీక్షేనని అభిప్రాయపడ్డారు. అయితే హార్దిక్ పటేల్ పిలుపుతో పటేళ్లంతా బిజెపికి వ్యతిరేకంగా ఓటేస్తారనుకోవడం అత్యాశేనని, బిజెపి కి ఓటుబ్యాంకుగా ఉన్న ఈ వర్గం అంతా ఓకేసారి వారి వైఖరిని మార్చుకుంటారని అనుకోవడం లేదన్నారు. మరోవైపు కాంగ్రెస్ ఆరుగురు ముస్లింలకు సీట్లు కేటాయించగా బిజెపి కనీసం ఆ వంక చూడనేలేదు.
మరోవైపు బిజెపికి రెబెల్స్ బెడద పెరిగిపోవడం ఆ పార్టీని తీవ్రంగా కలవరపెడుతోంది. ఏకంగా 24 మంది తిరుగుబాటుదారులు స్వతంత్రంగా లేదా ఇతర పార్టీల అభ్యర్థులుగా ఎన్నికల బరిలో దిగారు. వారిలో ప్రధాన ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా కొంత మంది బరిలో నిలిచారు. తిరుగుబాటు అభ్యర్థుల్లో ప్రముఖుడు అజయ్ చౌద్రీ ఉన్నారు. ఆయన సూరత్‌కు చెందిన పార్టీ ప్రధాన కార్యదర్శి. దక్షిణ గుజరాత్‌లోని చోర్యాసి నియోజక వర్గం నుంచి రెబల్ అభ్యర్థిగా పోటీ చేయాలని నిర్ణయించుకోవడంతో ఆయన్ని పార్టీ బహిష్కరించింది. ఇలా పలువురు కీలక నేతలు వారివారి నియోజకవర్గాలతో పాటు చుట్టుపక్కల కూడా ప్రభావితం చేసేవారుండడం బిజెపికి ప్రతిబంధకంగా మారుతోంది. బిజెపి బంపర్ మెజారిటీతో విజయం సాధిస్తుందని ఇంతకుముందు ప్రీపోల్ సర్వే లో అంచనా వేసిన ‘లోక్‌నీతి- సిఎస్‌డిస్’ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. అదే సంస్థ ఇప్పుడు తాజాగా నిర్వహించిన సర్వేలో కాంగ్రెస్, బిజెపిల మధ్య పోటీ నువ్వా, నేనా అన్నట్లుగా ఉంటుందని తేల్చింది. బిజెపికి ప్రతికూల పరిణామమే. పాటిదార్లు, ఒబిసిలు, బిసిలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారడంతో కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఓట్ల శాతం అంచనా 29శాతం నుంచి ఏకంగా 43శాతానికి పెరిగింది. బిజెపికి కూడా 43శాతం ఓట్లు వస్తాయని తాజా సర్వేలో తేలింది.
ఎన్నికల కమిషన్ గణాంకాల ప్రకారం 2012 ఎన్నికల్లో పోలై చెల్లిన ఓట్లలో 47.85శాతం బిజెపికి రాగా, కాంగ్రెస్ 38.93
శాతంతో సరిపెట్టుకుంది. అంటే ఇరు పార్టీల నడుమ తేడా 8.92
శాతంగా ఉంది. కులపరమైన సమీకరణాలు ఈసారి తప్పకుండా తమకు కలిసి వస్తాయని కాంగ్రెస్ గంపెడాశలు పెట్టుకోగా బిజెపి మాత్రం ఏ ఒక్కరూ తమ చేజారిపోరని ధీమాను ప్రకటిస్తోంది.
గుజరాత్‌లో డిసెంబర్ 9, 14 తేదీల్లో రెండు దఫాలుగా పోలింగ్ జరుగుతుంది. ఫలితాలు 18న వెలువడనున్నాయి.
* పరశురామ్