Home తాజా వార్తలు క్రేజీ స్టార్‌కు జోడీగా…

క్రేజీ స్టార్‌కు జోడీగా…

Catherine Tresa and Vijay Devarakondaబ్లాక్‌బస్టర్ హిట్స్ అర్జున్ రెడ్డి, గీత గోవిందం సినిమాలతో టాలీవుడ్‌లో యంగ్‌స్టార్‌గా దూసుకుపోతున్నారు విజయ్ దేవరకొండ. గత ఏడాది తెలుగు బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఈ యువ కథానాయకుడు ప్రస్తుతం ‘డియర్ కామ్రేడ్’ చిత్రంలో నటిస్తున్నారు. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రం వేసవి చివరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘డియర్ కామ్రేడ్’ చిత్రం పూర్తయిన తర్వాత క్రాంతిమాధవ్ దర్శకత్వంలో కె.ఎస్.రామారావు నిర్మాణంలో విజయ్ దేవరకొండ ఓ చిత్రం చేయబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కాబోతున్న ఈ సినిమాలో హీరోయిన్‌ను తాజాగా ఫైనల్ చేశారు.

విజయ్‌కు ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం ఆయనతో కలిసి నటించడానికి ఏ హీరోయిన్ అయినా నటించేందుకు ఆసక్తి చూపడం ఖాయం. ఈ నేపథ్యంలో దర్శకుడు క్రాంతిమాధవ్ యంగ్ బ్యూటీ కేథరిన్‌ను ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎంపిక చేశారని తెలిసింది. అందంతో పాటు మంచి నటనా ప్రతిభ ఉన్న కేథరిన్‌కు తెలుగులో ఇప్పటివరకు మంచి అవకాశం దక్కలేదు. దీంతో ఇంకా ఆమె సెకండ్ గ్రేడ్ హీరోయిన్‌గానే ఉంది. అల్లు అర్జున్‌తో ‘సరైనోడు’ చిత్రంలో నటించిన ఈ బ్యూటీ ఇప్పుడు విజయ్ దేవరకొండకు జోడీగా ఎంపికైంది. కేథరిన్ తెలుగులో రానా చిత్రం ‘నేనే రాజు నేనే మంత్రి’ తర్వాత మరే సినిమా చేయలేదు. తమిళం, హిందీలో అడపా దడపా అవకాశాలైతే వస్తున్నాయి కానీ ఆమెకు స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు మాత్రం దక్కడం లేదు. క్రాంతిమాధవ్ ఇచ్చిన ఈ ఆఫర్‌తో అయినా కేథరిన్ తెలుగులో స్టార్‌డమ్‌ను దక్కించుకుంటుందేమో చూడాలి.

Catherine Tresa selected for Vijay Devarakonda Movie