Home ఎడిటోరియల్ హానికర పశు ఆంక్షలు

హానికర పశు ఆంక్షలు

Cow-Cartoon

గోవధ నిషేధం సహా పశు గణాల క్రయవిక్రయాలపై కేంద్రం విధించిన కొత్త నియంత్రణలు పాడి పరిశ్రమతో ముడిపడ్డ జీవనోపాధులను దెబ్బతీయడంతోబాటు వీధి పశువుల సంఖ్యను విపరీతంగా పెంచుతాయి. ఈ నెల 23న కేంద్ర ప్రభుత్వం గెజెట్ నెం.396 ద్వారా పశువుల మార్కెట్ల క్రమబద్ధీకరణ కోసం జంతువుల పట్ల క్రూరత్వ నిరోధక చట్టాన్ని సవరిస్తూ కొత్త నిబంధన లను తెచ్చింది. దీనితో రైతు మర్యాదపూర్వకంగా సాగించుకొంటున్న బ్రతుకు తెరువు తుడిచి పెట్టుకుపోతుంది.
చట్టం 22వ సెక్షన్ క్రింద పశువుల అమ్మకంపై ఆంక్షలను అమలులోకి తెచ్చారు. ఆ పశువును చంపడంకోసం అమ్మడంలేదని దాని యజమాని ( రైతు) మార్కెట్ కమిటీకి స్వయంగా వచ్చి నిర్ధారణ పత్రాన్ని ఇవ్వాలి. అలాగే ఆ పశువును కొంటున్న వ్యక్తి దానిని వ్యవసాయ పనుల నిమిత్తమే కొంటున్నామని, చంపడంకోసం కాదనీ హామీని లిఖితంగా ఇవ్వాలి. కొన్న ఆరునెలలలోగా ఆ పశువును తిరిగా అమ్మడం జరగలేదని నిర్ద్ధారణ కోసం ఆ రికార్డులను మార్కెట్ కమిటీ భద్రపరుస్తుంది.
మార్కెట్ కమిటీలు రికార్డులు దాచాలి
కమిటీ వారు ఆ పశువు, దాన్ని కొన్నవ్యక్తి, అమ్మినవ్యక్తి గుర్తింపు రికార్డులను కూడా భద్రపరుస్తారు. ఈ నిబంధనల ప్రకారం పాడిపశువు అంటే ఆవు, లేగదూడ, ఎద్దు, దున్నపోతు, ఒంటె తదితరాలు. ‘వధించడం’ అన్నది కూడా నిర్వచించారు. వధించడంతో సహా క్రూరమైన ప్రయోజనాల కోసం పశువులను రవాణా చేయడం, పశువుల మార్కెట్‌కు తరలించడం కూడా నిషిద్ధం. ఈ నిబంధన ద్వారా కేంద్రప్రభుత్వం దేశవ్యాప్తంగా పాడిపశువులు, గొడ్ల వధను నిషేధించింది. అలాగే గొడ్డుమాంసం తినడాన్ని కూడా నిషేధించినట్లే. అయితే పర్యావరణ మంత్రి ఈ వాస్తవాన్ని ఖండిస్తున్నారు.

పశువుల సంత రైతుకు కీలకం

పశువుల సంతలు పశువులు చేతులు మారడానికి ఉపయోగ పడుతున్న కీలక కేంద్రాలు. కొత్త నిబంధనలతో మార్కెట్ ద్వారా స్వేచ్ఛగా పశువులు చేతులు మారడం ఆగిపోయి వ్యాపారులు, ఇతరుల జీవనోపాధి దెబ్బతింటుంది. పశువుల ఉత్పత్తితో మార్కెట్లు, ఇతరుల ప్రయోజనాలు ముడిపడి ఉన్నాయి. వాటి స్వేచ్ఛాయుత క్రయవిక్రయాలపై ఆంక్షలవల్ల అనేకమంది సంబంధీకుల బతుకు దెరువు దెబ్బతింటుంది. ఒట్టిపోయిన ఆవులవల్లనే పాడిపరిశ్రమ ఆదాయంలో 40శాతం వస్తున్నట్లు గణాంక అంచనాలు తెలుపు తున్నాయి. ఈ ఆవులకు మార్కెట్‌లేని పక్షంలో పాడిపరిశ్రమ ద్వారా రైతుల దైనందిన ఉత్పత్తి వ్యవస్థ దెబ్బతింటుంది. జీవించడానికి, బతుకుదెరువు సాగించడానికి రైతులకు గల హక్కు ప్రమాదంలో పడుతుంది. పాడిపరిశ్రమ తాలూకు జీవనోపాధులు, ఎద్దులు ఆధారంగా సాగే వ్యవసాయ జీవనోపాధులు పూర్తిగా దెబ్బతిని రైతులు నష్టాల్లో మునుగుతారు. ఈ చట్టం అటు రైతులకు, ఇటు పశువులకు కూడా క్రూరమైనదిగా మిగులుతుంది. రైతులు తమ పాడిపశువులను, గేదెలను కేవలం పాలకోసం, వ్యవసాయ పనికోసం పెంచుతారు. అనేక కారణాలపై వారు ఒక్కొక్కసారి తమ పశువులను అమ్మేసి కొత్తవి కొంటారు. ప్రతిసారి ఏదో ఒక రైతు కొనడానికి తయారుగా ఉంటాడని ఈ చట్టం ఊహిస్తున్నది నిజం కాదు.

