Home దునియా కులవృత్తులు – సమ్యక్ జీవనం

కులవృత్తులు – సమ్యక్ జీవనం

Lord-Buddha

బుద్ధుడు బోధిసత్వునిగా, నీచమైన కులాలుగా వైదిక మతం ఎంచిన ఎన్నో కులాల్లో పుట్టాడు. చివరికి ఈ బౌద్ధ భావజాలం మహాభారతాన్ని కూడా తాకింది. “ధర్మవ్యాధోపాఖ్యానం” అందులో ఒకటి. కాబట్టి, ‘సరైన జీవనం’ విషయంలో కూడా బౌద్ధం వైదిక భావజాలాన్ని తునాతునకలు చేసింది.

మన సమాజం జీవించాలంటే ఏదొక పని చేయాలి. శ్రమలేకుండా జీవనం సాగించడం మానవ జాతికి కుదరదు. సామాజిక పరిణామక్రమంలో, నూతన నాగరకతలు పుట్టుకొచ్చే సమయాల్లో మానవ అవసరాలు తీర్చడం కోసం కొత్త కొత్త వృత్తులు పుట్టుకొచ్చాయి. మనం బతకడానికి ఈ వృత్తులన్నీ అవసరమే. ఇతర ప్రపంచంలో వృత్తులు వృత్తులుగానే గౌరవించబడ్డాయి. వృత్తిపరంగా ఆర్థికస్థితిగతుల్లో హెచ్చుతగ్గులు ఉండొచ్చుకాని, “నీచ దృక్పథాలు” లేవు.

ఈ నీచమైన సంస్కృతి మనదేశంలో పుష్కలంగా ఉంది. ఒక వృత్తి గొప్పది, ఒక వృత్తి నీచమైంది అనే ఆలోచన పుట్టి, వృత్తి ‘కులంగా’ కరుడు కట్టుకుపోయింది-
ఈ పాపంలో వైదిక సంస్కృతి మరెవ్వరికీ వీసమెత్తు వాటా కూడా ఇవ్వదు.
వృత్తుల్ని బట్టి నిమ్నకులం వారిగా, అంటరానివారిగా ఎంచిన సమాజంలో పుట్టిన తొలి వేకువ కిరణం గౌతమ బుద్దుడు.-
ఏ కులం వారైనా, ఏ వృత్తి వారైనా మనుషులంతా ఒక్కటే అని, అందరూ అక్షర జ్ఞానానికీ, ధార్మిక జీవనానికీ, పాండిత్యాలకీ అర్హులేనని చాటిచెప్పాడు. చేసి చూపించాడు.

అంటరాని కులంలో పుట్టిన పాకీ పనివాడైన సునుతుణ్ణి “పూజ్యభిక్షువుగా” మార్చాడు. చర్మకార కులంలో పుట్టిన ‘ప్రకృతి’ (ఛండాలిక) అనే ఆమెను గౌరవనీయ భిక్షుణిగా చేశాడు. మంగలి కులానికి చెందిన ‘ఉపాలికి’ బౌద్ధ సంఘంలో అగ్రాధిపత్యం ఇచ్చాడు.
ఏ పని అయినా గౌరవనీయమే, ఆ పనిలో నీజాయితీ, నిబద్ధత ఉందా లేదా? అదే ముఖ్యం. అలా పని చేసుకొని బతకడం ‘సరైన జీవనం” అవుతుందని బౌద్ధం చెప్తుంది.

కేవలం శాస్త్రాలు చదవడం, మంత్రాలు వల్లించడం, యజ్ఞయాగాలు నిర్వహించడం ఇలాంటి పనులే ఉన్నత జీవన విధానంగా భావిస్తూ, మిగిలిన పనుల్ని పాపకర్మకొద్దీ నీచకులాల్లో పుట్టి చేసే నీచమైన పనులుగా భావిస్తూ ఉండే సమాజాన్ని హేళనచేస్తూ చెప్పే ఒక కథ ఉంది.