ఒట్టిపోయిన పశువుల సమస్య తీవ్రం

రైతు అయినంతమాత్రాన అందరూ పాడిపశువులను పెంచరు. పైగా పాలు ఇవ్వని పశువును ఏ రైతూ కొనడు. గేదె లేదా దున్నపోతు విషయంలో కూడా ఇది నిజం. వ్యవసాయ పనులు సాగుతున్నప్పుడు కొందరు రైతులు పనిచేసే స్థితిలో ఉన్న ఎద్దులను అమ్మాలను కుంటారు. కాని అంత సులభంగా వాటికి కొనేవారు దొరకరు. ఆవులు, గేదెల విషయంలో సైతం ఇదే కథ.

దుర్భిక్షంలో పశుపోషణ భారం

దేశంలో చాలాచోట్ల ప్రస్తుతం ఇదే పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్ లోని అనంతపూర్‌లో, తమిళనాడులో ప్రస్తుతం దుర్భిక్షం తీవ్రంగా ఉంది. అక్కడ ప్రతి ఒక్కరు తమ ఆవులు, ఎడ్లను అమ్మేయాలని చూస్తున్నారు. ఎందుకంటే వాటికి నీరు ఇవ్వడం, మేతవెయ్యడం చాలాకష్టం. కొనేరైతు ఎవరూ సిద్ధంగా లేకపోయినా, వాటిని అమ్మడం ద్వారా తమకు మంచి లాభం వస్తుందని రైతులు ఆశతో ఉంటారు. ఎందుకంటే కొందరు వాపారులు పశువధ్యశాలలకు క్రయవిక్రయాల్లో మధ్యవర్తులుగా వుంటారు. రవాణాలో గాని, వధించడంలోగాని పశువులపై విధినిషేధాలు అమలులోలేని రాష్ట్రాల్లో కూడా ఇది నిజం. గోవధ నిషేధం అమలులో ఉన్న రాష్ట్రాలనుంచి అటువంటి నిషేధం లేని రాష్ట్రాలకు పశువులను అక్రమంగా రవాణా చేయడం ఉంది.
పాడిపరిశ్రమకు పశువధ, పశువుల సంతలు, గొడ్డుమాంసం, తోలు ఉపకరిస్తాయి. మనదేశంలో గొడ్డుమాంసంకోసం పాడిపశువు లను రైతులు పెంచరు. వ్యవసాయ పనులకోసం, పాడికోసం వాటిని పెంచుతారు. అయితే ఒట్టిపోయిన పశువులను సంతలో అమ్మడానికి ప్రయత్నిస్తారు. మధ్య దళారీలు వాటిని కబేళాలకు పంపడానికి కొనడం ఆనవాయితీ ఉంది. కేవలం మాంసంకోసం పశువులను పెంచే ఆనవాయితీ లేదు.
ఒక పక్క ఇయు, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అమెరికా భారీ ఎత్తున సబ్సిడైజ్డ్ పాలపొడిని భారతదేశంలో అక్రమంగా మేటవేయ డానికి చూస్తున్న సమయంలో దానిని నిలువరించడానికి భారతదేశపు పాడిపారిశ్రామిక సహకారసంఘాలు పోరాడు తున్నాయి. ఇటువంటి తరుణంలో పాడిపరిశ్రమను ప్రభుత్వం కొత్త ఆంక్షలతో చంప బూనడం నిజంగా తెలివితక్కువతనం. లేదా ఆ దేశాల పాలపొడి విక్రేతలకు సహకరించడానికైనా అయి ఉండవచ్చు.

– సాగర్ ఆర్.రాందాస్