ఒకరోజున మూడు వేదాల్ని కాచి వడపోసిన ఒక మహా పండితుడు రాజధానికి పోయి, రాజుగారితో యజ్ఞయాగాలు చేయించి సంభావనాలు పుచ్చుకొని తన గ్రామానికి తిరిగివస్తూ పడవ ఎక్కాడు. ఆ పడవలో మరెవ్వరూ ఎక్కలేదు. ఇతరులు ఎక్కితే అంటు తగులు కుంటుకుందని తానొక్కడే ఎక్కి వస్తున్నాడు. కొద్దిదూరం పోయాక పడవ నడిపేవాడు అతని ఆహార్యం వంక, ధనం సంచుల వంక అదేపనిగా చూస్తున్నాడు.

“ఏంరా! సరంగూ! అలా ఎగాదిగా చూస్తున్నావ్? ఈ గౌరవం, ఈ సంపదలు అంత తేలిగ్గా రావురా, వీటికి పెట్టి పుట్టాలి. నాకు ఆ యోగ్యత ఉంది. ఉన్నత బ్రాహ్మణ కాలంలో పుట్టాను. మరి నీవు? నీచకులంలో పుట్టావు. పడవ నడపడం, చేపలు పట్టుకోవడం తప్ప, కనీసం ఒక్క శాస్త్రమైనా చదివావా? నీకు గణిత శాస్త్రం తెలుసా?” అని అడిగాడు.
“లేదు, స్వామీ!”
“జ్యోతిశ్శాస్త్రం తెలుసా?”
“ఛందశ్శాస్త్రం తెలుసా?
“ఆగమాలు తెలుసా?”
“వేద విధులు, వేదమంత్రాలు ఎరుగుదువా?”
అంటూ తన కొచ్చిన శాస్త్రాలు, రాని శాస్త్రాలు అన్నీ ఏకరువుపెట్టాడు.
ప్రతి దానికీ “రాదు స్వామీ! తెలియదు సామీ” అంటూ వినమ్రంగా జవాబు చెప్పాడు పడవ నడిపేవాడు. “ఐతే నాలాగా నీవెలా బతగ్గలవురా?”అన్నాడు ఠీమిగా.
పడవ మెల్లగా నది మధ్యకు చేరింది. ఇంతలో వాతావరణం మారింది. ఆకాశంలో మబ్బులు కమ్మాయి. మారుగాలి చెలరేగింది. నదిలో నీరు సుడి తిరిగింది. పడవ సుడిలోకి జారింది.
అప్పుడు పడవ వాడు-
“సామీ! తమరు ఈత శాస్త్రం చదివారా?” అని అడిగాడు.
“లేదురా. నాకు ఈత రాదురా….” అన్నాడు.
“అయితే, మీ కొచ్చిన ఏ శాస్త్రం మిమ్మల్ని బతికిస్తుందో ఆలోచించుకోండి….
పడవ మునిగిపోతోంది. నేను ఈదుకుంటూ బతికి ఒడ్డుకు చేరగలను” అంటూ సుడిలో దూకి ఈదుకుంటూ ఒడ్డుకు చేరాడు. పండితుడు పరమవదించాడు.

మహాపండితుల ‘ముట్టెపొగరు’ దించే కథ ఇది-
ఇలాంటి కథలు బౌద్ధంలో ఎన్నో ఉన్నాయి. బుద్ధుడు బోధిసత్వునిగా, నీచమైన కులాలుగా వైదిక మతం ఎంచిన ఎన్నో కులాల్లో పుట్టాడు.
చివరికి ఈ బౌద్ధ భావజాలం మహాభారతాన్ని కూడా తాకింది. “ధర్మవ్యాధోపాఖ్యానం” అందులో ఒకటి.
కాబట్టి, ‘సరైన జీవనం’ విషయంలో కూడా బౌద్ధం వైదిక భావజాలాన్ని తునాతునకలు చేసింది.-
ఎంతగా చేసిందంటే… మతం పేరుతో ప్రజల్లో మూఢనమ్మకాల్ని పెంచి పోషించి, వారి బలహీనతల మీద బతికే ‘మంత్రాల్ని, మంత్రగాళ్ళని, జ్యోతిష సాముద్రికుల్ని, వైదిక కర్మకాండల్నీ ఏకరువు పెట్టి, ఎండగట్టించి, అవన్నీ అనైతిక జీవన మార్గాలే అని బౌద్ధం ఎలుగెత్తి చాటింది.

-బొర్రా గోవర్ధన్, 9390600157